Showing posts with label మంచిపుస్తకం. Show all posts

Sunday, December 13, 2009

శ్రీశ్రీ – ‘అనంతం’

ఈ శతాబ్దం నాది” అని శ్రీశ్రీ చేసిన ప్రకvj13_sri-sriటన ఎంత ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే. ఈ ప్రకటన కనిపించేది ఆయన ఆత్మకథ ‘అనంతం’ లో. ‘ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల’ అని శ్రీశ్రీ ప్రకటించిన ‘అనంతం’ ఓ క్రమ పద్ధతిలో రాసిన పుస్తకం కాదు. తన జీవితాన్ని గురించి వివిధ పత్రికలలో రాసిన అనేక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కవిగా, కమ్యూనిస్టుగా, సినిమా రచయితగా ప్రపంచానికి తెలిసిన శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి, కమ్యూనిజాన్ని గురించీ, సినిమాల గురించీ తన అభిప్రాయాలను చాలా సూటిగా వ్యక్త పరిచారు.
విశాఖపట్నం లో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన శ్రీరంగం శ్రీనివాసరావు బాల్యం చాలా వైభవంగా గడిచింది. సవతి తల్లి సుభద్రమ్మ కన్నతల్లిని మించి పెంచింది. తండ్రి వెంకట రమణయ్య కొడుకుని స్నేహితుడిగా చూశాడు. “నా పద్దెనిమిదో ఏట మొదటి సారి సిగరెట్ తాగాను. సిగార్స్.. నాన్నే కొనిచ్చారు..” ఈ వాక్యాన్ని బట్టి ఆ తండ్రి కొడుకుల అనుబంధాని అర్ధం చేసుకోవచ్చు. శ్రీశ్రీ పెళ్ళయిన కొత్తలో భార్యని విడిచి కృష్ణశాస్త్రి వెంట వారం రోజులు విజయనగరంలో గడిపినప్పుడు మాత్రం సున్నితంగా మందలించారు రమణయ్య.
పుట్టిన ఊరిపట్ల తన మమకారాన్ని ఏమాత్రం దాచుకోలేదు శ్రీశ్రీ. ఎగసిపడే సముద్ర కెరటాలు తనలో కవితావేశాన్ని ఎలా రగిల్చాయో, పెరుగుతున్న పారిశ్రామికీకరణ తనలో కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపిందో వివరించారు. శ్రీశ్రీ కి తొలిసారి ‘బయోస్కోప్’ పరిచయమైంది విశాఖ లోనే. సినిమాల పరంగా ఇరవయ్యో శతాబ్దం చార్లీ చాప్లిన్ ది అన్నారు. అంతర్జాతీయ సినిమాల గురించి విస్తారమైన నోట్సు లభిస్తుంది ఈ పుస్తకంలో. తెలుగు సినిమా ఎదగడం లేదన్న అభిప్రాయం చాలాచోట్ల ప్రకటించారు.

బాల్యంలో యెంతో వైభవం అనుభవించిన శ్రీశ్రీ యవ్వనంలో దరిద్రాన్ని అనుభవించారు. జీవిక కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. కవిత్వాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. సినిమాలకు రాయడం కేవలం బ్రతుకు తెరువు కోసమే అన్నారు. “అనంతం లో మోతాదును మించి సెక్సును ప్రవేశ పెట్టానని నేననుకోను” అన్నారు కానీ, ఇందుకు సంబంధించిన విషయాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అయినా ‘ఆత్మకథ’ లో ‘మోతాదు’ ను నిర్ణయించగలిగేది ఎవరు?
రమణమ్మ తో బాల్య వివాహం, సరోజ తో ద్వితీయ వివాహం లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు, అరసం పుట్టుక, ఎదుగుదల, విరసం పుట్టుకకి దారితీసిన పరిస్థితులనూ సవివరంగా రాశారు. కృష్ణశాస్త్రి పట్ల అభిమానాన్నీ, విశ్వనాథ రచనా శైలి పట్ల తన అభిప్రాయాలనూ సూటిగా ప్రకటించారు. మిత్రుడు కొంపెల్ల జనార్ధన రావు గురించి సుదీర్ఘంగా వివరించారు. తన తండ్రి తర్వాత గురు స్థానం ఇచ్చిన రెండో వ్యక్తి అబ్బూరి రామకృష్ణా రావు కోసం ఓ అధ్యాయం కేటాయించారు.

కవిత్వాన్ని గురించి రాసినంత వివరంగానూ, తన విదేశీ పర్యటనల గురించీ రాశారు శ్రీశ్రీ. రష్యా ఆయనని ఎంతగానో ఆకట్టుకుంది. భారత దేశాన్ని ఎప్పటికైనా రష్యా లా చూడాలన్నది ఆయన ఆకాంక్ష. చైనా వెళ్ళే అవకాశం ‘రాజకీయ కారణాల’ వాళ్ళ మిస్ కావడం మొదలు, స్టాక్ హోం, మాస్కో పర్యటనలు, ఆయా దేశాల్లో తనకి నచ్చిన సంగతులను కళ్ళకు కట్టినట్టు రాశారు. విరసం లో సమస్యలు, తనపై వచ్చిన ఆరోపణలు, వాటికి శ్రీశ్రీ ఇచ్చిన వివరణలతో ముగుస్తుంది ఈ పుస్తకం.

‘అనంతం’ అన్న పేరు ఈ పుస్తకానికి సరిగ్గా సరిపోతుంది. ప్రారంభం, ముగింపు లేని రచన ఇది. కొన్ని కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ వచ్చి కొంచం విసుగు కలిగిస్తాయి. ఓ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కమ్యూనిజం వైపు ఆకర్షితుడు కావడానికి దారి తీసిన పరిస్థితులేమిటో శ్రీశ్రీ నోటి నుంచి వినలేము. పుస్తకం పూర్తీ చేశాక మొత్తం సంఘటనలని ఓ క్రమంలో పేర్చుకున్నా, చాలా చోట్ల ఖాళీలు కనిపిస్తాయి. ఈ ఆత్మకథలో ఎదుటివారి — ముఖ్యంగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నవారి — వ్యక్తిగత విషయాలను రాయడం నాకు కొరుకుడు పడలేదు. తనకు సంబంధించిన విషయాలను చెప్పేటప్పుడు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించిన శ్రీశ్రీ, ఎదుటి వారని కొన్ని చోట్ల చిన్నబుచ్చారనిపిస్తుంది.

కేవలం శ్రీశ్రీ ని గురించే కాక, గడిచిన శతాబ్దం లో రాష్ట్రంలోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన పరిణామాలను గురించి తెలుసుకోవాలనే వారికి ఉపయోగపడే ‘అనంతం’ ని విశాలాంధ్ర ప్రచురించింది. అభ్యుదయ సాహిత్యం

Monday, November 30, 2009

ఎన్నో ప్రశ్నలు రేపే

ఎన్నో ప్రశ్నలు రేపే "సంస్కార"

సంస్కార అంటే ఇదేదో మనిషి మనసుకో, ప్రవర్తనకో సంబంధించిన సంస్కారం కాదు. ఒక మృతదేహం తాలూకు అంతిమ సంస్కారం! అవును, ఈ నవల అంతా ఒక శవం అంతిమ సంస్కారం చుట్టూనే తిరుగుతుంది.

కన్నడ నవలా సాహిత్యంలో ఒక సంచలనం రేపి గొప్ప అవార్డు సినిమా గా నిలిచిన ఒక గొప్ప నవల "సంస్కార"! .బ్రాహ్మల్లో తరతరాలుగా గూడు కట్టుకు నిలిచిపోయిన పలు ఛాందస భావాలను, మూఢాచారాలను నిశితంగా ప్రశ్నిస్తూనే తాను నమ్మినధర్మాలని  అన్నింటినీ పోగొట్టుకున్నానన్న భావనతో, చేసిన తప్పుని ఒప్పుకోనూలేకా,బ్రాహ్మణత్వానికి దూరమూ కాలేకా రెండు విరుద్ధ ధర్మాల మధ్య నలిగిపోయే ఒక బ్రాహ్మణుడి మానసిక సంఘర్షణకు అద్దంపట్టే నవల.

