Showing posts with label ఎందరో మహనుభావులు. Show all posts
Showing posts with label ఎందరో మహనుభావులు. Show all posts

Thursday, February 4, 2010

యువకులకు స్పూర్తి భగత్ సింగ్ (September 27, 1907 – March 23, 1931)

పాల్గొన్నావు పదిహేడేళ్ళ ప్రాయాన సహాయ నిరాకరణ ఉద్యమమందు 
నిలిచావు లాలాలజపతిరాయి సరసన సైమన్ కమీషన్ నిరసనందు
అమలుపరిచావు ఆంగ్లపాలకుల భాహిష్కరణ పధకాలను వీర ఉద్వేగమందు
గడిపావు జైలు జీవితాన్ని దేశమాత విముక్తి ప్రేరణయందు  
మారలేదు  నీ ఆత్మవిశ్వాసము ప్రతికూల పరిస్తితులందు
వీడలేదు నీ స్వాతంత్రావేశము ముష్కరుల ప్రలోభమందు
చెదరలేదు నీ ధీరోదాత్తము నియంతల రక్త దాహమందు 
కదలలేదు నీ విప్లవసామర్ధ్యము దుర్భలుల దురాఘాతమందు
నీ కన్నులు కన్నాయి దేశఉజ్యలభవిష్యత్తు కలలలో
నీ ఉహాలు ఊగాయి స్వేచ్చాభారత విహంగాలలో  
నీ మాటలు సాగాయి ఉత్ప్రేరిత తరంగాలలో
నీ రచనలు రాసాయి ప్రజ్యలిత ప్రకరాణాలలో
జాతి కోసము పని చేసావు ప్రానాంకిత భావనతో  
దేశముకోసము కదిలి సాగావు క్రియాశీల త్రికరణశుద్ధితో  
ప్రజలకోసము జ్వలింప చేసావు మార్గదర్శకమైన ఆత్మశక్తితో
ఉజ్వలభారతికోసము ప్రాణాలు అర్పించావు ఇరవైమూడేల్లప్రాయముతో 
నీవు  దర్శించిన ఆ స్వేచ్చా భారతి ఆవిష్కరించపడింది......కానీ......పెరుగుతోంది.........
మానశిక ప్రలోభులైన యువత
దుర్వ్యసనాల అశ్రితులైన నవరక్తం
ర్యాగింగ్ పిపాసులైన విద్యార్ధిలోకం
యాసిడ్ దారులైన రాక్షసలోకం
అమలు జరుగుతున్నాయి........

లక్ష్యరహిత జీవన విధానాలు
పాశ్చాత్య సంస్కృతి బానిసతత్వాలు
నిరంతర వినోదపూరిత  వికృత చేష్టలు
సోదర సోదరీ పీడిత స్వార్ధ భరిత ప్రణాలికలు
ఓ వీరకిశోరమా ఆవహించి కరుణను కల్గించు ఆ ఉన్మాదులలో 
ఓ భారతరత్నమా ప్రసరించి ప్రేమను ప్రేరేపించు ఆ ప్రభుద్దులలో 
ఓ  యువచైతన్యమా సంరక్షించి సేవను సంస్కరించు ఆ కీచకులలో
ఓ ఉత్తేజితతరంగమా జ్వలించి వెలుగును వెదజల్లు ఆ అధములలో 

వెళ్ళిపోయారు ఆంగ్లేయులు........వదలిపోలేదు సోమరితనము
కదలిపోయారు సామ్రాజ్యవాదులు........సమసిపోలేదు వ్యక్తిగతబలహీనతలు  

అందుకే........ఆవహించు....నడిపించు....రగిలించు....కదిలించు....యువతను.....
వ్యక్తి అభివృద్ధి.... దేశభక్తి.... లక్ష్యసిద్ది....విచక్షణాశక్తి ....ప్రాతిపదికగా.....నడిచే......

రెండవ భారత జాతీయోద్యమము వైపు..................
                                        ------ప్రభాకర రావు కోటపాటి

Wednesday, February 3, 2010

కొడవటిగంటి రచనా ప్రపంచం

కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవలికను గుర్తు తెచ్చుకుని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

పది పన్నెండేళ్ళ వయసులోనే నవలలు చదివేసిన నాకు కుటుంబరావు గారి పరిచయం కేవలం పది పన్నెండేళ్ళ క్రితం జరగడం నాకే ఆశ్చర్యం! లోకం గొప్ప రచయితలుగా ముద్ర వేసిన కొందరు రచయితల రచనలు నన్ను అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుట్ పాత్ మీద కుటుంబరావుగారి నవలలు కొనడంతో ఆయన రచనా ప్రపంచం తలుపు తట్టాను. ఆ నవలికలు నన్ను అద్భుత రస ప్రపంచంలోకి విసిరి కొట్టాయి. మిగిలిన సంపుటాల కోసం ఎంతగా ప్రయత్నించినా అప్పటికే విశాలాంధ్రలో స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు.

కానీ ఆశ్చర్యకరంగా రెండు నవలా సంపుటాలు హ్యూస్టన్ మీనాక్షి ఆలయం లోని పుస్తక విక్రయకేంద్రంలో దొరికాయి.

కుటుంబరావు గారి శైలి గురించి, ఆయన పాత్ర చిత్రణ గురించీ,ఇంకా రచనా చమత్కృతి గురించీ వారి శత జయంతి సందర్భంగా అనేక ఆన్ లైన్ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్యాసాలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఇక్కడ దాన్ని నా దృష్టి కోణం నుంచి వివరించే ప్రయత్నం, చెయ్యను కానీ ఆయన రాసిన ఒక నవలికను పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఆలిండియా రేడియో సీరియల్ గా ప్రసారం చేయడానికి డైరీ రూపంలో ఒక పెద్ద కథ రాయమని కుటుంబరావు గారిని కోరినపుడు ఆయన 'సరితాదేవి డైరీ"ని రాశారు. అది ప్రసారం కూడా అయిపోయాక కుటుంబరావు గారికి అది అసంపూర్ణంగా ఉన్నట్లు తోచింది. ఆయన మాటల్లో ఇలా అంటారు

"కథ అయిపోయింది, అయిపోలేదు కూడా! ఎందుకంటే కథ తాలూకూ చాలా విషయాలు ఈ డైరీలోకి రాలేకపోయాయి.కష్టపడి కథ ఆలోచించిన రచయిత దాన్ని పాఠకులకు(శ్రోతలకు)అందజేయలేకపోయిన రచయిత ఎంత ఆందోళన చెందుతాడో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు! సరితా దేవి డైరీతో రేడియో మాసం దాటింది కానీ నా పని గడవలేదు.అందుచేత సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ రాశాను"!

ఈ రెండు డైరీలలో వచ్చే పాత్రలతో తర్వాత ఆయన "కామినీ హృదయం" అనే నాటిక కూడా రాశారు.

ఒకే కథను రెండు వైపుల నుంచీ ఇద్దరు తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా అద్భుతంగా చెప్పిన కథే ఈ "సరితా దేవి డైరీ" సరోజ డైరీలు!

