సత్య
మన పరీక్షలు చాలావరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే! అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. 'ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు' అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని శాస్త్రీయమైన సూత్రాలు సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది.
చదివిన విషయాలను తేలిగ్గా మర్చిపోవటం వల్ల ఈ పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సివస్తుంది. జ్ఞాపకశక్తి లోపానికి కింది మూడిటిలో ఏదో ఒకటి కారణం కావచ్చు.
* సమాచారాన్ని స్పష్టంగా మనసుపై ముద్రించకపోవటం
* మనసుపై ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచకపోవడం
* ఆ భద్రపరిచిన సమాచారాన్ని సరిగ్గా వెలికితీయలేకపోవటం
సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించడం (Registration ),జాగ్రత్తగా భద్రపరచడం (Retention), సరిగ్గా వెలికితీయడం (Retrieval) అనే మూడు దశలను సమర్థంగా అమలు చేయడమే జ్ఞాపకశక్తి. ఈ మూడు కార్యక్రమాలూ వేర్వేరుగా కాక సమన్వయపూర్వకంగా పనిచేసినపుడు (3Rformula)అద్భుత జ్ఞాపకశక్తి అలవడుతుంది.
దీని అమలుకు ముందు జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవటం అవసరం.
ఒకే రకం మెదడు
జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధావికైనా, సామాన్యుడికైనా ఉండే మెదడు 1450 గ్రాములే. బూడిద రంగులో ఉండే ఇది శరీర బరువులో 2 శాతమే ఉన్నా మనలోని 20 శాతం శక్తిని వినియోగించుకుంటుంది. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ ఆధారపడివుంటుంది. కాబట్టి మందమతులుగా భావించుకునే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎంతో అవకాశముంది.
మూడిటి సంయోగం
మనిషికి ఉండేది మూడు మెదళ్ళ సంయోగమని శాస్త్రీయంగా నిరూపించాడు పాల్ మెక్‌లియన్. వీటికి రెప్టీలియన్, లింబిక్, కార్టికల్ అని పేర్లు పెట్టాడు.
* రెప్టీలియన్ మెదడు ఒత్తిడి కలిగిస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే జ్ఞాపకశక్తి సరిగా పనిచేయదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
* లింబిక్ మెదడు భావోద్వేగాలకు పుట్టిల్లు. జ్ఞాపకశక్తి మీద భావోద్వేగాల ప్రభావం అధికం. సంతోషకరమైన విషయాలూ, విషాదకర సంఘటనలూ ఎక్కువకాలం గుర్తుండిపోవటానికి కారణమిదే. కాబట్టి దీర్ఘకాల స్మృతిలో సమాచారాన్ని దాచుకోవాలనుకునేవారు ఉద్వేగాలను సమర్థంగా వాడుకోవాలి.
* ఇక అతి ముఖ్యమైంది కార్టికల్ మెదడు. మన మెదడులో అరవైశాతమున్న ఈ మెదడుకు నాలుగు ప్రత్యేకతలున్నాయి. వాటినే స్టీవెన్ ఆర్. కవీ నాలుగు ప్రకృతి వరప్రసాదాలు (four endowmentsఅంటాడు. అవి స్వీయ అవగాహన శక్తి (Self Awareness),వూహాశక్తి (Imagination) , విచక్షణ శక్తి (Conscience), ఇచ్ఛాశక్తి (Independent Will).ఈ నాలుగూ జ్ఞాపకశక్తికి మూలస్తంభాలు. వీటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకునే విద్యార్థులు అత్యుత్తమ స్థాయికి చేరతారు.
ఎక్కువ చదివితే పిచ్చెక్కదా?
చిన్నగా కనిపించే మన మెదడు కోట్లాది నాడీకణాలతో నిర్మితమైంది. ఒక వ్యక్తి మెదడులో లక్ష కోట్ల నాడీ కణాలు ఉంటాయని అంచనా. అంటే నాడీకణం ఎంత చిన్నగా ఉంటుందో ఊహించుకోండి. అంత సూక్ష్మ నాడీకణం సైతం ఎంతో శక్తిమంతమైందే. ఒక కంప్యూటర్‌కు ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి నాడీకణంలో ఉంటుంది. దీన్ని బట్టి మొత్తం మన మెదడు ఎంత శక్తిమంతమైందో, ఎంత అమూల్యమైందో అర్థమవుతుంది.