ఎన్నడో ఎవరో  పూర్వీకులు పెట్టిన ఆచారాలను పాటించడం వల్ల బ్రాహ్మణత్వం నిలుస్తుందా? అవి పాటించని నాడు అది లేకుండా పోతుందా? అన్న మీమాంస ఈ నవల్లో ప్రధానంగా కనపడుతుంది. చదివిన తర్వాత ఒక పట్టాన వదిలిపెట్టదు పాఠకుడిని! కొన్ని వందల ప్రశ్నలని రేపుతుంది.

ఈ నవలా రచయిత యు.ఆర్ అనంతమూర్తి కన్నడసాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ వేత్త,విమర్శకుడు కూడా!.జ్ఞానపీఠ,పద్మభూషణ్ అవార్డుల గ్రహీత. మైసూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.

స్వయంగా బ్రాహ్మణుడైన అనంతమూర్తి సంస్కార నవల్లో బ్రాహ్మణ మూఢాచారాల్ని చీల్చి చెండాడటం చాలా మందికి   మింగుడుపడకపోయినా నవల మాత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రధారిగా సినిమాగా కూడా రూపొందింది.(నిజానికి ఈ సినిమా చూస్తే మరింత సమగ్రంగా రాయవచ్చనే ఉద్దేశంతో డీవీడీ కోసం ప్రయత్నించాను గానీ బెంగుళూరులో కూడా దొరకలేదు)

                                                  రచయిత అనంతమూర్తి

కర్నాటకలోని తుంగభద్రా నదీ తీరంలోని ఒక మధ్వ బ్రాహ్మణ అగ్రహారం దూర్వాసపురంలో నారాయణప్ప అనే బ్రాహ్మణుడి చావుతో ప్రారంభమవుతుంది ఈ నవల. అతడు నవల ప్రారంభంలోనే శవంగా మనకు పరిచయం అయినా కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది.

అగ్రహారంలో నివశించే బ్రాహ్మణులంతా యుగాలనాటి ఆచారాలను,పద్ధతులను నిక్కచ్చిగా పాటిస్తూ  బ్రాహ్మణ్యాన్ని నిలబెడుతున్నామని,తమ శాఖ కంటే ఇతర శాఖలు తక్కువ వారనే అహంకారంతో, ఇంకా చెప్పాలంటే అజ్ఞానంతో బతికేస్తూ ఉంటారు. తాము ఆ ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారో వాళ్ళు ఆలోచించడానికి  కూడా ఆసక్తి చూపరు. పాటించకపోతే అది తమ సర్వనాశనానికి దారి తీస్తుందని భయం!

కాశీలో వేద వేదాంగాలు చదువుకుని మహాపండితుడైన ప్రాణేశాచార్యుల వారు ఆ అగ్రహారంలో నివశించడం వల్ల ఆ అగ్రహారానికి చుట్టుపక్కల ఎంతో గౌరవం. ఆయన ఇంద్రియాలను జయించి పుట్టుకతోనే రోగిష్టి అయిన ఒక స్త్రీని వివాహమాడి ఆమె సేవలో,వేదపఠనంలో కాలం గడిపే మహాపురుషుడు.

ఇతడికి పూర్తిగా వ్యతిరేకి భోగలాలసుడైన నారాయణప్ప. కుందాపురం నుంచి చంద్రి అనే వేశ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె సేవలోనే కాలం గడుపుతుంటాడు.అంతేనా? జంధ్యం తెంపి అవతల పారేసి ఇంట్లోని సాలగ్రామాన్ని ఎత్తి తుంగభద్రలో పారేస్తాడు.సాయిబుల కుర్రాళ్లని ఇంటికి పిల్చి బాతాఖానీ వేస్తాడు.

దేవాలయ కోనేట్లో చేపలు పట్టినవాళ్ళు రక్తం కక్కుకు చస్తారని అగ్రహారీకుల నమ్మకం! ఆ కోనేట్లో సాక్షాత్తూ బ్రాహ్మణుడైన నారాయణప్ప ముస్లిము లతో కల్సి చేపలు పట్టి తెచ్చి చంద్రితో వండించి భోంచేస్తాడు. దైవ పూజకై అగ్రహారీకులు పూలమొక్కలు పెంచితే ఇతడు మత్తెక్కించే పరిమళంతో మతులు  పోగొట్టే నైట్ క్వీన్ ఇంటిముందు పెచుతాడు.  అగ్రహారపు ఇతర కుర్రాళ్లను కూడా తనమార్గంలోనే పయనించేలా ప్రభావితం చేస్తుంటాడు.

ఒకరోజు ఉదయాన్నే నారాయణప్ప ఇంట్లో ఉన్న వేశ్య చంద్రి ప్రాణేశాచార్యుల వద్దకు పరుగున వచ్చి నారాయణప్ప చనిపోయిన వార్త చెప్తుంది. శివమొగ్గ నుంచి చంక కింద పెద్ద గడ్డతో వచ్చాడని, తీవ్రమైన జ్వరంతో రాత్రంతా బాధపడి ఉదయాన్నే మరణించాడని చెపుతుంది.

అగ్రహారమంతా ఉలిక్కి పడుతుంది. కులభ్రష్టుడైన నారాయణప్ప దహన సంస్కారాలు , ఉత్తర క్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. నిజానికి నారాయణప్ప తోడల్లుడు లక్ష్మణా చార్యులు, జ్ఞాతి గరుడాచార్యులు అగ్రహారీకులే! అయినా చంద్రి చేతి వంటనుకూడా తినే నీచుడైన  నారాయణప్ప దహన సంస్కారాలకు వారు ముందుకు రారు.

 బతికున్నపుడు నారాయణప్ప చేసిన అప్రాచ్యపు పనులన్నీ ఒక్కొక్కరూ ఏకరువు పెట్టి అతడిని కాలిస్తే తమకూ పాపం చుట్టుకుంటుందంటారు..!అసలు నారాయణప్ప ప్లేగుతో మరణించాడనీ, అది వేగంగా వ్యాపించే అంటువ్యాధనే తెలీనంత అజ్ఞానం అగ్రహారీకులది.

ఇంతలో చంద్రి వీరందరికీ మతిపోయేలా తన వంటిమీదున్న బంగారాన్నంతా తీసి ప్రాణేశాచార్యుల ముందు కుప్ప పెట్టి,దహన సంస్కారాల ఖర్చులకు వాడాల్సిందిగా కోరుతుంది. ఈ దెబ్బకు తట్టుకోలేని అగ్రహారీకులు తమ సహజ ప్రకృతిని నగ్నంగా  ఆవిష్కరిస్తూ "ఎంత కాదనుకున్నా బంధుత్వం తెగుతుందా? బ్రాహ్మణ్యాన్ని వాడు త్యజించాడు కానీ వాడిని బ్రాహ్మణ్యం వదిలేస్తుందా"అంటూ మాటలు మొదలెడతారు. గరుడా చార్యులు సంస్కారాలకు ఒప్పుకుంటాడేమోఅని లక్ష్మణా చార్యులు, ఇతడు వప్పుకుంటాడేమో అని గరుడా చార్యులు  ఖంగారు పడుతుంటారు.

కొంతమంది కొద్దిదూరంలో ఉన్న పారిజాతపురం అగ్రహారపు స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవాళ్ళు కాబట్టి వాళ్ళని ఈ సంస్కారాలు చేయమని అడిగి లేదనిపించుకుంటారు  ఇక ప్రాణేశాచార్యులు అడవిలో ఉన్న ఆంజనేయాలయంలో తాను దీక్షలో కూచుంటాననీ, ఆ స్వామి ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందేననీ స్పష్టం  చేస్తాడు.అంతా అంగీకరిస్తారు. 

ఇక్కడే కథ అనుకోని మలుపు తిరుగుతుంది. దీక్షలో కూచున్న ఆచార్యుల వారికి స్వామినుంచి ఎటువంటి సందేశమూ లభించదు. ఈ లోపు ఆకలికి తాళలేని చంద్రి తుంగభద్రలో స్నానమాడి అరటితోటలో పళ్ళు కోసుకుని అడవికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అపరాహ్నవేళ మరోసారి స్నానం చేసేందుకు  వచ్చిన ప్రాణేశాచార్యుల కాళ్ళమీద పడుతుంది చంద్రి..!

