Wednesday, July 8, 2009

ఒక గొప్ప రైతు అస్తమయం

ఒక గొప్ప రైతు అస్తమయం

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు గొర్రెపాటి నరేంద్రనాధ్ మరణించారని నిన్న సాయంత్రం మిత్రుడు రాకేష్ ద్వారా తెలిసింది. ఆచరణ సాధ్యం కాని పెద్ద పెద్ద మాటలు “మాట్లాడే” మేధావులున్న ఈ రోజుల్లో చెప్పే మాటలను చేతల్లో చూపించే మనకాలపు మేధావి నరేంద్రనాధ్.

ఆయన ఆత్మకథ “ఇట్లు ఒక రైతు”లో ఒక వైపు ఎంతో అనుభవజ్ఞుడైన సామాజిక ఉద్యమకారుడిగా వివిధ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు చూపిస్తూనే మరో వైపు ఒక అమాయక పల్లెటూరి రైతులా సేంద్రియ వ్యవసాయం అమలులొ ఉండే సాధకబాధకాలు ఏకరువు పెడతారు. అసలు సేంద్రియ వ్యవసాయం మాట్లాడినంత సులభమూ, లాభదాయకమూ కాదని కుండబద్దలుకొట్టి చెబుతారు. ఇట్లు ఒక రైతు మన గ్రామీణ రైతాంగపు దుస్థితిని కళ్లకుకడుతుంది. మనం సాధిస్తున్న “అభివృద్ధి” ఎంత మేడిపండువంటిదో వివరిస్తూ, పరిస్థితి మారాలంటే మన ప్రభుత్వాలు ఏమి చేయాలో కూడా దిశానిర్దేశం చేస్తారు నరేన్ ఈ పుస్తకంలో.

వ్యవసాయ రంగం వినియోగిస్తున్న విద్యుత్తుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పినప్పుడు ఆ అన్యాయపు లెక్కలను ఎత్తిచూపిన కొద్దిమందిలో నరేంద్రనాధ్ ఒకరు. చిత్తూరు జిల్లాలో రాష్ట్రీయ రైతు సేవాసమితి ఆధ్వర్యంలో ఆయన అనేక రైతుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు.

వ్యవసాయ సమస్యల నుండి మొదలుకొని మానవహక్కుల దాకా ఆయన పాలుపంచుకోని ఉద్యమంలేదు. ఓ వైపు మద్య నిషేధానికీ పాటుపడుతూనే, ఇటు కులవివక్షకూ వ్యతిరేకంగా పోరాడిన యోధుడాయన. ప్రజా ఉద్యమాలను నిచ్చెనమెట్లలా చేసుకుని స్వంత అభివృద్ధికి ఉపయోగించుకునే వారు ఎందరో ఉన్న నేటి కాలంలో డిల్లీ నుండి తన పల్లెకొచ్చి సమాజం బాగుకొరకు తన జీవితం మొత్తం వెచ్చించిన గొప్ప మనిషి నరేంద్రనాధ్.

నరేంద్రనాధ్ గురించి మరిన్ని వివరాలకై ఈ పోస్టు చదవండి:

http://hridayam.wordpress.com/2009/05/19/one-straw-revolution/

ఆయన ఆత్మకథ “ఇట్లు ఒక రైతు” పరిచయం ఇక్కడ చదవండి:

http://hyderabadbooktrust.blogspot.com/2009/03/blog-post_25.html

నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్స్ నివాళి ఇక్కడ చదవండి:

http://aravinda.aidindia.org/?p=181

ఆయన మృతిపై ఆంధ్రజ్యోతి పత్రికా వార్తను కింద చదవండి:

narendranath1

narendranath2

నిన్నటి ఆంధ్ర జ్యోతిలో బాలగోపాల్ రాసిన వ్యాసం కూడా రికార్డు కోసం కింద ఉంచాను.

