Saturday, October 31, 2009

పరమత ద్వేషం అవసరమా ?

ఈ మధ్య హిందూ-క్రైస్తవ కలహాల గురించి పత్రికలలో చూస్తున్నాము.ఒరిస్సాలో స్వామి లక్ష్మణానంద,అతని అనుచరుల హత్య,కర్ణాటక లోని కొన్ని జిల్లాలలో హిందూదేవతలను కించపరిచి వ్రాసిన పుస్తకం ముద్రించి పంపిణీ చేయడం,అందుకు ప్రతిగా చర్చిలపైన దాడులు మనము చూస్తున్నాము.ఇక హిందూ-ముస్లిం కలహాల గురించి చెప్పనవసరం లేదు.అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి? అవసరమా? అసలు నాగరికులు చేయవలసిన పనులేనా ఇవి ?

సైన్సుపరంగా,నాగరికతపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నామని అనుకుంటున్నాము.కాని మనిషిపరంగా అంటే మానవత్వపరంగా,నైతికంగా,సంస్కారపరంగా అభివృద్దిచెందకపోవడమే దీనికి ప్రధానకారణం గా కనిపిస్తోంది.ఇంకా ప్రధాన కారణం వ్యక్తి ఆరాధన శృతి మించడం.ఆరాధించబడేవారి బోధనలను మరిచిపోవడం."నీవంటే నాకు చాలా ఇష్టము,ప్రాణము.కాని నువ్వు చెప్పేమాటలను నేను వినను,పాటించను" అంటున్నారు.అలాంటప్పుడు ఆ ఆరాధింపబడే వారికి తమను పూజించే వారంటే ఏమి ఇష్టము ఉంటుంది?.ఏ మతమైనా ఏం చెబుతుంది? ఇతరులను చంపమనా?కాదుకాదు ప్రేమించమని,ద్వేషింపవద్దని.దీనికి ఉదాహరణగా వివిధ మతగ్రంథాలు ఏమంటున్నాయో చూడండి.

భగవద్గీత:

"ఎవరెవరు ఏఏ రూపాన్ని ఆరాధిస్తారో వారికి ఆయా రూపాలందే శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేసి వారిని ఆయా రూపాలతోనే అనుగ్రహిస్తున్నాను. ( విజ్ఞానయోగం 21-22)

ఖురాన్:

" ఎవరు ఖురాన్‌ను నమ్ముతారో,మరియు ఎవరు(యూదుల)లేఖనాలను అనుసరిస్తారో,మరియు క్రైస్తవులు...మరియు దేవునిపై నమ్మకం కలవారందరూ ధర్మంగా పని చేయువారందరూ అంతిమదినము నందు తమ దేవుని చేత బహుమానాలు పొందుతారు.వారు దుఃఖంచేగానీ,భయంచే గానీ బాధపడరు". ( 2:62)

బైబిల్:

మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి.(ముత్తయి 5:44)

ఏసు అనుచరులు సమారియాలోని గ్రామంలోనికి ప్రవేశించారు.కానీ ఆ గ్రామ ప్రజలు వారిని తిరస్కరించారు.అప్పుడు శిష్యులు ఏసు తో "ఎలీజా చేసినట్టు మీరు మమ్ము స్వర్గం నుండి అగ్నిని రప్పించి వారిని భస్మం చేయమంటారా?"అన్నారు.అప్పుడు ఏసు వారితో "మీరు ఎలాంటివారో మీకు అర్థం కావడంలేదు.మనుష్యకుమారుడు మనుష్యుల ప్రాణాలను కాపాడుటకు వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు"అన్నాడు. ( లూకా 9:52-56)

ఈ విధంగా ప్రతి మతగ్రంథంలోనూ పరమతసహనాన్ని,తోటిమానవులను ప్రేమించమని ఉండగా ఎంతమంది వీటిని అనుసరిస్తున్నారు? ఈ గ్రంథాలలో మనం పూజించేవారి ఆదేశాలు,భోధనలు ఉండగా వాటిని పట్టించకొనకుండా పెడచెవిన పెట్టి వారిని పూజిస్తూ వారి పేరుపై కలహాలు సృష్టిస్తే వారు మెచ్చుకొంటారా? ఏమైనా అడిగితే తమ దేవుని కోసం చేస్తున్నామంటారు.కాని ఆ దేవుళ్ళు చెప్పినది మనం స్పష్టంగా పైన చూసాము.ఆ దేవుళ్ళు వీరి పనులను అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా??

ఉదాహరణకు ఒక తోట యజమాని తన ఇద్దరు పనివారికి తోటపని చెప్పి చేయమన్నాడు.అందులో ఒకరు తనకు ఇచ్చిన పని చేస్తుండగా మరొకరు తమ యజమానిని "మీరు గొప్పవారు.మీ చేతులు ఎంతోసుందరాలు.మీ మనసు వెన్నలాంటిది."అని పొగుడుతున్నాడని అనుకొందాము.ఆ ఇద్దరిలో యజమాని ఎవరిని ఇష్టపడతాడు?తను చెప్పిన పని చేయకుండా తనను పొగిడేవాడినా? లేక తను చెప్పినపని సక్రమంగా చేసినవాడినా? ప్రస్తుతం ఈ కలహాలను చేసేవారి పరిస్థితి,సృష్టించేవారి పరిస్థితి ఈ పొగిడేవాని పని లాగానే ఉంది.

ద్వేషం కానీ,కలహం కానీ ఎదుటివారిలో మార్పు తీసుకురాదనే విషయం వీరు ఎందుకు తెలుసుకోవడంలేదు ? ఎప్పుడైతే తమ మతగ్రంథాలను కూలంకుషంగా చదివి అర్థం చేసుకుంటారో తమ ఇంగితజ్ఞానాన్ని,యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తారో అప్పుడే ఇలాంటి కలహాలు ఆగుతాయన్నది నా అభిప్రాయం

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070