చిత్రంగా, పరమనిష్టా గరిష్టుడు, కఠోర తపస్సంపన్నుడు  అయిన ప్రాణేశుడు జీవితంలో తొలిసారి కలిగిన స్త్రీ స్పర్శ కు లొంగిపోతాడు. చంద్రి పరిష్వంగంలో కరిగి,  ఆమె  అందించిన సౌఖ్యానికి దాసోహమంటాడు.

ప్రాణేశాచార్యుల వారికి స్వామి సందేశం దొరకలేదని తెలుసుకున్న అగ్రహారీకులు ధర్మస్థల లోని మధ్వ గురువుల మఠాన్ని ఈ విషయంలో సంప్రదించేందుకు వెళతారు. చంద్రి లో తప్పు చేశానన్న అపరాథ భావన లేదు. ఇక అక్కడినుంచి వెళ్లిపోవాలన్న అభిప్రాయంతో ఒక సాయిబుల బండివాడిని బతిమలాడి అర్థ రాత్రి నారాయణప్ప శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి అతడిచేతే దహనం చేయించి మాయమవుతుంది.

 ఆ నిర్ణయం తీసుకునే సమయంలో ఒక్కక్షణం తొట్రుపడినా "ఇతడు ఇప్పుడు బ్రాహ్మడూ కాదు, శూద్రుడూ కాదు. ఇతడొక ప్రాణం లేని శవం" అని సర్ది చెప్పుకుంటుంది. శవం ఉన్న ఇంటికేసి ఎవరూ   పోకపోవడం వల్ల ఈ  విషయం ఎవరికీ తెలీదు.

ఈ లోపు ప్లేగు అగ్రహారంలో వేగంగా వ్యాపిస్తుంది. ప్రాణేశాచార్యుల భార్య మరణిస్తుంది. మఠానికి బయలుదేరిన అగ్రహారీకుల్లో కొందరు మరణిస్తారు.

భార్యను దహనం చేసిన ఆచార్యులు అపరాధ భావనతో,ఇక సర్వం త్యజించిన శూన్యమైన మనసుతో  ఊరు విడిచి గమ్యం తెలీని ప్రయాణం సాగిస్తాడు. దారిలో అతడితో కలిసి నడిచిన పుట్టన్న,మనసులో మళ్ళీ కలకలం రేపిన పద్మావతి,అన్న సంతర్పణలో నానా జాతులతో,(అందులోనూ తను సూతకంలో ఉండగా ) కల్సి భోజనం....ఎదురు చూడని పరిస్థితుల మధ్య ప్రాణేశాచార్యులు తన తప్పుకి  ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశంతో అగ్రహారంలో అందరి ఎదుటా తప్పు ఒప్పుకుని పాప  ప్రక్షాళనం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చి, దూర్వాసపురం అగ్రహారం దారిపడతాడు.

 ఇదే కథ!

మరి తర్వాత ఏమవుతుంది? అగ్రహారీకులు ఆయన చేసిన తప్పుని అంగీకరిస్తారా? మధ్వ శాఖకే మణికిరీటమై భాసిల్లిన ఆయన పెద్దరికం ఈ దెబ్బతో కొట్టుకుపోయిందా? నిలిచే ఉందా?  ...ఎవరికీ తెలీదు. ఎందుకంటే  "ఆ తర్వాత...తర్వాత ఏమవుతుంది?"అన్న ప్రశ్నతోనే నవల ముగుస్తుంది.   

ఇది కన్నడ సాహిత్యంలో ఎంతో సంచలనం సృష్టించిన  నవల, సినిమా కూడా!  కన్నడ సినిమా గురించి చర్చ జరిగిన ప్రతి చోటా చోటు చేసుకునే సినిమా!

1970 లో దీన్ని తెలుగు నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి(ఈయన తెలుగులో పెళ్ళినాటి ప్రమాణాలు, భాగ్య చక్రం వంటి సినిమాలు నిర్మించారు)దీన్ని సినిమాగా తీశారు. ప్రాణేశాచార్య పాత్రను గిరీష్ కర్నాడ్, చంద్రి పాత్రను స్నేహలతా రెడ్డి, నారాయణప్ప పాత్రను లంకేష్ పోషించారు. మొదట కుల విభేదాలను రేకెత్తించేదిగా ఉందన్న కారణంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను నిషేధించినా తర్వాత విడుదలై జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న చిత్రం ఇది!    

నవల విషయానికొస్తే అద్భుతమైన అనువాదం ఊపిరి తిప్పుకోకుండా  చదివిస్తుంది. కథా కాలం ఇప్పటిది కాదు కాబట్టి ఆనాటి మూఢాచారాల్ని కొంత వరకూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించవచ్చుగానీ వాటిని వారు  సమర్థించుకునే తీరు, ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. "మీ శాఖ  కంటే మా శాఖ గొప్పది"అని ఆ పేద బ్రాహ్మలు ఒకరినొకరు మోసం చేస్తున్నామని ఆత్మవంచన చేసుకోవడం జాలిని కల్గిస్తుంది.కానీ అది, ముఖ్యంగా ఆ అగ్రహారీకులకు struggle for existence! వారికి అంతకంటే మార్గం లేదు మరి!  జీవనోపాధే బ్రాహ్మణ్యమైనపుడు అది వారికి తప్పనిసరి!  

కుప్పలుగా చచ్చిపడే ఎలుకల్ని చూశాకైనా అది ప్లేగు అని గుర్తించకపోగా, వాటికోసం వచ్చే గద్దల్ని చూసి ఊరికేదో అరిష్టం వచ్చిపడిందంటూ శంఖాలు ఊదుతారు!

ఒకపక్క స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవారని నిరసిస్తూనే ఎవరికీ తెలీకుండా వారి ఇంట అటుకులు, ఉప్మా తినాలని ఉవ్విళ్ళూరతాడు దాసాచార్యుడు. అతడు తన ఇంట్లో తిని భ్రష్టుడైతే చూసి  ఆనందిద్దామనుకునే మంజయ్య!  

ఇలాంటి నగ్న చిత్రణ చాలామందికి మింగుడుపడక అనంతమూర్తిపై విమర్శల జల్లు కురిసింది.
ఇంతే కాక కర్ణాటక అగ్రహారీకుల జీవన శైలిని రచయిత బహిర్గతం చేసిన తీరు అనేక విమర్శలకు దారి తీసింది. 

రచయిత ప్రాణేశాచార్యుల అంతర్మధనాన్ని చిత్రించిన తీరు అబ్బురపడేలా చేస్తుంది.

చంద్రి సాంగత్యం ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత ఆ పండితాచార్యుడి ఆలోచనల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. రస రమ్య కావ్యాలను పురాణ కాలక్షేపం పేరుతో తాను చదివి వినిపిస్తుంటే విన్న యువకుల మానసిక స్థితి ఇప్పుడు తనకు అవగతమైందని భావిస్తాడు. 

అయినా, వేద వేదాంగాలు చదివిన పండితుడిగా తన పేరు చుట్టు పక్కల గ్రామాల్లో పరిచితం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరైనా తనను పడతారేమో’ అన్న శంకతో దాగి దాగి తన  అస్తిత్వాన్ని మరుగు పరచుకుంటాడు.

"ఇంతటి భయం నాకెప్పుడూ కలగలేదు.రహస్యం బయటపడుతుందేమో అని భయం! ఒకవేళ పడకపోయినా అబద్ధాన్ని బొడ్లో దాచుకుని ఈ మొహంతో అగ్రహారంలో ఎలా ఉండగలను"అని ప్రశ్నించుకుంటాడు.

మరోపక్క చంద్రితో తాను గడిపిన ఆ క్షణాలు దైవనిర్ణయాలు, అందులో తన ప్రమేయం లేదని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో నారాయణప్పను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. 