—-

అసాధారణులలో ఒకడు

-కె.బాలగోపాల్‌

నరేంద్రనాథ్‌ అన్యాయాన్ని ద్వేషించాడు గానీ ఏ మనిషినీ ద్వేషించలేదు. బహుశా అతను గాంధియిజం అని అర్థం చేసుకున్నది ఇదే ననుకుంటాను. దీనిని గాంధీ ఎంతగా ఆచరించారో తెలీదుగానీ నరేంద్రనాథ్‌ మాత్రం మనస్ఫూర్తిగా ఆచరించాడు. మనిషిగా మంచితనాన్ని ఏ మాత్రం కోల్పోకుండా న్యాయం కోసం జరిగే సంఘర్షణలో భాగస్వాములు కావచ్చునని రుజువు చేశాడు.

గాంధేయవాదులు ఆయనను కమ్యూనిస్టు అనుకునేవారు. కమ్యూనిస్టులు ఆయనను గాంధేయవాది అనుకునేవారు. ఆయన మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరి వేదికలలోనూ పనిచేసేవాడు. మంచి కోసం పనిచేసే ఏ వేదికలోనయినా ఇమిడేవాడు, ఇమిడి పనిచేసేవాడు. అట్లాగని తన అభిప్రాయాలు ఎక్కడా దాచుకునేవాడు కాడు. ఎవరి దగ్గర వారి అభిప్రాయాలు పలికేవాడు కాడు. పైగా ఎవరితో కలిసి పనిచేసినా వారి దృక్కోణానికి కనిపించని విషయాలు, తోచని ఆలోచనలు చర్చకు పెట్టే వాడు. గాంధేయవాదులను వర్గ దోపిడీ సంగతేమిటని అడిగేవాడు. కమ్యూనిస్టులను ప్రజాస్వామ్యం గురించి, హింస గురించి ప్రశ్నించేవాడు. బయట ఉండి ఇటువంటి ప్రశ్నలు వేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కాని నరేంద్రనాథ్‌ ఇద్దరితోనూ కలిసి పనిచేస్తూ ఇద్దరి వేదికలలోనూ పని చేస్తూ ఈ ప్రశ్నలు లేవదీసేవాడు.

ఇది నరేంద్రనాథ్‌ స్వభావం నుంచి వచ్చిందే తప్ప తెచ్చి పెట్టుకున్న ఎత్తుగడ కాదు. మంచి చేసే వారెవరినయినా మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడు. గాంధేయవాదాన్ని విస్త­ృత ప్రజా ఉద్యమాలలో ఆచరించాలని ప్రయత్నిస్తున్న మేధాపాట్కర్‌ తోనూ కలిసి పనిచేశాడు. కమ్యూనిస్టు కొల్లా వెంకయ్య గారినీ చాలా అభిమానించి భూ సంస్కరణల అమలు కోసం ఆయనతోనూ కలిసి పనిచేసేవాడు. నరేంద్రనాథ్‌కు అభిప్రాయాలు లేక కాదు. కానీ పిడివాదం లేశమంత కూడ ఉండేదికాదు. ఉదాహరణకు హింస ఏ కారణంగా చేసినా ఎవరు చేసినా తప్పని నమ్మేవాడు. కానీ ఉద్యమాలూ ఉద్యమకారులూ చేసే హింసను ఖండించడానికి నిరాకరించే పౌర హక్కుల సంఘంలో బాధ్యతలు తీసుకొని మరీ పనిచేశాడు.

మానవ హక్కుల వేదిక ఏర్పడిన తరువాత, ఉద్యమకారులు హింసను అన్యాయంగా ప్రయోగిస్తే ఖండిస్తామని అంటే ‘హింసకు న్యాయం అన్యాయం ఏమిటి అసలు హింసే అన్యాయం’ అంటూ అభ్యంతరం తెలిపాడు గానీ మళ్లీ బాధ్యతలు తీసుకొని మరీ పని చేశాడు. పేదలకు పంచడానికి ఇంకా భూములెక్కడున్నాయి అని కమ్యూనిస్టులు సహితం అనుకుంటున్న దశలో తన స్వంత జిల్లా అయిన చిత్తూరులో పేదలకు పంచని, పంచినా అన్యాక్రాంతమైన సీలింగ్‌ భూము ల్ని, భూస్వాములు బోగస్‌ సెటిల్‌ మెంట్‌ పట్టాలు పొందిన ఎస్టేట్‌ భూముల్ని ఎన్ని వేల ఎకరాలున్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీసి భూ సంస్కరణల కార్యాచరణోద్యమం పేరిట దళిత సంఘాలనూ ఇతర ఉద్యమకారులనూ కలుపుకొని కలెక్టర్ల, జాయింట్‌ కలెక్టర్ల వెంటపడ్డాడు. గడచిన అయిదారు సంవత్సరాలలో ఆ జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులెవ్వరూ నరేంద్రనా«థ్‌ను జీవితంలో మరచిపోలేరు. మావోయిస్టులకూ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య చర్చలు విఫలం అయిన తరువాత మావోయిస్టుల సూచన మేరకు ఏర్పడిన భూమి కమిషన్‌లో కూడా చొరవ తీసుకొని పనిచేశాడు.

