Saturday, October 31, 2009

నచికేతుడు (మన పురాణవ్యక్తులు)

"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసేవాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి.నేను ఈ ప్రపంచాన్న ఉర్రూతలూగిస్తాను" అన్నాడు స్వామివివేకానంద.

ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు?అతని గొప్పతనం ఏమిటి?

కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు(ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక యాగం చేయ సంకల్పించాడు.ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి.కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను,గొడ్డులను,ముసలి ఆవులను దానం చేయసాగాడు.ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా!నేనూ నీకు గల సంపదనే కదా.మరి నన్ను కూడా దానం చెయ్యి"అన్నాడు.దీన్ని ఒక బాల్యచేష్ట గా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు.కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను"అని అన్నాడు.(ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు.అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా!ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్యదోషం వస్తుంది.మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి."అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు.నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రొజులు నిరాహారంగా ఉన్నాడు.యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథి ని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను.అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా!మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి(ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి).మరియు అతని పాపాలన్నీ పోవాలి.

రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని,దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు.యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు.

ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి మరియు బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు.యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన,వస్తు,కనక,వాహన,కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు.కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.

తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070