అడవిలో ఒక కాపు తన కూతురు బతుకు బాగుపడటానికి మంత్రం చెప్పమని అడిగినపుడు గ్రహిస్తాడు "తను బ్రాహ్మణ్యానికి దూరంగా పోతున్నా , అది తనను అంటిపెట్టుకునే"  ఉందని.

గుడిలో భోజనాల పంక్తిలో కూచుని ఇలా తర్కించుకుంటాడు..."ఈ భయం పోవడానికొకటే మార్గం! నారాయణప్ప దహనానికి నేనే బాధ్యత వహించాలి.ఏ అగ్రహారంలో నేను పెద్దగా నిలబడ్డానో, అదే అగ్రహారంలో బ్రాహ్మణ సమాజంలో నేను ధైర్యంగా నిలబడాలి. అందరి ముందూ 'ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఫలానా నిశ్చయానికి వచ్చాను!

 మీరిచ్చిన గౌరవాలు వదులుకుంటున్నాను, ఈ ఘనతను ముక్కలు ముక్కలుగా చించివేస్తున్నాను ' అని చెప్పాలి. ఏమని చెప్పాలి?  రోగిష్ఠి భార్యతో విసుగుపుట్టింది, చంద్రితో కలిశాను.సంత హోటల్లో కాఫీ తాగాను.కోడిపందాలు చూశాను.పద్మావతిని చూసి మోహపడ్డాను.భార్య పోయిన మైలలోనే దేవాలయంలో భోజనం చేశాను. నాతోపాటు కూచోమని బోయవాడిని ఆహ్వానించాను!..

కానీ నేనో అమోఘమూ, అభేద్యమూ అయిన సంపూర్ణ నిర్ణయానికి రావలసిందే! సూటిగా  మనుష్యుల కళ్ళలోకి చూడగలిగి ఉండాలి. అగ్రహారానికి మాత్రం వెళ్లాల్సిందే"

 అని.. ."పరంధామా, ఆ రోజు అడవిలో నా ప్రమేయం లేకుండా ఏ విధంగా నా నిర్ణయాన్ని విధించావో, అదే విధంగా ఈ రోజూ విధించు. జరగవలసినదేదో ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచే లోగా జరగనీ"అని దేవుడిని వేడుకుంటాడు.

నవల చదువుతున్నంత సేపూ అనేక ప్రశ్నలు చుట్టుముట్టి గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. చదివిన తర్వాత కూడా ఆ ప్రశ్నలు అనేక రూపాలు దాల్చి పాఠకుడి వెంటే తిరుగుతాయి. 

ప్రాణేశాచార్యుడితో పాటే మనమూ అడవిలో చెట్లూ పుట్టలూ దాటి ప్రయాణిస్తూ, అతడి అంతర్మధనంలో పాలు పంచుకుంటాం! జాలి పడతాం! బాధ పడతాం, పుట్టన్నతో మాట్లాడతాం, ఒకవైపు చంద్రి గురించి, మరో వైపు నారాయణప్ప మృతదేహం గురించి ఆలోచిస్తూ ఉంటాం! ఒక్కమాటలో చెప్పాలంటే పాఠకుడు ప్రాణేశుడిలో పరకాయ ప్రవేశం చేస్తాడు.

కన్నడ సాహిత్యంలోనే కాదు మరే ఇతర భాషా సాహిత్యంలోనూ ఈ ఇటువంటి మీమాంసా విశ్లేషణ ప్రధానమైన నవల రాలేదేమో!

కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించిన ఈ నవల ను తెలుగులోకి అత్యంత ప్రతిభావంతంగా అనువదించింది శ్రీ ఎస్.ఎల్ శాస్త్రి.ఈ పుస్తకం  ప్రస్తుతం ప్రతిచోటా అందుబాటులో లేదు. కానీ డిసెంబర్ లో జరిగే హైదరాబాదు బుక్ ఫేర్ లో దొరికే అవకాశం  ఉంది. నాకు 2006లో అక్కడే దొరికింది.

Thursday, October 29, 2009

ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు

'"నేను కొంచెం బాగా రాయగలిగినవి పజ్యాలు
అవే చేస్తున్నాను మిత్రులకు నైవేధ్యాలు
సమర్పిస్తున్నాను హోలు మొత్తం
స్వీకరిస్తారో కరుస్తారో మీ చిత్తం " అంటూ మొదలవుతాయి , 'ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు '
ఆర్నొక్కరాగంలో అమెరికాంధ్రుల ఇంటిగుట్టును తెలుగునాట రట్టుచేసెయ్యాలని ఆరుద్ర ఆత్రం

ఏదేశమేగినా .....వదులుకోజాలని అలవాట్లు , అందుమూలంగా వచ్చే అగచాట్లూ, అక్కడ మనవారి ఆచారాలూ, ఆడంబరాలూ .....ఆడక తప్పని 'తానా ' తందనాలు . ఒకటేవిటి, అంతా తల్లకిందులైన దేశంలో 'అమెరికన్ టెలుగూస్ ' గా చలామణీ అవుతున్న 'తెలుగుజీవుల ' జీవన చిత్రాన్ని కాస్తంత చంత్కారంగా మన కళ్ళముందుంచారు ఆరుద్ర . ఆయన ఇవి రాసేనాటికి సాఫ్ట్వేరు , హైటెక్కు.....మన గడప తొక్కివుండవు . అందుకే ఆయన అంతలా ఆశ్చర్యపోయాడేమో. ఇప్పుడైతే అమెరికాకి, హైదరాబాదుకీ ఒకటే తేడా అక్కడ రాత్రయితే ఇక్కడ పగలు ......మిగతా అంతా ఒకటే నకలు
పైపెచ్చు.....చూడగానే 'కిసుక్కు ' మనిపించే బాపు చిత్రాలు ( కార్టూన్లే...) ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ .

"అమెరికా యాత్ర చేసాను రెండుమారులు
అప్పుడు పరిశీలించాను అక్కడివాళ్ళ తీరులు
నేను చూసింది తెల్లవాళ్ళకన్నా ఎక్కువ తెలుగువాళ్ళను
కాబట్టీ తెరుస్తున్నాను అమెరికాంద్రుల పోకిళ్ళ వాకిళ్ళను " అంటూ ఆహ్వానిస్తారు ఆరుద్ర

'అమెరికన్ టెలుగూస్' మీద ఆరుద్ర గారికున్న అభిమానం ప్రతీ పేజీలోనూ కనిపించి వినిపిస్తుంది.

పుస్తకం కొని చదువుతామనే షరతుమీద మచ్చుకు కొన్ని.......కొన్నంటే కొన్నేమరి.
*******************

అమెరికాలో కాపురానికొచ్చిన ప్రతిముద్దరాలూ
అరణ్యవాసంలో సీతమ్మతో సమానురాలు
పంచవటిలో కనీసం పనులు చెయ్యటానికుంటాడు సౌమిత్రి
ఇక్కడ తనకు తానే కూలీ ; తనకు తానే మేస్తీ
**********************

భారతదేశంలో ఒక్కడే ఒక్కడు వడ్డీకాసుల వాడు
బాలాజీగా ప్రసిద్దుడైన తిరుపతి వెంకన్న అతగాడు
అమెరికాలో అడుగడుగునా వడ్డీకాసుల వాళ్ళే
ఆ మహానుభావులు అప్పులిచ్చే బ్యాంకుల వాళ్ళే
క్రెడిట్ కార్డు వుంటే ప్రతి చోటా దొరుకుతుంది అరువు
తడిసి మోపెడు వడ్డీలు కట్టడమే బ్రతుకు తెరువు
*****************

శని ఆదివాలు సెలవన్న మాటేగానీ చేయాలప్పుడు ఇంటిచాకిరీ
షాపింగూ, క్లీనింగు, మాపింగూ, స్టిచ్చింగు, వాషింగు ఇస్త్రీ
అమెరికాలో ఆంద్రులు అనుభవిస్తున్నారు భోగ భాగ్యాలు
అనుకుంటారు ఇండియాలో - ఇవీ వాళ్ళార్జించే సౌఖ్యాలు
****************

అమెరికాలో తెలుగు వంట
తెచ్చిపెడుతుంది కొత్త తంటా
ఏసీ కిచెన్లో వేయిస్తే ఆంధ్రా పోపు
ఇల్లంతా ఘాటు కమ్మి లేస్తుంది టాపు
***************