కథ విషయానికొస్తే ........

సరితాదేవి ఒక మధ్యతరగతి తల్లి. ఆడపిల్ల తల్లి!

కథ చాలా కాలం నాటిది కనుక ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన కూతురికి అప్పుడే పెళ్ళి చెయ్యాలని,గొప్ప వరుడిని తేవాలని ఆరాటపడే సగటు తల్లి! చాలా మంది మధ్యతరగతి వాళ్ళకుండే రోగం....అదే గొప్పింటివాళ్లతో పోటీ పడాలని,ఒక్కోసారి గెలవాలని కూడా అనుకునే అభిజాత్యపు రోగం అంతో ఇంతో సరితాదేవిక్కూడా ఉంది.

రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయి సావిత్రి, సరితా దేవికూతురు సరోజా స్నేహితులు.ఇద్దరూ పెళ్ళికెదిగిన వాళ్ళే! ఈ నేపథ్యంలో సరితా దేవి తమ్ముడు వాసుతో పాటు ఢిల్లీ నుంచి మనోరంజన్ అనే అందగాడూ, మంచి ఉద్యోగస్తుడూ అందునా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరూ వస్తాడు.

 ఇటు సరితాదేవి, అటు సావిత్రి తల్లీ అతడిని తమ తమ కూతుళ్లకు వరుడిగా చేసెయ్యాలని ఆరాటపడతారు.అతడు తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకూ కూతురి పట్ల అతడికి ఆకర్షణ కలిగించాలని,సరోజను మిసెస్ మనోరంజన్ గా చేసెయ్యాలని సరితా దేవి చేసిన ప్రయత్నాలే ఆమె రాసుకున్న డైరీ!

మరో వైపు సరోజ మనో రంజన్ వైపు ఆకర్షితురాలవుతూనే,అతడిని ఇష్టపడుతూనే తన తల్లి చేసే "చవకబారు
ప్రయత్నాలు " తనకెంత చిరాకు పుట్టించాయో తన డైరీలో రాసుకుంటుంది.

సావిత్రితో మనోరంజన్ పెళ్ళి స్థిరమైపోయిందనే వార్త రూఢిగా తెలిశాక సరితాదేవి నిరాశలో కూరుకుపోతుంది.ఇది ఒక రకంగా ఆమెకు ఓటమి కూడా కదా సుశీల ముందు! ఆమె తమ్ముడు వాసు "సరదాగా నాల్రోజులు ఢిల్లీలో గడిపి వస్తుంది సరోజను పంప"మనడం,ఢిల్లీ వెళ్ళాక అక్కడ సరోజ, రంజన్ లు పెద్దవాళ్లకు తెలీకుండా వాసు సహాయంతో రిజిస్టర్ పెళ్ళి చేసుకోవడం కథలో చివరి ట్విస్టు!

మనో రంజన్ తనను ఇష్టపడుతున్నాడనీ, తననే పెళ్ళాడతాడనీ సరోజకు నిశ్చయంగా తెలుసు. మరో వైపు సావిత్రి తల్లి సుశీల చేసే ప్రయత్నాల మీద కూడ ఆమెకు అనుమానంగానే ఉంటుంది.
ఇంకో వైపు తల్లి! ఇలా నలుగుతూనే సరోజ ఈ కథంతా డైరీలా మనకి చెప్తుంది. తేదీల వారీగా రాసే డైరీల మీద కుటుంబరావు గారికి ఆట్టే నమ్మకం లేకపోవడం వల్ల సరితా దేవి, సరోజ... కథ చెప్పుకుంటూ వెళతారంతే!

రెండూ ఒకటే కథ అయినా ఎవరి వైపు నుంచి వారు చెప్పడం వల్ల రెండూ కొత్తగానే అనిపిస్తాయి పాఠకులకి!

ఇదొక అద్భుత రచనా ప్రక్రియ అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ, ఒకటే కథ రెండు వెర్షన్లలో ఇంత ఆసక్తి కరంగా మలచడం !.

ఒక మధ్యవయస్కురాలైన తల్లి, ఒక యుక్తవయస్కురాలైన కూతురు ఈ ఇద్దరి మనస్థత్వాలను కొ.కు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా తోస్తుంది.

సావిత్రి, తన తల్లి ఎంత చెప్తే అంతని, బుద్ధి మంతురాలనీ , తన కూతురు సరోజ మాత్రం పెంకిదనీ, తన మాట విని బాగుపడతామనే ఆలోచనే లేదనీ సరితాదేవి కంప్లెయింట్!

 మరో పక్క సరోజేమో "సావిత్రి వాళ్ళమ్మ మాట వింటుందనీ నేను వినననీ నా మీద కోపం!నేనూ విందునేమో అమ్మక్కూడా సుశీల గారికున్నంత నాగరికత ఉంటే! 'నేను నీకు అమ్మనని ఎప్పుడైనా అనిపిస్తుందిటే? నేనేం చెప్పినా నీ చెడు కోసమే చెబుతున్నాననుకుంటున్నావా?' అని నన్ను నిలవేస్తుంది. ఆవిడకర్థమయ్యేట్టు చెప్పడం నాకు చాత కావడం లేదు.ఆవిడ నా మీద ఆపేక్షతోనే చెబుతుంది.కానీ ఆవిడ చెప్పినట్లా చేస్తే నేను నవ్వులపాలైపోవలసిందే! ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అటువంటి మనిషి ఆపేక్షకు విలువేమిటి?"అని ఆలోచిస్తుంది.

నలుగురిలో కూతురు అందంగా కనిపించాలని ఏ తల్లికైనా ఉంటుంది.ఇదే తాపత్రయం సరితాదేవి కూడా పడి సరోజ ను చిత్తం వచ్చినట్లు అలంకరించి మనోరంజన్ కి కాఫీలు, టీలూ అందించమంటుంది. సరోజేమో సహజంగా ఉండాలనుకుంటుంది.

"నన్ను ఉన్నట్టు ఉండనివ్వక ఏ రాధలాగో, మహాలక్ష్మి లాగో, అనసూయ లాగో చేస్తానంటుంది. నాకు చిరాకెత్తి 'నేనేం బట్టల దణ్ణెం అనుకున్నావా, నీకిష్టమైన చీరల్లా నా మీద వేసి చూడ్డానికి? అని అడిగేస్తాను. దాంతో ఆవిడకు కోపం వచ్చేస్తుంది"అని మనతో వాపోతుంది.

తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలని ఆ కాలంలోనే(ఎందుకంటే ఇప్పటికంటే అప్పటి ఆడపిల్లలు తల్లి చెప్పినట్లు వినేవాళ్లని కదా అందరం అనుకుంటాం) రచయిత ఎలా పరిశీలించారా అని ఆశ్చర్యం వేస్తుంది.