ఒకటి సత్యమని నమ్మిన తరువాత దానిని ఆచరించకుండ ఉండడం నరేంద్రనాథ్‌కు తెలీదు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిజి చేశాడు కనుక మంచి ఉద్యోగంలో స్థిరపడి అభ్యుదయం గురించి రాస్తూ మాట్లాడుతూ సమాజం మన్ననలు పొంది ఉండవచ్చు. కానీ అది అతని నైజం కాదు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఆ రోజులలో హైదరాబాద్‌లో మతఘర్షణలు తరచుగా జరిగేవి. మతతత్వాన్నీ, మతతత్వ పార్టీలనూ తిడుతూ కూర్చుంటే చాలదనీ పాత బస్తీలో ప్రజలకు కరువయిన పౌర సదుపాయాలు కల్పించడం, వాటికోసం ఆందోళన చేయడం అవసరమనీ నమ్మి ‘హైదరాబాద్‌ ఏక్తా’లో భాగం అయ్యాడు. పాత బస్తీలో ఉచిత క్లినిక్‌ల ఏర్పాటులో నిమగ్నమయి కొంతకాలం పనిచేశాడు.

అయితే తన కార్యరంగం హైదరాబాద్‌ కాదనే నిర్ణయానికి వచ్చాక తన భావాలు చాలావరకు పంచుకునే సహచరి ఉమాశంకరితో కలిసి చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామమయిన వెంకటాపురం వెళ్లిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ సామాజిక అభ్యుదయం కోసం కృషి కొనసాగించాడు. పేదల చేత తాగుడు మాన్పించడం కోసం కృషి చేశాడు. కులాంతర వివాహాలు చేశాడు. ‘రెండు గ్లాసుల’ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఊరూరూ తిరిగి ప్రచారం చేసి చాలా చోట్ల మాన్పించగలిగాడు. ఆ జిల్లాలో దళితులు వోట్లేసి ఎరుగని గ్రామాలు అనేకం ఉన్నాయని తెలుసుకొని దళిత పల్లెలలో ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని పట్టుబట్టి చాలా చోట్ల సాధించాడు. వ్యవసాయాన్ని నిరాదరణ ద్వారా, తప్పుడు అభివృద్ధి విధానాల ద్వారా ధ్వంసం చేసిన పాలకనీతికి ఒక మెట్ట ప్రాంతపు రైతుగా స్పందించాడు.

అన్ని విషయాలలో లాగ ఈ విషయంలో కూడ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే చాలదనీ మనం చేసేది చేయాలనీ నమ్మాడు. రసాయన ఎరువులు, మందులు వాడకుండ వ్యవసాయం చేసే ప్రయోగాన్ని తన భూమిలోనే చేశాడు. గ్రామంలో ఒక రైతు మాత్రమే ఈ ప్రయోగం చేస్తే అందులో ఎన్ని కష్టాలున్నాయో ఆచరణాత్మకంగా గ్రహించాడు. నిరాశ చెందాడుగానీ నిస్ప­ృహలో సహితం తనను గురించి తాను చమత్కరించే నైజం ఉన్న వ్యక్తి కాబట్టి డీలాపడిపోలేదు. ‘ఇట్లు ఒక రైతు’ అనే శీర్షికతో తన అనుభవాన్ని పుస్తకంగా ప్రచురించాడు.