అమెరికాంధ్రుల ఆశించే తెలుగుదనం
అబ్బే కనిపించ నీయదే వాళ్ళ నామ క్రమం
ఇంటిపేరు మొదటా వ్యక్తి పేరు చివరా చెప్పటం
ఇక్ష్వాకుల కాలం నుండి తెలుగువాళ్ళ మప్పితం
అమెరికాకు వెళ్ళాకా ఆ తీరు
అంతా చేసేసారు తరుమారు
సర్నేములు లేని పెన్నేములు
ససేమిరా ఇక్కడ చెల్లని మోములు
************

వండుకొన్నమ్మ చేసే విందులకన్నా
దండుకొన్నమ్మ పెట్టే విందులు మిన్న
అమెరికాలో పాట్ లక్ డిన్నర్ల భోజనం
అచ్చంగా దండుకొన్నమ్మ వడ్డనకు సమానం
***************

అక్కటా! కోక్, పెప్సి, సెవన్ అప్ , ఏదైనా సోడా
అంటారే అమెరికన్లు వీళ్ళకి తెలియదా తేడా
అసలు సిసలు సోడా ఒక్క ఆంధ్రా సోడా
అందులోనూ ప్రశస్తమైనది గోలీసోడా
సోడా కాయను కొట్టినపుడు చిన్నసైజు భూకంప ద్వని
వాడవాడలా వినిపొంచాలి అప్పుడే అనాలి దాన్ని సోడా అని
*************

అమెరికాలో బుక్కా ఫకీరు
అమాంతంగా కాగలడు పక్కా అమీరు
ఏరెండు డాలర్లకో ఒక లాటరీ టికెట్టు కొంటే
ఎన్నెన్నో మిలియన్లు కొట్టుకురావచ్చు అదృష్టముంటే
కొండకు కాస్తా కట్టిచూడు వెంట్రుక ముక్క
కొట్టుకొచ్చిందా సిరిగిరి పోతే ఒక భాష్పం చుక్క
అప్పుడపుడూ మాత్రమే అలా తలనీలం కడుతూ వుండు
అదేపనిగా కడుతూ వచ్చావో తలపూర్తిగా గుండు
************
ఇది సమీక్ష కాదు , కేవలం నాకు నచ్చిన ఒక మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చెయ్యాలన్న ప్రయత్నం

ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు

విశాలాంధ్రా పబ్లిషర్స్

Monday, August 3, 2009

'గెలుపు' పుస్తకాల జాతర!

'గెలుపు' పుస్తకాల జాతర!

ఒంటరితనంతో బాధపడిపోతుంటే 'స్నేహితుల్ని సంపాదించుకోవడం ఎలా' అనే పుస్తకం చదవండి. ఏకాంతాన్ని ఆస్వాదించడం ఎలా?' అనే పుస్తకాన్ని ముందేసుకోండి. ఆ పుస్తకాల దొంతర్లలో దేన్ని ఎంచుకోవాలో అర్థంకానప్పుడు, 'మంచి పుస్తకాన్ని ఎంచుకోవడం ఎలా?' ఉండనే ఉంది.

సాహిత్య స్వభావమే వికాసం.

ఎంత చిన్న పుస్తకమైనా, ఎంత చెత్త పుస్తకమైనా...అందులోంచి నేర్చుకోవాల్సిందీ తెలుసుకోవాల్సిందీ ఎంతోకొంత ఉంటుంది.
ఆ పరిజ్ఞానం వ్యక్తిత్వ నిర్మాణంలోనూ పనికొస్తుంది.
అలాంటప్పుడు...ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాస సాహిత్యమెందుకు?

సమాధానం సిద్ధంగానే ఉంది.
సముద్ర గర్భంలోని నిధినిక్షేపాల్ని వెలికితీయడానికి బలంగా వల విసిరినప్పుడు అందులో చేపలు పడొచ్చు, రాళ్లూరప్పలు పడొచ్చు, తిమింగలాలు పడొచ్చు, అదృష్టం బావుంటే ...బంగారవో వజ్రాలో పడొచ్చు. కానీ, అవకాశాలు అంతంతమాత్రమే.

అదే...పారాతట్టా పట్టుకుని ఏ వజ్రాల గనికో వెళ్తే?

తవ్వేకొద్దీ అమూల్య సంపదే!

వ్యక్తిత్వ వికాస గ్రంథాలకూ మిగతా సాహిత్యానికీ ఉన్న తేడా కూడా ఇలాంటిదే. వంద పేజీలో రెండొందల పేజీలో ఉన్న పుస్తకాన్ని ఆ చివర్నుంచి ఈ చివరిదాకా చదివితే, అందులో మనకు ఉపయోగపడే విషయం ఏ మూలో ఏ కొంతో ఉండొచ్చు. లేదంటే, రచయిత పైపైన చర్చించి వదిలేసి ఉండొచ్చు. ఆకలిమీదున్నవాడికి అరటిపండేం సరిపోతుంది? ఇష్టమైన రుచులన్నీ ముందుపెట్టాలి. అలాంటిపనే వ్యక్తిత్వ వికాస సాహిత్యం చేస్తుంది. ఇదోరకంగా బఫే టైపు భోజనం లాంటిది. మనం తినాలనుకున్న వంటకం దగ్గరికెళ్లి, కావలసినంతా పళ్లెంలో పెట్టేసుకోవడమే.

నోట్లో నాలుకలేదని తెగ బాధపడిపోతున్న వాళ్లంతా...నేరుగా 'అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడటం ఎలా?' పుస్తకాన్ని శ్రద్ధగా చదువుకోవచ్చు. వాగుడుకాయలు 'సెలెబ్రేటింగ్‌ సైలెన్స్‌'లోని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. వూబకాయం ఆత్మవిశ్వాసాన్ని ఆబగా మింగేస్తుంటే, 'డోంట్‌ లూజ్‌ యువర్‌ మైండ్‌, లూజ్‌ యువర్‌ వెయిట్‌' ముందేసుకోవచ్చు. మధ్యతరగతి కష్టాలమీద చచ్చేంత కోపముంటే 'హౌ టు బికమ్‌ ఎ బిలియనీర్‌' తరహా పుస్తకాన్ని బట్టీపట్టొచ్చు. వీటిలో ఓ సౌలభ్యం ఉంది. సూటిగా సుత్తిలేకుండా... నేరుగా విషయంలోకే వెళ్లిపోవచ్చు. ప్రతి అక్షరం, ప్రతి పేజీ, ప్రతి అధ్యాయం...చివరి అట్టదాకా కట్టలకొద్దీ సమాచారం. 'ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారుచేయెుచ్చు. కానీ లక్ష చెట్లను నాశనం చేయడానికి ఒక పుల్ల సరిపోతుంది. అలాగే, లక్ష మంచి ఆలోచనల్ని ఒక దురాలోచన నాశనం చేయగలదు. దాన్ని ఆపే శక్తి పుస్తకానికుంది' అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణుడు వంగీపురం శ్రీనాథాచారి.

ఆ గుణమే... వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని పాఠకులకు దగ్గర చేసింది. రచయితలు కూడా ఆషామాషీగానో మిడిమిడి జ్ఞానంతోనో రాయడం లేదు. ఏ విషయాన్ని పట్టుకున్నా అంతు చూసేదాకా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఆ స్ఫూర్తిదాయక శైలి, ఉత్ప్రేరకాల్లాంటి వాక్యాలు, విజయకాంక్ష రగిలించే ఉదాహరణలు...పాఠకుడిలో ఏదో సాధించితీరాలన్న ఆలోచన రేకెత్తిస్తాయి. బలహీనతల్ని గెలవాలన్న పట్టుదల పెంచుతాయి. చివరి పేజీ తిరగేసేలోపు అంతిమ లక్ష్యం నిర్ణయమైపోతుంది. ఇక తడఅబాతుండాడు. తప్పటడుగులుండవు. రివ్వున దూసుకెళ్లిపోవడమే.

అనుభవసారం...