మనస్థత్వాలను కుటుంబరావు గారు మంచినీళ్ళ ప్రాయంగా అప్పటికప్పుడు విశ్లేషిస్తారని ఆయన రచనలు చదివిన వారికెవరికైనా అర్థం కావలసిందే! "తల్లి లేని పిల్ల" లో "మనుషుల సంస్కారం"అనే విషయాన్ని విశ్లేషించిన తీరు నేను ఎప్పటికీ అబ్బురపడే విషయమే! కొత్తకోడలు నవల్లో హనుమాయమ్మ గారి పాత్ర ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ దాదాపుగా కనపడే తల్లి పాత్ర!

ఈయన ఇన్ని రకాల మనుషుల్ని ఎప్పుడు చదవగలిగారని విస్మయం కలుగుతుంది. ఎందుకంటే ఒక రచనలో కనిపించిన మనో విశ్లేషణ మరో రచనలో కనిపించదు మరి! ఇటువంటి విస్తృత విశ్లేషణ అనేక కథల్లో, నవలల్లో, నవలికల్లో అసంఖ్యాకంగా చూడొచ్చు! ఎన్నని పేర్కొనగలం?

కుటుంబరావు గాని నవలల మీద పరిశోధన చేయదలిస్తే కొన్ని వందల అంశాల మీద వందల కొద్దీ చేయవచ్చు!

విశాలాంధ్ర  పబ్లిషింగ్ హౌస్ శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వేసిన సంపుటాలన్నీ చాలా రోజుల క్రితమే అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం అక్కడ దొరకదు. "వస్తాయండీ" అనో "వేయాలని చూస్తున్నారండీ'అనో "చెప్పలేమండీ" అనో తప్పించి!

ఈ లోపు విరసం ఈ బాధ్యతను తీసుకుని "కొడవటిగంటి రచనా ప్రపంచం" పేరుతో ఆయన రచనలన్నింటినీ 16 సంపుటాలుగా అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టడం శుభపరిణామమే!

మార్చి నెలలో దీనిగురించి వేణువు బ్లాగులో కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో ఒక టపా వచ్చింది. ఆ టపా ద్వారానే నేను ఈ సంపుటాలన్నింటికీ తెప్పించే ఏర్పాటు చేయగలిగాను. ఇప్పటికే నాల్గు సంపుటాలు అందాయి కూడా! ఈ కొత్త సంపుటాల్లో విశాలాంధ్ర సంపుటాల్లో లాగా ఫుట్ నోట్స్ లేవు. వివరాలు అవసరమైన చోట్ల ఆ ఫుట్ నోట్స్ ఉంటే బావుండనిపిస్తుంది. కానీ విశాలాంధ్ర సంపుటాల్లో అవి మరీ ఎక్కువై విసుగెత్తిస్తాయి, కథను పక్కదారి పట్టిస్తూ!

ప్రతి సాహిత్యాభిమాని లైబ్రరీ లోనూ  ఉండదగ్గ ఈ పదహారు సంపుటాలూ ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కింద అసలు ధర కంటే తక్కువ ధరకే లభించే సదుపాయం కూడా ఉంది. ( నాకు అలాగే లభించాయి.) విరసం వేసిన సంపుటాలు కావలసిన వారు పూర్తి వివరాల కోసం "కొడవటిగంటి రచనా ప్రపంచం ". టపాలో చూడవచ్చు!

శ్రీ శ్రీ "మహా ప్రస్థానం"- అంకితం

శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి పేరు ఎరుగని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజ దర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టి వీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవిగా శ్రీ శ్రీ పేరు తెలుగుభాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. ఆయన రచనల్లో 1950 లో ప్రచురించబడిన 'మహాప్రస్థానం' అనే కవితాసంపుటి తెలుగు సాహితీ అభిమానుల మనసుల్లోనే కాకుండా.. సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంత గొప్ప కవితా సంపుటిలోంచి అప్పుడప్పుడూ కొన్నీటిని ఈ బ్లాగులో పెట్టడం ద్వారా అందరికీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని భావిస్తున్నాను. నేనే స్వయంగా టైపు చేసి పెడుతున్నాను. ఒక వేళ ఇలా పెట్టకూడదు అని ఏమైనా కాపీ రైట్ హక్కులు ఉంటే.. ఎవరైనా మిత్రులు తెలుపగలరు. అప్పుడు నేనే సదరు పోస్టులు తీసేస్తాను.

ఈ 'మహా ప్రస్థానం' పుస్తకంలోని చాలా కవితలను శ్రీ శ్రీ గారు 1930-40 మధ్య కాలంలో వ్రాసారట. ఈ మహాప్రస్థానాన్ని శ్రీ శ్రీ గారు ఆయన మిత్రుడు శ్రీ కొంపెల్ల జనార్ధనరావు గారికి అంకితం చేసారు. ఆ అంకిత వాక్యాలు కూడా కవితా రూపంలోనే స్వయంగా శ్రీ శ్రీ నే వ్రాశారు. ఈ పోస్టులో ఆ కవితను ఇస్తున్నాను. చూడండి మీరే.. వారి స్నేహ బంధాన్ని..!
నేస్తం దూరమైన బాధనీ.. తనతో మాట్లాడుతున్నట్టుగా.. ఎంత గొప్పగా చెప్పారో శ్రీశ్రీ గారో.. మీరే చూడండి.

"మహాప్రస్థానం" కొంపెల్ల జనార్ధన రావు కోసం..

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

తలపోసినవేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వు, చేయూతా ఇవ్వక...
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే...
అటు పోతే, ఇటు పోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఒక్కణ్ణి చేసి వేధించారని, బాధించారని
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం!

దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్ళిపోయావా, నేస్తం!
చిరునవులనే పరిషేచన చేస్తూ...

అడుగడుగునా పొడచూసే
అనేకానేక శత్రువులతో,
పొంచి చీకట్లో కరవజూసే,
వంచకాల ఈ లోకంతో పొసగక
అచింతానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని...
అన్నీ, తన్నివేశావా నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!

బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
"ఉదయిని" సంచికలు పట్టుకు తిరగడం

జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచిక గూళ్ళేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకోని,
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడున్నామో, ఎక్కడకు పోతామో తెలియని,
ఆవేశంతో,
చుక్కల్లో ఆదర్శాలను లెక్కిస్తూ,
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించించో, శఠించిందో మనల్ని..
తుదకు నిన్ను విష నాగురలలోకి లాగి,
ఊపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి,
మా కళ్ళల్లో గంధక జాలలు,
గుండెల్లో గుగ్గిలపు ధూమం వేసి,
మా దారిలో ప్రశ్నార్ధం చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా
తనువులో అణువణువులో
సంవర్త భయంకర
ఝుంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను..
ఎంత మోగించిందయ్యా మమ్ము..
ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప...
ఆకాశం పడిపోకుండానే ఉంది..
ఆఫీసులకి సెలవు లేదు..
సారా దుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది..
సానుభూతుల సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం...
ఎవరి పనులలో వాళ్లు..
ఎవరి తొందరలో వాళ్లు..
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే,
కనబడని ఊహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నియంత్రిస్తే..
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయిపోతేనేం నువ్వు?
మా బురద రోజూ హాజరు..
మా బురఖా మేము తగిలించుకున్నాం..
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే..
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు..
లేదు నేస్తం! లేదు
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు..
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము..

ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు..
భయం లేదులే అయినప్పటికీ..
నీ సాహసం ఒక ఉదాహరణ..
నీ జీవితమే ఒరవడి..
నిన్న వదలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు..

కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను..
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను..
అందుకో ఈ చాచిన హస్తం..
ఆవేశించు నాలో..
ఇలా చూడు నీ కోసం..
ఇదే నా మహాప్రస్థానం..!

-- శ్రీ శ్రీ

* ఏమైనా అక్షర దోషాలు కనిపిస్తే సరిచేయగలరని మనవి.

Wednesday, January 13, 2010

జంధ్యాల

సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ, జీవితాలన్నింటిలో కొన్ని లైన్లు కాపీ పేస్ట్ చేసేశాడు!

పండగ పూట ఈ చావు గోల ఏంటీ? అని విసుక్కునేలోపు, అసలు సంగతి మొదలెడతా!

మా అమ్మ చిన్నప్పుడు, సంక్రాంతి నెల అంటే ముగ్గులూ, భోగి మంటలూ, పంట ఇంటికి రావడాలూ వంటివన్నీ! మా అమ్మ పెళ్లి అయ్యాక సంక్రాంతి అంటే వారం ముందే అన్ని కొత్త సినిమాలకి వరుస షోలకి అడ్వాన్సు బుకింగ్ చేసుకొని ఆర్టీసీ క్రాస్‍రోడ్స్ లోనే “పండగ” చేసుకోవడం. ఇప్పుడేమో అందరూ ఇంటిపట్టునుండి, చేసిన వంటలేవో “జెమిని పెట్టు”, “తేజలో ఏం సినిమా వేశాడో?!”, “ఈ వాడు పాత సినిమాలేస్తాడు..”, “మా లో ఏమొస్తుందో!” అన్న చర్చల మధ్య నలుగురూ కల్సి తినడం.
“మా సినిమా చూడండో.. చూడండో” అన్న దండోర ప్రతీ పండక్కి ఉన్నదే అయినా, సంక్రాంతి పూట ఒక స్పెషల్ – అదే జంధ్యాల గారి జయంతి.

పోయిన ఆదివారం, ఇంకా నిద్ర వదలని కళ్ళతో టేబుల్ మీద పరిచి ఉన్న పేజీని చూసీ చూడంగానే రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నిద్ర మత్తు వదిలించుకొని, సాక్షి ఫామిలీ పేజిలో సగం వరకూ నిండున్న “జంధ్యాల” గారి ఫోటో అలానే చూస్తుండిపోయాను. కొందరి ప్రముఖుల అభిప్రాయాలు వేసి, “అతి త్వరలో.. మరెన్నో!” అంటూ ముగించాడు.
సచిన్ ఇరవై ఏళ్ల బట్టీ ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఒకటే మాట: “ఐ ఎంజాయ్ మై క్రికెట్!” అని. నేను సచిన్‍కి వీరాభిమానిని! అయినా సచిన్ ఇంటర్వ్యూ చూస్తున్నా, చదువుతున్నా “ఐ ఎంజాయ్ మై క్రికెట్” అంటూ mock చేస్తుంటాను, “అదే నీవు.. అదే మాట!” అని పాట కూడా అందుకుంటాను.

నేను జంధ్యాల అభిమానిని కాను. “బాబూ.. చిట్టీ” అన్న డైలాగులో “బ” వినిపించగానే జంధ్యాల మార్కు డైలాగని గుర్తించగలగాలట! నాకు మొత్తం డైలాగు చెప్పినా గుర్తురాదు. ఆయన రాసిన డైలాగులు ఎవరన్నా వినిపిస్తే, ఏ సినిమాలో ఏ సన్నివేశంలో అది వస్తుందో చెప్పటం నా వల్ల కాదు, అప్పటికే ఆ సినిమా ఒక పది పదిహేను సార్లు చూసున్నా! ఆయన ఎన్ని సినిమాలు తీసారంటే చెప్పలేను. ఆయన సినిమాలని సమగ్రంగా విశ్లేషించలేను
.
నాకు నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, నన్ను “వివాహభోజనంబు” అన్న సినిమా తీసుకెళ్లారు మా వాళ్లు. ఆ సినిమా చివర్లో మాయాబజార్‍లో “వివాహభోజనంబు” పాట వస్తుందనీ, అంతకు ముందు నేను చాలా నవ్వుకున్నాననీ నాకు ఇప్పటికీ గుర్తు. ఓ రెండు దశాబ్దాలు గడిచినా జంధ్యాల సినిమాలంటే నాకదే జ్ఞాపకం – బోలెడన్ని నవ్వులు! మహా ఇష్టంగా తిన్న పదార్థం రుచి మాత్రమే గుర్తుండి, ఆ పదార్థం పేరు గానీ, ఆకారం గానీ, మరే వివరాలు గానీ గుర్తులేనట్టుగా ఉంటుంది జంధ్యాల గారి సినిమాలతో నా జ్ఞాపకం, ఇన్నేళ్ల బట్టి ఎన్ని సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తున్నా!

మరిప్పుడు నేనెందుకు ఇదంతా రాయడం?!

జంధ్యాల గారి పుట్టిన రోజుకీ, వర్థంతికీ ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన్ని వేనోళ్ళ కొనియాడుతారు. ఎన్నెన్నో కబుర్లు చెప్తారు, ఆయన గురించి. తెలుగు సినిమాలో హాస్యం లాస్యం ఆయన వల్లనేనని! ఆయన ఎందరికో అన్నం పెట్టారని. ఆయన బహుముఖప్రజ్ఞాశాలని. ఆయన అది అనీ.. ఇది అనీ..

కానీ నాకెప్పుడూ ఆయన గురించి చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య గుర్తు వస్తూ ఉంటుంది. ఆయన చనిపోయిన కొత్తల్లో ఓ సంతాప సభలో కళాతపస్వి విశ్వనాథ్ గారి మాటలు:

(టివిలో చూసానప్పట్లో, నా జ్ఞాపకాల్లో ఊరిన ఆయన మాటలు)

“జంధ్యాల బతికున్నంత కాలం మా ఇద్దరి మధ్యా ఎలాంటి అసూయ గానీ, పోటీ గానీ లేవు. కానీ నాకిప్పుడు జంధ్యాలని చూస్తుంటే నాకు మహా అసూయగా ఉంది. తాను మరణించినా, ఆయన కోసం ఇంత మంది ఇలా కల్సి గుర్తుచేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చనిపోయాక ఇలా చేస్తారా? అన్న ఆలోచన వస్తుంది..”

ఈ మాటల్లో అంతరార్థం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది.

