Saturday, October 31, 2009

శుకమహర్షి - మన పురాణ ఋషులు

శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

జన్మరహస్యము:

ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ,ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది.అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను.కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు.పరమశివుడు మొదట నంది ని,ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు.అక్కడినుండి పంచభూతములను,గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు.పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు.కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను వింది.ఈ విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి మరణం వచ్చునట్లు శపించాడు.కాని మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు.ఆ చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి.అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది.

పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు.అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు.జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి.ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది.విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు.శుకుడు అతనివద్దకు బయలుదేరాడు.జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు.శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు.ఈ విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు.శుకుడు ఏ మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు.మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు.రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి.కానీ శుకుడు ఏ విధంగానూ చలింపలేదు.అప్పుడు జనకుడు శుకుడికి ఒక అంచులవరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు.కాని శుకుడు ఏ మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు.అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు,నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు.కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు.శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.

ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు.ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు.అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను.నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.వెదవ్యాసుదు వచ్చి ఓ కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి.అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు.కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు.వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు.దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు.వారి నవయవ్వనం లోఉన్న,దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు.వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు.ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" ఓ అమ్మాయిలారా!మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు.కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు.ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు"మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు,ఎలాంటి బందాలు లేనివాడు.కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు.అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది.మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.

ఇదీ శుకమహర్షి చరిత్ర.

శుకుడి విశేషాలు:

1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షి గారే.
2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " ఓ దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు,నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు.వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.
3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షిగారే.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070