...అంత మహత్తు ఉంది కాబట్టే, ఇంత గిరాకీ. 'క్రాస్‌వర్డ్‌' పుస్తకాల దుకాణం 'బెస్ట్‌ సెల్లర్స్‌' జాబితాలో సగానికి పైగా వ్యక్తిత్వ వికాస గ్రంథాలే. అమ్ముడుపోతున్న పది పుస్తకాల్లో ఆరేడుదాకా 'సెల్ఫ్‌ హెల్ప్‌' గైడ్లే. అనువాదాలకైతే లెక్కేలేదు. దశాబ్దాల నాటి డేల్‌కార్నీ 'హౌటు...' తరహా పుస్తకాలు కూడా...ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన తాజాతాజా సరుకుతో పోటీపడుతున్నాయి.

అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ వాళ్లు ఈ పదేళ్ల కాలాన్ని వ్యక్తిత్వవికాస దశాబ్దమని ప్రకటించినా, నిజానికిది వ్యక్తిత్వ వికాస సాహిత్య దశాబ్దం.

ఒక్క స్టీఫెన్‌ కోవే 'సెవెన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌' పుస్తకమే ప్రపంచ వ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది. అనధికార ముద్రణలూ నకిలీలూ అంతకు నాలుగైదు రెట్లు. కోవే పుస్తకంతో పోల్చలేం కానీ, మిగతా వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ బాగానే అమ్ముడుపోతున్నాయి. ఆ గొప్పదనమంతా పుస్తకాలకే ఆపాదించలేం. రచయితలకూ వాటా ఇవ్వాలి. వాళ్లేం కాలక్షేపానికి రాయడంలేదు. గాలి పోగేయడంలేదు. వూహల్నీ భ్రమల్నీ కలగాపులగం చేయడంలేదు. అనుభవించి రాస్తున్నారు. ఆ పుస్తకం రాయడానికే అనుభవిస్తున్నారు 'ఎ ఇయర్‌ టు లివ్‌' రచయిత స్టీఫెన్‌ లెవిన్‌ దంపతులు ఓ ఏడాది జనవరి ఒకటిన 'జీవితంలో ఇదే చివరి సంవత్సరం అనుకుని బతకాలి' అని తీర్మానించుకున్నారు. చివరి పుట్టిన రోజు, చివరి పెళ్లిరోజు, చివరి సినిమా, చివరి సూర్యోదయం, చివరి వెన్నెల...ఒక్కసారి వూహించుకోండి! ఏదైనా దూరమౌతున్నప్పుడే దగ్గరితనం అనుభవంలోకి వస్తుంది. మరణానికి మానసికంగా సిద్ధమవుతున్నప్పుడే జీవితంలోని అందం, ఆనందం అర్థమవుతుంది. ఒక్క ఏడాది కాలంలో తనలో వచ్చిన మార్పుల్ని విశ్లేషిస్తూ స్టీఫెన్‌ రాసిన 'ఎ ఇయర్‌ టు లివ్‌'... ప్రపంచ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించింది.

లాఫ్లే, రామ్‌చరణ్‌ ఏ ఫైవ్‌స్టార్‌ హోటల్లోనో సేదతీరుతూ 'ద గేమ్‌ ఛేంజర్‌' అల్లేయలేదు. 'ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్‌'ను తిరుగులేని సంస్థగా తీర్చిదిద్దిన అనుభవంతో రాశారు. 'మార్పు అనివార్యమైన గ్లోబల్‌ వాతావరణంలో...ఏ సంస్థనైనా ఏ వ్యక్తినైనా కొత్త ఆలోచనలొక్కటే కాపాడగలవు, సృజనే గెలిపించగలదు' అంటారీ రచయితలు. కంపెనీకి ఏ మేనేజింగ్‌ డైరెక్టరో అధినేత అనుకుంటే పొరపాటే, ఖాతాదారుడే అసలైన యజమాని... అన్నది వీళ్ల సిద్ధాంతం. కార్పొరేట్‌ ఆటతీరును మార్చే ఈ పుస్తకాన్ని రాయడానికి కొన్నేళ్లు పట్టింది. 'ఛేంజ్‌ యువర్‌ థాట్స్‌... ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌' రచయిత... డయర్‌ తన మార్పు సిద్ధాంతాన్ని ఆవిష్కరించడానికి తపస్సులాంటిదే చేశారు. చైనా బౌద్ధ సిద్ధాంతాల ఆధారంగా రాసిన ఆ పుస్తకం కోసం...లావో ట్జూ అనే తాత్వికుడి రచనల్ని అధ్యయనం చేస్తూ సాధన చేస్తూ ఏడాదిపాటు ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఓ సర్వసంగ పరిత్యాగిలా వితాన్ని గడిపారు. 'ఎక్స్‌క్యూజెస్‌ బిగాన్‌' పేరుతో 'సాకులు
మా నేయడం ఎలా' తరహా చిట్కాల మీద ఆయన రాసిన సరికొత్త గ్రంథం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. కొన్ని వ్యక్తిత్వ వికాస గ్రంథాలు పన్లోపనిగా వ్యవస్థలోని లోపాల్నీ కడిగేస్తున్నాయి. 'ఇఫ్‌ యు వాంట్‌ టుబి రిచ్‌ అండ్‌ హ్యాపీ... డోంట్‌ గోటు స్కూల్‌' అని సలహా ఇస్తారు రాబర్ట్‌ టి. కియోసకీ. 'ఈ చదువులు జీవితాన్ని ఎదుర్కోవడం నేర్పించవు. సంక్షోభాల్ని తట్టుకోవడం నేర్పించవు. సంతోషంగా ఉండటమూ నేర్పించవు. అలాంటప్పుడు చదువులతో మనకేం పని' అన్నది ఆయన అభిప్రాయం. ఆ లోపాన్ని అధిగమించి ఆర్థికంగా భావోద్వేగపరంగా...ఎలా ఎదగొచ్చన్నదే కియోసకీ పుస్తక సారాంశం.

కొత్తకొత్తగా...

విషయాన్ని కొత్తగా తాజాగా చెప్పడంలో వ్యక్తిత్వ వికాస రచయితల తర్వాతే ఎవరైనా. 'కాన్వర్జేషన్స్‌ విత్‌ గాడ్‌' సంగతే తీసుకోండి. డోనాల్డ్‌ వాల్ష్‌కీ దేవుడికీ మధ్య జరిగిన సంభాషణ అది. జీవితం మీద విసిగి వేసారిపోయిన రచయిత...ఒకానొక సమయంలో దేవుణ్ని నిలదీస్తూ ఓ కాగితం మీద ఏవో కొన్ని ప్రశ్నలు రాస్తాడు. ఏదో అదృశ్య శక్తి అతని మనసుకు జవాబులిస్తుంది. ఇదే పద్ధతిలో దాదాపు డజను పుస్తకాలు రాశారు. అన్నీ విజయవంతం అయ్యాయి.

రెండేళ్ల క్రితం విడుదలైన రాండా బైర్న్‌ 'సీక్రెట్‌' వ్యక్తిత్వ వికాస సాహిత్య చరిత్రలోనే ఓ గొప్ప సంచలనం. నువ్వు సాధించాలనుకున్నదేదో సాధించాలంటే కష్టపడనక్కర్లేదు, శ్రమపడనక్కర్లేదు. ప్రగాఢంగా కోరుకుంటే చాలు. దానంతట అదే నీ ముందు వాలిపోతుంది...అంటారు రచయిత. 'మీరో అయస్కాంతం లాంటివారు. మీలో సానుకూల దృక్పథం ఉంటే, విశ్వంలోంచి పుట్టుకొచ్చే సానుకూల తరంగాలు ఆ ఆలోచనల్ని ఆకర్షించి... మన పనుల్ని సానుకూలంగానే చక్కబెడతాయి. వ్యతిరేక ఆలోచనలుంటే... వ్యతిరేక తరంగాలే వస్తాయి'... 'సీక్రెట్‌' వెుత్తం ఈ ఆలోచన చుట్టే తిరుగుతుంది. ఐదువందల రూపాయల విలువచేసే ఈ పుస్తకం భారత్‌లోనే దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో పదిహేను లక్షల కాపీలు హాట్‌కేకుల్లా ఖర్చయిపోయాయి. అదే స్థాయిలో విమర్శలూ వచ్చాయి. ఇలాంటి పుస్తకాలు మనిషిని బద్ధకస్తుణ్ని చేస్తాయంటూ హేతువాదులు విమర్శలకు దిగారు.