నాడీ కణాలు ఏవీ విడిగా ఉండవు. ఒకదానితో మరొకటి 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి. పెద్ద టెలిఫోన్ ఎక్స్చేంజిలో వైర్ల నెట్‌వర్క్ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి, విశ్లేషించగలుగుతుంది.
చాలామందికి ఎక్కువ చదివితే పిచ్చెక్కుతుందనే అపోహ ఉంది. నిజానికి ఎంత ఎక్కువ సమాచారాన్ని మనం అందిస్తే అంత శక్తిమంతంగా మెదడు పనిచేస్తుంది. దానివల్ల కొత్త నాడీకణ మార్గాలు ఏర్పడతాయి. అవి జ్ఞాపకశక్తిని అధికం చేస్తాయి. కాబట్టి నాడీకణాల మాయాజాలాన్ని తెలుసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
గుర్తుండిపోవాలంటే...
* మన మెదడు హార్డ్‌వేర్ అయితే దానికి ఉండే మైండ్‌పవర్ సాఫ్ట్‌వేర్. మాగ్నటిక్ పవర్ వల్లే మనం మాట్లాడేది రికార్డవుతుంది. అలాగే మనం చదివే సమాచారం మెదడులో ఉండటానికి మైండ్‌పవరే కారణం. కాబట్టి ఈ పవర్‌ను తెలుసుకుంటే జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసుకోవచ్చు.
* మైండ్‌నే మనసు అంటాం. ఇది చేతన (10 శాతం), అంతశ్చేతన (90 శాతం) అని రెండుగా ఉంటుందని మానసిక నిపుణులంటారు. పెన్‌ఫీల్డ్ అనే సైకాలజిస్ట్ పరిశోధన ప్రకారం పంచేంద్రియాల నుంచి సేకరించిన ఏ విషయాన్ని అయినా మనసు రికార్డు చేస్తుంది. దాన్ని మనం వాడకపోతే అంతశ్చేతనలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకశక్తిని అభివృద్ధి పరచుకోవాలంటే అంతశ్చేతన మనసును ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి.
* మనసు నాలుగు స్థితుల్లో ఉంటుంది. ఒక్కో స్థితిలో ఒక్కో తరంగ విధానాన్ని కలిగివుంటుంది. జ్ఞాపకశక్తి పైన ఈ తరంగ విధానం ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఉత్తమమైన తరంగ స్థితి ఆల్ఫా (Alfa). తెల్లవారుజామున మనసు ఆహ్లాదంగా ఉండటానికీ, చదివింది తలకెక్కడానికీ కారణం ఈ ఆల్ఫా స్థితే. అందువల్ల ప్రశాంత వాతావరణంలో నిర్మల స్థితిలో మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
శిక్షణతో సాధ్యమే
జ్ఞాపకశక్తి కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కే వరం కాదు. అదొక నైపుణ్యం. సాధన చేస్తే ఎవరైనా దాన్ని అలవర్చుకోవచ్చు. ''మంచి జ్ఞాపకశక్తి, చెడ్డ జ్ఞాపకశక్తి అనేవి నిజానికి లేనేలేవు. ఉన్నదల్లా తర్ఫీదు పొందినదీ (Trained Memory), తర్ఫీదు పొందనిదీ (Untrained Memory) '' అంటాడు జ్ఞాపకశక్తి మీద విశేష పరిశోధన చేసిన హేరీ లొరేనీ.
''సగటు మనిషి తన మేధాశక్తిలో కేవలం పది శాతం వినియోగించుకుంటాడు. మిగతా 90 శాతం నిరుపయోగం కావడానికి జ్ఞాపకశక్తి సూత్రాలను ఉల్లంఘించడమే'' అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్టు కార్ల్ సీషోర్. మాయలూ, మంత్రాల మీద కాకుండా ప్రకృతి సూత్రాలమీద ఆధారపడి పనిచేస్తుంది జ్ఞాపకశక్తి. Registration, Retention, Retrieval అనే మూడు దశలూ ప్రకృతి సూత్రాలమీదే ఆధారపడి పనిచేస్తాయి.
_____________________________________________
పడిన ముద్ర చెరిగిపోదు!