మొన్నేదో కథను రాసే ప్రయత్నంలో భాగంగా: “చావు టూ వీలర్ మీదే వస్తుంది. దానికి కావాల్సిన మనిషిని ఎక్కించుకొని పోతుంది. ఆ మనిషికి సంబంధించిన మనుషులని కానీ, బాగేజీలని కానీ ఏది వెంట తీసుకెళ్ళనివ్వదు. చుక్కలన్నీ కలిపి అందంగా వేసుకొన్న ముగ్గులో తనక్కావాల్సిన పువ్వునో, తుమ్మెదనో తనతో తీసుకుపోతుంది. చెరిగిన ముగ్గులా మిలిగిపోతాయి మిగితా జీవితాలు. చావుతో ఒక్క చావు కాదనుకో!” అన్న లైన్లు రాసుకున్నాను.

జంధ్యాల గారి గురించి ఈ పూట ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, ఆయన మృత్యువుని కూడా నవ్వులతో ఓడింఛేశారని. నవ్వుల చక్రవర్తి ముందు మరణం కూడా దాసోహం అందని. నవ్విస్తూ, నవ్వుతూ కాలం గడిపేసిన ఆయన పోయాక కూడా మన కోసం బోలెడు నవ్వుల్ని మన దగ్గరే వదిలి వెళ్లటమే కాక, విపరీత పరిస్థితుల్లో మనల్ని మనం నవ్వించుకోవటం ఎలానో నేర్పారు. “చేపలు తెచ్చి పెడితే ఆకలి తీర్చిన వారమవుతాం. చేపలు పట్టడం నేర్పితే బతుకుతెరువు చూపించిన వారమవుతాం” అన్న ఆంగ్ల సామెతలా ఆయన్ని మనకి చీకట్లో నవ్వుల బాణాసంచా కాల్చడం నేర్పారు. ఆయన సినిమాలు చూడకుండా మనం పెరిగుంటే, అందులో ఎన్ని నవ్వులు మైనస్ అయ్యేవో! మనవి ఇంకెంత ఏడుపుగొట్టు జీవితాలయ్యేవో!

మృత్యువు తర్వాత కూడా జీవితం ఉంటుంది. ఆ జీవితంలో మనం భౌతికంగా తప్పించి మరన్ని విధాలుగానూ జీవిస్తూనే ఉండచ్చు. ఎప్పటికీ భౌతికంగా ఉండడం కన్నా, పదుగురి నోట నానుతూ, ఆనందాన్ని పంచుతూ ఉండడమే అమరత్వం. అప్పుడు చావుకూడా, స్టేజి మీద నుండి ఓ కీలక పాత్రను తొలిగించడానికి దేవుడి స్క్రిప్ట్ లో ఉన్న inefficiently misplaced extra character గా మిగిలిపోతుంది.

కళ ద్వారా అమరత్వాన్ని సంపాదించిన అతి కొద్ది మందిలో జంధ్యాల గారు చిరస్మరణీయులు! కష్టాల్.. నష్టాల్.. దుఃఖాల్.. అన్నీ శ్రీశ్రీ కవిత్వమంత ఘాటుగా, తీవ్రంగా, సూటిగా వచ్చినా మన దగ్గరున్న తారకమంత్రం “జంధ్యాల”.
ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!

రాసిన వారు: పూర్ణిమ

Sunday, December 13, 2009

మహనీయుల గురించి...

బాలలూ మన భారతదేశంలో ఋషులు, ప్రవక్తలూ, మహాత్ములూ, మేధావులూ, శాంతిదూ తలూ, వీరులూ, త్యాగులూ, ధాన ధర్మాత్ములూ... ఇలా ఎందరో మహాను భావులు పుట్టారు. ఆ మహనీయుల చరిత్రను స్మరించు కుంటూ మన జీవితాలని బాల్యం నుంచే సరిదిద్దుకుంటూ, దేశభక్తితో జీవించడానికి ప్రయత్నించాలి.

గాంధీజీ
జాతిపిత మహాత్మా గాంధీజీని గురించి ఎంత తెలుసు కున్నా తక్కువే అవుతుంది. నిరంతరం ఆ మహాత్ముని స్మరిం చుకుంటూ ఆయన ఆశయాలని బాలలైన మీరు ఇప్పట్నుంచే అలవర్చుకోవాలి, ఆచరించాలి.
వెూహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీకి తల్లిదండ్రులంటే ఎంతో భక్తీ, గౌరవాలుండేవి. తల్లి అంటే గాంధీకి అమిత మైన ప్రేమ! అతడామె ఆజ్ఞలన్నిటినీ కూడా మూఢంగా అను సరించేవాడు. బాల్యం నుంచే గాంధీజీ తాను మంచిదని నమ్మిన సిద్ధాంతాన్ని తల్లి చెప్పినా కూడా ఏ మాత్రం వినే వాడు కాడు. ఒకసారి తన అన్న గాంధీని కొట్టి అవమాన పర్చాడని తల్లితో వెళ్లి ఫిర్యాదు చేశాడు. తల్లి పుత్లీభాయికి కోపం వచ్చింది. ''వెంటనే అన్నయ్యను మళ్లీ తిరిగి కొట్టలేకపోయావా!'' అని తల్లి ప్రశ్నించింది. వెూహన్‌గాంధీకి ఆశ్చర్యం వేసి తల్లివంక చూస్తూ ''అమ్మా! నీవు నన్ను తిరిగి అన్నయ్యను కొట్టమని బోధిస్తున్నావేమిటి నేనెవరినైనా ఎందుకు కొట్టాలి... కొట్టినవాడ్ని అలా కొట్టకూడ దని పిలిచి చెప్పడానికి బదులు దెబ్బలు తిన్న నన్ను తిరిగి అన్నయ్యను కొట్టమని చెబుతావేమిటమ్మా!'' అని ప్రశ్నించాడు బాల గాంధీ. అపðడు అతని విజ్ఞతకు తల్లి ఎంతో మెచ్చుకుంది. చిన్నతనంలోనే అం తటి తెలివితేటలు గల వాదన అలవడినం దుకు ఆశ్చర్యంతో పాటు సంతోషపడ్డది.
చూశారా బాలలూ! ఏ మంచి కార్య క్రమాలైనా చిన్నప్పట్నుంచే అలవర్చు కోవాలి. ఏది మంచి, ఏది చెడు అని గ్రహించి ఎపðడూ మంచిగానే గ్రహిం చాలి. అదే మీ జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు పయనింపచేస్తుంది.

లోహియా
దేశభక్తుడు, సృజనాత్మక ప్రతిభగల రామ్‌ మనోహర లోహియా జీవితంలోని ఓ చిన్న సంఘటన గురించి ముచ్చటించుకుందాం.