ఓ డెబ్భై ఏళ్ల క్రితం తొలితరం వ్యక్తిత్వ వికాస గ్రంథాలు పుట్టుకొస్తున్నప్పుడూ ఒకట్రెండు విమర్శలు వినిపించాయి. 'ఎదుటి మనిషిని మాటలతో బురిడీ కొట్టించడమెలా? పీకలోతు కోపమున్నా నవ్వుతూ మాట్లాడటం ఎలా? నలుగుర్లో గొప్పవాడు అనిపించుకోవడం ఎలా?...ఇలాంటి ఇతివృత్తాలతోనే పుస్తకాలొచ్చేవి. మనం ఎదగడం, మనం ఆలోచించడం కంటే...ఎదుటివాళ్లని ప్రభావితం చేయడం మీదే రచయితలు దృష్టిపెట్టేవారు. ఇది తొలి దశ. దీనికి పితామహుడు డేల్‌కార్నీ. రెండో దశలో... రచయితలందరూ భౌతిక విజయం మీదే దృష్టిపెట్టారు. అదే మనిషి గొప్పదనానికి కొలమానమైంది. అసలైన వ్యక్తిత్వ వికాస సాహిత్యం వెుదలైంది మూడో దశలోనే. గెలుపొక్కటే కాదు, ఎలా గెలిచామన్నదీ ముఖ్య విషయమైంది. ఎంత జీతమిస్తున్నావన్నది కాదు, ఉద్యోగుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నది కొలమానమైంది. ఎన్ని కోట్లు సంపాదించావన్నది కాదు, ఎంత నిజాయతీగా సంపాదించావన్నది చర్చనీయమైంది. బలహీనతల్ని కప్పిపుచ్చుకుని నలుగుర్లో వెలిగిపోవడం కాదు, ఆ బలహీనతల్ని జయించడమెలాగో చెప్పడం వెుదలుపెట్టారు. వ్యక్తిత్వ వికాస సాహిత్యంలోనూ చాలా మార్పులొచ్చాయి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి అద్భుతాలు సాధించిన బిల్‌గేట్స్‌, బఫెట్‌ లాంటి వాళ్ల జీవితాలు ఉదాహరణలై నిలిచాయి' అంటూ వికాస సాహిత్యంలోని వివిధ దశల్ని వివరిస్తారు రచయిత సి.నరసింహారావు. ఈ దశలోనే 'ఎదుగు-ఎదగనివ్వు' అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, 'విప్రో' ప్రేమ్‌జీ లాంటి వాళ్లు అసలైన విజేతల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. వాళ్ల జీవితాలే విజయ సూత్రాలుగా పుస్తకాలొచ్చాయి. 'విన్నర్‌ నెవర్‌ ఛిట్స్‌' తరహాలో విలువలకు విలువ ఇచ్చే గ్రంథాలు చాలా పుట్టుకొచ్చాయి.
ఇప్పుడొస్తున్న సాహిత్యమంతా నైతిక విలువల చుట్టే తిరుగుతోంది. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, అవార్డులు.. ఉప ఉత్పత్తులు మాత్రమే. వికాసమే గొప్ప విజయం అని చెబుతున్నాయి మూడోతరం రచనలు. చెమటోడ్చడంకంటే, సరికొత్తగా ఆలోచించడం ముఖ్యమంటున్నాయి. విజేతలు భిన్నమైన పనులు చేయరు, అందరూ చేసే పనుల్నే భిన్నంగా చేస్తారని తేల్చేశాయి. స్టీఫెన్‌ కోవే అయితే 'నీ అలవాట్లే నీ తలరాత' అంటూ కుండ బద్దలు కొట్టేశారు. వ్యక్తిగత స్థాయిలో బద్ధకం, పిరికితనం, సానుకూల దృక్పథం లేకపోవడంలాంటి సమస్యల్ని అధిగమించాలనుకునేవారి కోసమూ బోలెడు పుస్తకాలొచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఏ 'వాల్డెన్‌'కో, 'క్రాస్‌వర్డ్‌'కో వెళ్తే...ఇలాంటి పుస్తకాలకే ఒకట్రెండు అరలు ఎక్కువ ఉంటాయి. పాఠకులూ ఆ చుట్టుపక్కలే తచ్చాడుతుంటారు. ఈ అంతర్జాతీయ ధోరణిలో మనకీ వాటా ఉంది. రాబిన్‌శర్మ, శివ్‌ఖేరా, దీపక్‌చోప్రా లాంటివాళ్లు...రాస్తున్న పుస్తకాలు విదేశీ పాఠకుల్నీ ఆకట్టుకుంటున్నాయి. భారతీయ కర్మ సిద్ధాంతం, విలువలు, గీత...అంతర్జాతీయ ఆవోదాన్ని పొందుతున్నాయి. వ్యక్తిత్వ వికాసానికీ ఆధ్యాత్మికతకూ కొత్తచుట్టరికం కలిసింది. శివ్‌ఖేరా, అరిందమ్‌చౌదరి లాంటివారు కృష్ణుడినీ భీష్ముడినీ ఆంజనేయుడినీ...మేనేజ్‌మెంట్‌ పాఠాల్లో హీరోల్ని చేశారు. దీపక్‌చోప్రా రచనలకైతే భారతీయతే పునాది. సుఖబోధానంద, రవిశంకర్‌, జగ్గీవాసుదేవ్‌ వంటి ఆధ్యాత్మిక గురువుల రచనలు కూడా వ్యక్తిత్వ వికాస సాహిత్యంకోవలోకే వస్తున్నాయి. బౌద్ధ గురువు దలైలామా 'డిస్ట్రక్టివ్‌ ఎవోషన్స్‌' కూడా ఆ అరల్లోనే చోటు సంపాదించుకుంది.

మన వికాసం...

భారతీయులకు పాశ్చాత్య వికాస గ్రంథాల అవసరమే లేదని వాదించేవారూ ఉన్నారు. మన వేదాలు మనకున్నాయి. మన పురాణాలు మనకున్నాయి. మన ఉపనిషత్తులు మనకున్నాయి. మన గీత మనకుంది. ప్రపంచంలో ఏ వ్యక్తిత్వవికాస సాహిత్యంలోనూ లేనన్ని గొప్పగొప్ప విషయాలు అందులో ఉన్నాయి. 'అనోభద్రాః క్రతవోయస్తు సర్వతః' అంటుంది రుగ్వేదం. అంటే... అన్ని వైపుల నుంచి అన్నివిషయాల నుంచి మంగళకరమైన శుభప్రదమైన ఆలోచనలు మాకు కలగాలి అని!

ఆధునికులు కలవరిస్తున్న 'కొత్త ఆలోచనల్ని'...మనమెప్పుడో స్వాగతించాం! స్టీఫెన్‌ కోవె 'డిజైర్‌', 'నాలెడ్జ్‌', 'స్కిల్‌' అంటూ చర్చకుపెట్టిన విషయాల్ని లలితా సహస్రనామం 'ఇచ్ఛాశక్తి, 'జ్ఞానశక్తి', 'క్రియాశక్తి'...అని వేల ఏళ్లక్రితమే నిర్వచించింది.

చిన్నయసూరి నీతి చంద్రిక కథారూపంలో వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని వివరించే అద్భుత గ్రంథం. స్వామి వివేకానంద ఉపన్యాసాల్లోని స్ఫూర్తి ఏ విదేశీ గ్రంథాల్లోనూ లేదు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 'మార్గదర్శి'... 1928 ప్రాంతంలోనే వచ్చిన అద్భుత వ్యక్తిత్వ వికాస గ్రంథం. తువ్వాళ్లు, అంగవస్త్రాలు అమ్ముకునే కుర్రాడు...ఓ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగే క్రమాన్ని స్ఫూర్తిదాయకంగా వివరించారాయన.