చాలామంది విద్యార్థులు ఏకబిగిన పుస్తకం చదవాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే బాగా గుర్తుంటుందని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చి చదివితేనే విషయాలు బాగా గుర్తుంటాయి. శాస్త్రీయంగా నిరూపితమైన సత్యమిది! సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించటం (రిజిస్ట్రేషన్ )జ్ఞాపకశక్తికి తొలి దశ. చదివిన విషయాన్ని ఎంత స్పష్టంగా నమోదు చేస్తే అంత విపులంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చాలా మార్గాలున్నాయి. ప్రధానమైనవాటిని పరిశీలిద్దాం.
ఏకాగ్రత
నాలుక మీద కదలాడుతోంది కానీ బయటకు రావటం లేదంటూ చాలామంది చికాకుపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం- విషయాన్ని ఏకాగ్రతతో నమోదు చేయకపోవటమే. ఇతర పనుల మీద మనసు మళ్ళకుండా... చేసే పని మీద శ్రద్ధ పెట్టడమే ఏకాగ్రత. ఇది కుదరాలంటే ఆకలి, అలసట, ఒత్తిడి వంటి పరిస్థితులుండకూదు. శబ్దాలు, కాలుష్యం, ఆకర్షణలకు దూరంగా ఉండాలి.
పరిశీలన
పొగమంచులో ఫోటో తీస్తే బొమ్మ సరిగా రాదు. సమాచారం స్పష్టంగా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సమాచారాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి స్పష్టంగా అర్థం చేసుకుంటేనే మెదడు మీద ముద్రపడుతుంది.
జ్ఞానేంద్రియాల వినియోగం
కొందరు విద్యార్థులు కేవలం చదవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కొందరు వినడానికీ, కొందరు చూడడానికీ, కొందరు చెప్పడానికీ, కొందరు చేయడానికీ ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల సమాచారం పూర్తిగా నమోదు కాదు. చదవడం వల్ల 20శాతం, వినడం వల్ల 30 శాతం, చూడడం వల్ల 40 శాతం, దాన్ని తిరిగి చెప్పటం వల్ల 50 శాతం, చేయడం వల్ల 60 శాతం గుర్తుంటాయని పరిశోధకులు అంటారు. అలా కాక, చదవడం, వినడం, చూడడం, చెప్పడం, చేయడం అనేవాటికి సహకరించే పంచేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే 90 శాతానికి మించి విషయం నమోదవుతుంది.
చిత్రాల కల్పన
చాలామంది పరాకు పడడానికి కారణం- వారు పదాలను గుర్తుపెట్టుకోవాలనుకోవడమే. మన మెదడు అక్షరాలను గుర్తుపెట్టుకోదు. చిత్రాలనే గుర్తుపెట్టుకుంటుంది. చిత్రాలలోనే ఆలోచిస్తుంది. ఈ చిత్రాలు బొమ్మల రూపంలో ఉండొచ్చు. ఆకృతులు (images)కావొచ్చు, గ్రాఫులు కావొచ్చు. రేఖాచిత్రాలూ, మైండ్ మ్యాపులైనా కావొచ్చు. అందువల్ల అక్షరబద్ధంగా ఉండే సమాచారాన్ని చిత్రబద్ధంగా చేయగలిగితే మెదడు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుంది. అక్షరాలను చిత్రాలుగా మలచుకుని ముద్రించడమే జ్ఞాపకశక్తి అసలు రహస్యం.
రంగుల లోకం
తెలుపు నలుపు చిత్రాలను మెదడు గుర్తుపెట్టుకోదు. రంగు రంగుల చిత్రాలనే అది గుర్తుపెట్టుకుంటుంది. కారణం కుడివలయంలోని మెదడు రంగులను ఇష్టపడుతుంది. కాబట్టి అక్షరబద్ధంగా ఉండే నోట్సును వర్ణచిత్రాల్లోకి మారిస్తే అచ్చు గుద్దినట్టు గుర్తుంటుంది.
లయాత్మకత
చిన్ననాటి చిట్టిపొట్టి పాటలూ, వేమన-సుమతీ శతక పద్యాలూ మనకు గుర్తుండిపోవటానికి కారణం వాటిల్లో ఉండే లయాత్మకతే. అందుకే వేదాలను శ్లోకబద్ధం చేశారు. కావ్యాలను పద్యమయం చేసి, యతిప్రాసలు ఏర్పరిచి లయను కూర్చారు. అందువల్ల గుర్తుంచుకోదగ్గ అంశాలూ, ఫార్ములాలను లయాత్మకంగా మార్చుకోవాలి.