1930లో నానారాజ్య సమితి జరుగుతోంది. ఉన్నట్టుండి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఒక పెద్ద 'ఈల' వినిపించింది. అంతా చకితులై చూశారు ఈల వేసి వ్యక్తి వైపు. భారతీయ ప్రతినిధిగా వచ్చిన అప్పటి బికనీర్‌ మహారాజా తాను ప్రసంగిస్తున్న భాషను నిలిపి ప్రేక్షకుల గ్యాలరీ వైపు ఈల వేసిన ఆ వ్యక్తి వైపే తెల్లబోయి చూస్తూండిపోయాడు. భారతదేశంలోని బ్రిటీష్‌ పాలనా శ్రేష్ఠత్వాన్ని గురించి ఏకధాటిగా ఉపన్యసిస్తున్నాడు బికనీర్‌ మహారాజా ఆనాటి నానారాజ్య సమితిలో. అపðడు ఆ అబద్ధాల పొగడ్తల ప్రసంగాన్ని వినలేక అసమ్మతిగా 'ఈల' వేశాడు రామ్‌ మనోహర లోహియా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి.

వెంటనే అక్కడున్న కొందరు లోహియాను బలవంతం గా బయటకు పంపివేశారు. అపðడు లోహియా వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే. అపðడు ఆయన 'బెర్లిన్‌ విశ్వ విద్యాలయం'లో అధ్యయనం చేస్తూండేవాడు. భారతదేశం లో బ్రిటీష్‌ పాలనా విధానాలను గురించి బికనీర్‌ మహారాజా చేయబోయే ప్రసంగాన్ని వినాలనే కుతూహలం కొద్దీ లోహియా బెర్లిన్‌ నుంచి జెనీవా వచ్చాడు. ఆ ప్రసంగం ఏ మాత్రం నచ్చని లోహియా ధైర్యంగా వ్యతిరేకిస్తూ ఈల వేయ టం సామాన్యమైన విషయం కాదు. చూశారా బాలలూ! ఆయన నరనరాలలో 'దేశభక్తి' ఎలా పొంగి పొర్లిందో! అలాంటి దేశభక్తి మీలో పెం పొందించు కోవాలి.

శరత్‌బాబు
గొప్ప బెంగాలీ రచయిత శరత్‌ బాబును గురించి తెలియని సాహిత్య పరుడు ఉండడు. ఆయన నవలలు, కథలు యథార్థ జీవితాలకు అద్దం పడు తాయి. బాల్యం నుంచి కూడా శరత్‌ చాలా కష్టనష్టాల్నీ బాధల్నీ అనుభవించిన గొప్ప రచయిత. ఆయన విశిష్ట వ్యక్తి త్వాన్ని ఎత్తిచూపే ఈ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుందాం బాలలూ!
'దేశబంధు' చిత్తరంజన్‌దాసుని తెలి యనివారుండరు. రాజకీయనాయకుడిగా, లాయర్‌గా, కవిగా ప్రసిద్ధుడు ఆయన.
అప్పట్లో 'నారాయణ' అనే ఒక సాహిత్య పత్రికాధిపతిగా ఉండేవారు ఆయన. చిత్తరంజన్‌ కోరిక ప్రకారం శరత్‌బాబు 'స్వామి' అనే ఒక కథను రాసి పంపిం చాడు. ఆ కథను చదివిన దాసు తన్మయుడై తిరుగు టపాలో ఓ బ్లాంక చెక్కుని శరత్‌బాబుకి పంపాడు. దాంతోపాటు ఆయన ఓ ఉత్తరాన్ని కూడా జత చేశాడు. అందులో ''మహౌ న్నతమైన ఒక రచయిత నుంచి ఓ గొప్ప కథను సంపా దించాను. దానికి ఇంత అని వెలకట్టే సాహసం నాకు లేదు. అందుచేత ఈ ఖాళీ చెక్కును మీకు పంపాను. ఈ కథకు మీ ఇష్టం వచ్చినంత మొత్తాన్ని ప్రతిఫలంగా వేసొకొని మార్చుకొనవచ్చును'' అని వివరంగా రాశాడు.

శరత్‌బాబు ఆ ఉత్తరాన్ని, చెక్కును చూసి సంతోష పడ్డాడు. ఆ బ్లాంక చెక్కులో కేవలం మూడు రూపాయలే వేసుకొని మార్చుకున్నాడట!

చూశారా బాలలూ! శరత్‌బాబు ప్రతిష్ట, ఆయన నిజా యితీ తత్త్వం. వ్యక్తిత్వ వికాసం జీవితాన్ని ఆనందమయంగా మారుస్తుంది. ఉన్నతమైన సద్గుణాలు బాల్యం నుంచే పెంపొం దించుకోవాలంటే మహనీయుల జీవిత చరిత్రల్ని చదవాలి, ఆచరిస్తూ రావాలి. నేటి విజ్ఞానవంతులైన బాలలే ఉజ్వల భావి పౌరులుగా రాణిస్తారు

Wednesday, July 8, 2009

ఒక గొప్ప రైతు అస్తమయం

ఒక గొప్ప రైతు అస్తమయం

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు గొర్రెపాటి నరేంద్రనాధ్ మరణించారని నిన్న సాయంత్రం మిత్రుడు రాకేష్ ద్వారా తెలిసింది. ఆచరణ సాధ్యం కాని పెద్ద పెద్ద మాటలు “మాట్లాడే” మేధావులున్న ఈ రోజుల్లో చెప్పే మాటలను చేతల్లో చూపించే మనకాలపు మేధావి నరేంద్రనాధ్.

ఆయన ఆత్మకథ “ఇట్లు ఒక రైతు”లో ఒక వైపు ఎంతో అనుభవజ్ఞుడైన సామాజిక ఉద్యమకారుడిగా వివిధ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు చూపిస్తూనే మరో వైపు ఒక అమాయక పల్లెటూరి రైతులా సేంద్రియ వ్యవసాయం అమలులొ ఉండే సాధకబాధకాలు ఏకరువు పెడతారు. అసలు సేంద్రియ వ్యవసాయం మాట్లాడినంత సులభమూ, లాభదాయకమూ కాదని కుండబద్దలుకొట్టి చెబుతారు. ఇట్లు ఒక రైతు మన గ్రామీణ రైతాంగపు దుస్థితిని కళ్లకుకడుతుంది. మనం సాధిస్తున్న “అభివృద్ధి” ఎంత మేడిపండువంటిదో వివరిస్తూ, పరిస్థితి మారాలంటే మన ప్రభుత్వాలు ఏమి చేయాలో కూడా దిశానిర్దేశం చేస్తారు నరేన్ ఈ పుస్తకంలో.

వ్యవసాయ రంగం వినియోగిస్తున్న విద్యుత్తుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పినప్పుడు ఆ అన్యాయపు లెక్కలను ఎత్తిచూపిన కొద్దిమందిలో నరేంద్రనాధ్ ఒకరు. చిత్తూరు జిల్లాలో రాష్ట్రీయ రైతు సేవాసమితి ఆధ్వర్యంలో ఆయన అనేక రైతుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు.