నిజమే, కుటుంబ విలువలు, సంప్రదాయాలు...మన స్వభావాల మీదా ప్రవర్తన మీదా ప్రభావం చూపుతున్నంత కాలం.. మనకు ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాస గ్రంథాల అవసరమే రాలేదు. అమ్మ ఏ వేమన పద్యాలతోనో విలువల వికాస పాఠాలు వెుదలుపెట్టేది. నాన్న చిటికెనవేలు పట్టుకుని నడిపిస్తూ... జీవన వికాస పాఠాలు చెప్పేవారు. పురాణ పఠనాలూ హరికథలూ...

నీతినీ లోకరీతినీ బోధించేవి. మన నడకనీ నడతనీ కనిపెట్టుకుని, మంచిచెడులు చెప్పడానికి పటాలమంత బంధుగణముండేది. రేపటి గురించి భయపడే పరిస్థితులు లేవు కాబట్టి, విజయాల కోసం ఉరుకుల్లేవు. సిరితావచ్చిన వచ్చును...అన్నట్టు సమర్థుడిని విజయమే వెతుక్కుంటూ వచ్చేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయాక...మన జీవితాలకు మనమే బాధ్యులమైపోయాం. ప్రపంచికరణ పుణ్యమాని అభద్రతా ప్రవేశించింది. అదే సమయంలో ప్రాచిన సాహిత్యంలోని మంచిని గ్రహించి అన్వయించుకోగల ఓపికా తీరికా పాండిత్యం... కొత్తతరాలకు లేకుండా పోయింది. సరిగ్గా ఈ నేపథ్యంలో... మనదేశంలోనూ వ్యక్తిత్వ వికాస గ్రంథాలకు గిరాకీ పెరిగింది. రచనలు పెరిగాయి. దిగుమతులూ పెరిగాయి. దాంతోపాటే తాలు సరుకూ పెరిగింది.

'మన గోడలకి పగుళ్లు వచ్చాయనుకోండి. ఆ సమస్య నుంచి బయటపడటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి...గోడలకు నల్లరంగు వేస్తే సరిపోతుంది. పగుళ్లు కనబడవు. ఎవరూ నవ్వుకోరు. తాత్కాలికంగా పరిష్కారమైనట్టే అనిపిస్తుంది. కానీ అసలు సమస్యంతా నిర్మాణంలో ఉంది. దాన్ని సరిచేసుకోవడమన్నది శాశ్వత పరిష్కారం. చాలా వ్యక్తిత్వ వికాస గ్రంథాలు...ఇంటికి నల్లరంగు వేసినట్టు, తాత్కాలిక పరిష్కారాలే సూచిస్తాయి' అంటారు మేనేజ్‌మెంట్‌ నిపుణులు సి.ఎల్‌.ఎన్‌.మూర్తి. నిజమే, మంచి పుస్తకాన్ని ఎంచుకోవడమూ ఓ కళే. ఒకట్రెండు చెత్త పుస్తకాలు చదివాక కానీ, ఆ కళ ఒంటబట్టదు. ఆ అనుభవమూ వ్యక్తిత్వ వికాసంలో భాగమే!

ఆల్కెమిస్ట్‌

నీలో బలంగా ఉంటే, దాన్ని నిజం చేయడానికి విశ్వం కుట్ర పన్నుతుంది. అందుకు అనువైన పరిస్థితుల్ని సృష్టిస్తుంది. ఆ దిశగా నిన్ను నడిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే మనసు మాట వినడం, ఆ సంకేతాల్ని అర్థంచేసుకోవడం...ఇదీ క్లుప్తంగా పాలో కోయిలో 'ఆల్కెమిస్ట్‌' సారాంశం. ప్రపంచంలో లిపి ఉన్న ప్రతిభాషలోకీ ఈ పుస్తకాన్ని అనువదించుకున్నారు.

యు కెన్‌ విన్‌

విజేతలు భిన్నమైన పనులు చేయరు. ఏ పని చేసినా భిన్నంగా చేస్తారు. టాగ్‌లైనే అద్భుతంగా ఉంది కదూ! పుస్తకం ఇంకా అద్భుతంగా ఉంటుంది. శివ్‌ఖేరా తనదైన సహజ గంభీరశైలిలో రాశారీ పుస్తకాన్ని. విజేత పరిష్కారంలో భాగంగా ఉంటాడు. పరాజితుడు సమస్యల్లో ఒకడైపోతాడు. విజేత ఆ పని చేసితీరతానని చెబుతాడు. పరాజితుడు ఆ పని అయితే బావుండునని వెుక్కుకుంటాడు. పరాజితుడు విజేత కావడం ఎలాగో శివ్‌ఖేరా వివరించారు.

ద మాంక్‌ హూ సోల్డ్‌...

ఆనందం ఆడంబరంలో లేదు, నీ ఆలోచనల్లో ఉందని చెబుతారు రాబిన్‌ శర్మ. వూరంత బంగళా పడవంత కారూ లెక్కపెట్టలేనన్ని ఆస్తిపాస్తులూ ఉన్న ఓ న్యాయవాది ఎవరికీ చెప్పకుండా... భారతదేశానికొస్తాడు. గురు సాంగత్యంలో ఆధ్యాత్మికానందాన్ని పొందుతాడు. భౌతిక విజయాల్లోనే ఆనందముందనీ డబ్బులోనే సర్వస్వముందనీ భ్రమపడేవారంతా చదివితీరాల్సిన పుస్తకం.

సెవెన్‌ స్పిరిచ్యువల్‌ లాస్‌...

ఆధ్యాత్మికతకూ విజయానికీ ముడిపెట్టి రాశారు దీపక్‌చోప్రా. ఆయన మీద జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాల ప్రభావం కనిపిస్తుంది. వేదాంతాన్నీ భగవద్గీత శ్లోకాల్నీ తరచూ ప్రస్తావిస్తారు. మనం లక్ష్యాల్ని సాధించడానికి నిరంతరం శ్రమిస్తాం. సర్వశక్తులూ ధారపోస్తాం. అనుకున్నదేదో సాధించేసరికి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలా కాకుండా ఉత్సాహంగా ఆనందంగా...లక్ష్యం దిశగా ప్రయాణం సాగించడం ఎలాగో ఈ పుస్తకంలో చెప్పారు.

సెవెన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌...

నీ అలవాట్లే నీ విధి రాతలంటూ స్టీఫెన్‌ కోవె రాసిన ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాస సాహిత్య ప్రపంచంలో ఓ కుదుపు. ఒక్క పుస్తకంతో అతను కుబేరుడైపోయారు. కొనసాగింపుగా ఆరేడు పుస్తకాలు రాశారు. 'సెవెన్‌ హ్యాబిట్స్‌...'కు బోలెడు అనువాదాలూ అనుకరణలూ వచ్చాయి. పునర్ముద్రణలకైతే లెక్కేలేదు. కోవే చెప్పిన ఆ ఏడు సూత్రాల్నీ అలవాట్లుగా మార్చుకుంటే తిరుగే ఉండదని ప్రపంచమంతా ఆవోదించింది.

కౌంట్‌ యువర్‌ చికెన్స్‌...

కోడిపెట్ట బుట్టలోని గుడ్లని పొదగకముందే, కోడి పిల్లల్ని లెక్కబెట్టుకోమంటున్నారు అరిందమ్‌ చౌదరి. వ్యక్తిగత అనుభవాలు, విలువలు, విజయసూత్రాలూ కలగలిపి రాసిన పుస్తకమిది. 'నీ ఆలోచనలతో నువ్వు ప్రేమలో పడాలి. అదే సగం గెలుపు' అని సలహా ఇస్తారు రచయిత. మిగతా వికాస పుస్తకాలు ప్రస్తావించిన విషయాల్నే కాస్త వైవిధ్యంగా కాస్త సృజనాత్మకంగా చర్చించారు. సమస్యల్ని భారతీయ కోణంలోంచి భారతీయ వాతావరణంలో విశ్లేషించారు.

(ఈనాడు, Sunday Special, ౨౬:౦౭:౨౦౦౯)

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070