ఒక దశాబ్దం కింద విద్యుత్‌ రంగ సంస్కరణలు ప్రారంభమయిననాటినుంచి వాటికొక వినియోగదారుడైన రైతుగానూ, ఉద్యమకారుడిగానూ నరేంద్రనాథ్‌ స్పందించాడు. వాటి లోతుపాతులు బాగా అధ్యయనం చేసి పదిమందికీ వివరించి చెప్పాడు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ప్రతీ సంవత్సరం నిర్వహించే టారిఫ్‌ విచారణలకు సవివరమయిన విమర్శతోనూ ప్రతిపాదనలతోనూ హాజరయ్యేవాడు. తన మిత్రులకు తర్ఫీదు ఇచ్చి వారిని బతిమాలి బామాలి హాజరయ్యేట్టు చూసేవాడు.

ప్రాజెక్టు నిర్వాసితుల గురించి బాధితుల గురించి, ఇవ్వాళ ఆందోళన చేయడం సాధారణ విషయమయిందిగానీ శ్రీశైలం ప్రాజెక్టునాడే దిక్కు లేకుండా ఊర్లు ఖాళీ చేసిన ప్రజల గురించి సమాచారం సేకరించాడు, చర్చ పెట్టాడు. ఏ సమస్య నయినా ప్రజలతో చర్చ పెట్టడమే ఇష్టపడేవాడు. పట్టణాలలో జరిగే సభల కంటే గ్రామాలలో తిరిగే పాదయాత్రలనే ఎక్కువ ఇష్టపడేవాడు. మెదడు క్యాన్సర్‌ సెకండరీస్‌ ఏర్పడ్డాయని తెలిసిన తరువాత కూడ సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కరీంనగర్‌ జిల్లాలో జరిగిన పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.

నరేంద్రనాథ్‌ ఇన్ని పనులనూ చేయడమే కాక అన్ని పనులూ నవ్వుతూ చేసేవాడు. పసిపిల్లవాడి నవ్వు అతని ముద్ర. చర్చలయినా నవ్వుతూనే పెట్టేవాడు. సంస్థాగత సమావేశాలకు నరేంద్రనాథ్‌ హాజరవుతున్నాడంటే ఏదో ఒక చర్చ పెట్టడానికే అని అందరికీ తెలుసు. నిరంతరం వాదించేవాడు కాని ఎదుటివారిని ఎప్పుడూ కించపరిచే వాడుకాదు. ఎదుటివారిని గాయపరచడమే వాదనలో విజయం అని భావించేవారు మనకు ఉద్యమాలలో, ఉద్యమ సంస్థలలో చాలామంది కనిపిస్తారు. తేడాలు రాగానే సంస్థలు చీలిపోవడానికి ఇదొక ముఖ్యకారణం.

నరేంద్రనాథ్‌ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఉద్యమాలలోనే కాదు, సామాజిక సంఘర్షణలోనూ అంతే. అతను అన్యాయాన్ని ద్వేషించాడు గానీ ఏ మనిషినీ ద్వేషించలేదు. బహుశా అతను గాంధియిజం అని అర్థం చేసుకున్నది ఇదేననుకుంటాను. దీనిని గాంధీ ఎంతగా ఆచరించారో తెలీదుగానీ నరేంద్రనాథ్‌ మాత్రం మనస్ఫూర్తిగా ఆచరించాడు. మనిషిగా మంచితనాన్ని ఏ మాత్రం కోల్పోకుండా న్యాయం కోసం జరిగే సంఘర్షణలో భాగస్వాములు కావచ్చునని రుజువు చేశాడు.

చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించేటప్పుడు ‘అసాధారణమైన మనిషి’ అనడం పరిపాటి. అయితే నిజమైన అర్థంలో అసాధారణమైన మనుషులుప్రపంచంలో కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందిలో ఒకడు గొర్రెపాటి నరేంద్ర నాథ్‌. అటువంటి వ్యక్తిని 57 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్‌ రోగం ఈ లోకానికి దూరం చేయడం నిజంగా చాలా బాధాకరం.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070