వ్యవసాయ సమస్యల నుండి మొదలుకొని మానవహక్కుల దాకా ఆయన పాలుపంచుకోని ఉద్యమంలేదు. ఓ వైపు మద్య నిషేధానికీ పాటుపడుతూనే, ఇటు కులవివక్షకూ వ్యతిరేకంగా పోరాడిన యోధుడాయన. ప్రజా ఉద్యమాలను నిచ్చెనమెట్లలా చేసుకుని స్వంత అభివృద్ధికి ఉపయోగించుకునే వారు ఎందరో ఉన్న నేటి కాలంలో డిల్లీ నుండి తన పల్లెకొచ్చి సమాజం బాగుకొరకు తన జీవితం మొత్తం వెచ్చించిన గొప్ప మనిషి నరేంద్రనాధ్.

నరేంద్రనాధ్ గురించి మరిన్ని వివరాలకై ఈ పోస్టు చదవండి:

http://hridayam.wordpress.com/2009/05/19/one-straw-revolution/

ఆయన ఆత్మకథ “ఇట్లు ఒక రైతు” పరిచయం ఇక్కడ చదవండి:

http://hyderabadbooktrust.blogspot.com/2009/03/blog-post_25.html

నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్స్ నివాళి ఇక్కడ చదవండి:

http://aravinda.aidindia.org/?p=181

ఆయన మృతిపై ఆంధ్రజ్యోతి పత్రికా వార్తను కింద చదవండి:

narendranath1

narendranath2

నిన్నటి ఆంధ్ర జ్యోతిలో బాలగోపాల్ రాసిన వ్యాసం కూడా రికార్డు కోసం కింద ఉంచాను.

—-

అసాధారణులలో ఒకడు

-కె.బాలగోపాల్‌

నరేంద్రనాథ్‌ అన్యాయాన్ని ద్వేషించాడు గానీ ఏ మనిషినీ ద్వేషించలేదు. బహుశా అతను గాంధియిజం అని అర్థం చేసుకున్నది ఇదే ననుకుంటాను. దీనిని గాంధీ ఎంతగా ఆచరించారో తెలీదుగానీ నరేంద్రనాథ్‌ మాత్రం మనస్ఫూర్తిగా ఆచరించాడు. మనిషిగా మంచితనాన్ని ఏ మాత్రం కోల్పోకుండా న్యాయం కోసం జరిగే సంఘర్షణలో భాగస్వాములు కావచ్చునని రుజువు చేశాడు.

గాంధేయవాదులు ఆయనను కమ్యూనిస్టు అనుకునేవారు. కమ్యూనిస్టులు ఆయనను గాంధేయవాది అనుకునేవారు. ఆయన మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరి వేదికలలోనూ పనిచేసేవాడు. మంచి కోసం పనిచేసే ఏ వేదికలోనయినా ఇమిడేవాడు, ఇమిడి పనిచేసేవాడు. అట్లాగని తన అభిప్రాయాలు ఎక్కడా దాచుకునేవాడు కాడు. ఎవరి దగ్గర వారి అభిప్రాయాలు పలికేవాడు కాడు. పైగా ఎవరితో కలిసి పనిచేసినా వారి దృక్కోణానికి కనిపించని విషయాలు, తోచని ఆలోచనలు చర్చకు పెట్టే వాడు. గాంధేయవాదులను వర్గ దోపిడీ సంగతేమిటని అడిగేవాడు. కమ్యూనిస్టులను ప్రజాస్వామ్యం గురించి, హింస గురించి ప్రశ్నించేవాడు. బయట ఉండి ఇటువంటి ప్రశ్నలు వేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కాని నరేంద్రనాథ్‌ ఇద్దరితోనూ కలిసి పనిచేస్తూ ఇద్దరి వేదికలలోనూ పని చేస్తూ ఈ ప్రశ్నలు లేవదీసేవాడు.

ఇది నరేంద్రనాథ్‌ స్వభావం నుంచి వచ్చిందే తప్ప తెచ్చి పెట్టుకున్న ఎత్తుగడ కాదు. మంచి చేసే వారెవరినయినా మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడు. గాంధేయవాదాన్ని విస్త­ృత ప్రజా ఉద్యమాలలో ఆచరించాలని ప్రయత్నిస్తున్న మేధాపాట్కర్‌ తోనూ కలిసి పనిచేశాడు. కమ్యూనిస్టు కొల్లా వెంకయ్య గారినీ చాలా అభిమానించి భూ సంస్కరణల అమలు కోసం ఆయనతోనూ కలిసి పనిచేసేవాడు. నరేంద్రనాథ్‌కు అభిప్రాయాలు లేక కాదు. కానీ పిడివాదం లేశమంత కూడ ఉండేదికాదు. ఉదాహరణకు హింస ఏ కారణంగా చేసినా ఎవరు చేసినా తప్పని నమ్మేవాడు. కానీ ఉద్యమాలూ ఉద్యమకారులూ చేసే హింసను ఖండించడానికి నిరాకరించే పౌర హక్కుల సంఘంలో బాధ్యతలు తీసుకొని మరీ పనిచేశాడు.

మానవ హక్కుల వేదిక ఏర్పడిన తరువాత, ఉద్యమకారులు హింసను అన్యాయంగా ప్రయోగిస్తే ఖండిస్తామని అంటే ‘హింసకు న్యాయం అన్యాయం ఏమిటి అసలు హింసే అన్యాయం’ అంటూ అభ్యంతరం తెలిపాడు గానీ మళ్లీ బాధ్యతలు తీసుకొని మరీ పని చేశాడు. పేదలకు పంచడానికి ఇంకా భూములెక్కడున్నాయి అని కమ్యూనిస్టులు సహితం అనుకుంటున్న దశలో తన స్వంత జిల్లా అయిన చిత్తూరులో పేదలకు పంచని, పంచినా అన్యాక్రాంతమైన సీలింగ్‌ భూము ల్ని, భూస్వాములు బోగస్‌ సెటిల్‌ మెంట్‌ పట్టాలు పొందిన ఎస్టేట్‌ భూముల్ని ఎన్ని వేల ఎకరాలున్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీసి భూ సంస్కరణల కార్యాచరణోద్యమం పేరిట దళిత సంఘాలనూ ఇతర ఉద్యమకారులనూ కలుపుకొని కలెక్టర్ల, జాయింట్‌ కలెక్టర్ల వెంటపడ్డాడు. గడచిన అయిదారు సంవత్సరాలలో ఆ జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులెవ్వరూ నరేంద్రనా«థ్‌ను జీవితంలో మరచిపోలేరు. మావోయిస్టులకూ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య చర్చలు విఫలం అయిన తరువాత మావోయిస్టుల సూచన మేరకు ఏర్పడిన భూమి కమిషన్‌లో కూడా చొరవ తీసుకొని పనిచేశాడు.

ఒకటి సత్యమని నమ్మిన తరువాత దానిని ఆచరించకుండ ఉండడం నరేంద్రనాథ్‌కు తెలీదు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిజి చేశాడు కనుక మంచి ఉద్యోగంలో స్థిరపడి అభ్యుదయం గురించి రాస్తూ మాట్లాడుతూ సమాజం మన్ననలు పొంది ఉండవచ్చు. కానీ అది అతని నైజం కాదు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఆ రోజులలో హైదరాబాద్‌లో మతఘర్షణలు తరచుగా జరిగేవి. మతతత్వాన్నీ, మతతత్వ పార్టీలనూ తిడుతూ కూర్చుంటే చాలదనీ పాత బస్తీలో ప్రజలకు కరువయిన పౌర సదుపాయాలు కల్పించడం, వాటికోసం ఆందోళన చేయడం అవసరమనీ నమ్మి ‘హైదరాబాద్‌ ఏక్తా’లో భాగం అయ్యాడు. పాత బస్తీలో ఉచిత క్లినిక్‌ల ఏర్పాటులో నిమగ్నమయి కొంతకాలం పనిచేశాడు.

అయితే తన కార్యరంగం హైదరాబాద్‌ కాదనే నిర్ణయానికి వచ్చాక తన భావాలు చాలావరకు పంచుకునే సహచరి ఉమాశంకరితో కలిసి చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామమయిన వెంకటాపురం వెళ్లిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ సామాజిక అభ్యుదయం కోసం కృషి కొనసాగించాడు. పేదల చేత తాగుడు మాన్పించడం కోసం కృషి చేశాడు. కులాంతర వివాహాలు చేశాడు. ‘రెండు గ్లాసుల’ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఊరూరూ తిరిగి ప్రచారం చేసి చాలా చోట్ల మాన్పించగలిగాడు. ఆ జిల్లాలో దళితులు వోట్లేసి ఎరుగని గ్రామాలు అనేకం ఉన్నాయని తెలుసుకొని దళిత పల్లెలలో ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని పట్టుబట్టి చాలా చోట్ల సాధించాడు. వ్యవసాయాన్ని నిరాదరణ ద్వారా, తప్పుడు అభివృద్ధి విధానాల ద్వారా ధ్వంసం చేసిన పాలకనీతికి ఒక మెట్ట ప్రాంతపు రైతుగా స్పందించాడు.

అన్ని విషయాలలో లాగ ఈ విషయంలో కూడ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే చాలదనీ మనం చేసేది చేయాలనీ నమ్మాడు. రసాయన ఎరువులు, మందులు వాడకుండ వ్యవసాయం చేసే ప్రయోగాన్ని తన భూమిలోనే చేశాడు. గ్రామంలో ఒక రైతు మాత్రమే ఈ ప్రయోగం చేస్తే అందులో ఎన్ని కష్టాలున్నాయో ఆచరణాత్మకంగా గ్రహించాడు. నిరాశ చెందాడుగానీ నిస్ప­ృహలో సహితం తనను గురించి తాను చమత్కరించే నైజం ఉన్న వ్యక్తి కాబట్టి డీలాపడిపోలేదు. ‘ఇట్లు ఒక రైతు’ అనే శీర్షికతో తన అనుభవాన్ని పుస్తకంగా ప్రచురించాడు.

ఒక దశాబ్దం కింద విద్యుత్‌ రంగ సంస్కరణలు ప్రారంభమయిననాటినుంచి వాటికొక వినియోగదారుడైన రైతుగానూ, ఉద్యమకారుడిగానూ నరేంద్రనాథ్‌ స్పందించాడు. వాటి లోతుపాతులు బాగా అధ్యయనం చేసి పదిమందికీ వివరించి చెప్పాడు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ప్రతీ సంవత్సరం నిర్వహించే టారిఫ్‌ విచారణలకు సవివరమయిన విమర్శతోనూ ప్రతిపాదనలతోనూ హాజరయ్యేవాడు. తన మిత్రులకు తర్ఫీదు ఇచ్చి వారిని బతిమాలి బామాలి హాజరయ్యేట్టు చూసేవాడు.

ప్రాజెక్టు నిర్వాసితుల గురించి బాధితుల గురించి, ఇవ్వాళ ఆందోళన చేయడం సాధారణ విషయమయిందిగానీ శ్రీశైలం ప్రాజెక్టునాడే దిక్కు లేకుండా ఊర్లు ఖాళీ చేసిన ప్రజల గురించి సమాచారం సేకరించాడు, చర్చ పెట్టాడు. ఏ సమస్య నయినా ప్రజలతో చర్చ పెట్టడమే ఇష్టపడేవాడు. పట్టణాలలో జరిగే సభల కంటే గ్రామాలలో తిరిగే పాదయాత్రలనే ఎక్కువ ఇష్టపడేవాడు. మెదడు క్యాన్సర్‌ సెకండరీస్‌ ఏర్పడ్డాయని తెలిసిన తరువాత కూడ సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కరీంనగర్‌ జిల్లాలో జరిగిన పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.

నరేంద్రనాథ్‌ ఇన్ని పనులనూ చేయడమే కాక అన్ని పనులూ నవ్వుతూ చేసేవాడు. పసిపిల్లవాడి నవ్వు అతని ముద్ర. చర్చలయినా నవ్వుతూనే పెట్టేవాడు. సంస్థాగత సమావేశాలకు నరేంద్రనాథ్‌ హాజరవుతున్నాడంటే ఏదో ఒక చర్చ పెట్టడానికే అని అందరికీ తెలుసు. నిరంతరం వాదించేవాడు కాని ఎదుటివారిని ఎప్పుడూ కించపరిచే వాడుకాదు. ఎదుటివారిని గాయపరచడమే వాదనలో విజయం అని భావించేవారు మనకు ఉద్యమాలలో, ఉద్యమ సంస్థలలో చాలామంది కనిపిస్తారు. తేడాలు రాగానే సంస్థలు చీలిపోవడానికి ఇదొక ముఖ్యకారణం.

నరేంద్రనాథ్‌ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఉద్యమాలలోనే కాదు, సామాజిక సంఘర్షణలోనూ అంతే. అతను అన్యాయాన్ని ద్వేషించాడు గానీ ఏ మనిషినీ ద్వేషించలేదు. బహుశా అతను గాంధియిజం అని అర్థం చేసుకున్నది ఇదేననుకుంటాను. దీనిని గాంధీ ఎంతగా ఆచరించారో తెలీదుగానీ నరేంద్రనాథ్‌ మాత్రం మనస్ఫూర్తిగా ఆచరించాడు. మనిషిగా మంచితనాన్ని ఏ మాత్రం కోల్పోకుండా న్యాయం కోసం జరిగే సంఘర్షణలో భాగస్వాములు కావచ్చునని రుజువు చేశాడు.

చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించేటప్పుడు ‘అసాధారణమైన మనిషి’ అనడం పరిపాటి. అయితే నిజమైన అర్థంలో అసాధారణమైన మనుషులుప్రపంచంలో కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందిలో ఒకడు గొర్రెపాటి నరేంద్ర నాథ్‌. అటువంటి వ్యక్తిని 57 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్‌ రోగం ఈ లోకానికి దూరం చేయడం నిజంగా చాలా బాధాకరం.

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070