భావోద్వేగాల బాసట
అక్షరాలను చిత్రాలుగా మార్చటం, చిత్రాలను రంగులతో అలంకరించడం, లయాత్మకత జోడించటమే కాకుండా భావోద్వేగాలతో రంగరించాలి. ప్రేమ, భయం, హాస్యం, కోపం, శాంతం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న చిత్రాలు బలంగా గుర్తుంటాయి.
వూహా ప్రాగల్భ్యం
విజ్ఞానం కంటే ఊహాశక్తి గొప్పదంటాడు ఐన్‌స్టెయిన్. మనం నమోదు చేయదల్చిన విషయానికి ఊహాశక్తిని జోడించాలి. మన అనుభవాల్లో రంగరింపజేసుకోవాలి. ఓ గులాబిపువ్వును ఊహించుకోవటమే కాకుండా దానికి రంగు, రుచి, వాసన కల్పించుకోవాలి. అప్పుడే అది శాశ్వతంగా ముద్రితమవుతుంది.
అనూహ్యత
అసాధారణ విషయాలే అబ్బురపరుస్తాయి. వాటినే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. అందువల్ల సాధారణ విషయాలను అనూహ్యంగా మార్చాలి. హాస్యాన్ని జోడించినా, హాస్యాస్పదంగా మార్చేసినా, వింతలూ విడ్డూరాలు జత చేసినా, విపరీతమైన పరిమాణంలో ఊహించుకున్నా అవి మన జ్ఞప్తిలో శాశ్వతంగా ఉంటాయి.
సంపూర్ణత్వం
విడిగా ఉండే సమాచారం కన్నా సంపూర్ణత్వంలో ఉండే సమాచారాన్నే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. శరీరంలో వివిధ అవయవాలకు ప్రత్యేక స్థానం ఉన్నట్టుగానే విషయంలోని ప్రతి అంశానికీ ఓ ప్రత్యేకస్థలం, స్థానం ఉంటుంది. అందువల్ల మనం మెదడులో ముద్రించే సమాచారం విషయం మొత్తంలో ఏ భాగానికి చెందిందో, అందులో దాని ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుంటే గుర్తుంచుకోవటం సులువు.
కథా రూపం
పిల్లలకూ, పెద్దలకూ కూడా కథలంటే చాలా ఆసక్తి. మనం నేర్చుకోబోయే ఏ విషయాన్నయినా- అది సాంకేతిక సమాచారమే అయినా ఓ కథలా అల్లుకుని మనసులో ముద్రించుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కొత్త పదాలు నేర్చుకోవాలనుకునేవారు ఆ పదాలతో ఓ చక్కని కథ అల్లుకుంటే గుర్తుపెట్టుకోవడం తేలిక అంటాడు- ఆంగ్లభాషను ఆసక్తికరంగా మలచిన హేరీ షెప్టర్. కథలో ఉత్సుకత ఉంటుంది. ఉత్సుకత జ్ఞాపకశక్తికి పెట్టుబడి లాంటిది.
ప్రాథమ్య సూత్రం
మనం చదివినదాంట్లో తుదీ మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. దీన్నే ప్రాథమ్య సూత్రం అంటారు. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వస్తాయి. అందువల్ల చదివినదానిలో అతి తక్కువ మాత్రమే మనసులో నమోదు అవుతుంది.
చదివే రెండు గంటల కాలంలో నాలుగు వ్యవధానాలు ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు, 4 తుది ఘటనలు ఏర్పడతాయి. అందువల్ల చదివినదానిలో ఎక్కువ నమోదు కావడానికీ, గుర్తుండటానికీ వీలవుతుంది.
తాజాదన సూత్రం
ఎప్పుడో చదివి వదిలేవాటికన్నా ఇటీవల చదివినవాటినే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. 1993లో, 2008లో ముంబాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయి. 93లో వేలమంది చనిపోయారు. నగరమంతా అల్లర్లు చెలరేగాయి. 2008లో పరిమిత ప్రాంతంలోనే అల్లర్లు జరిగాయి. మృతుల సంఖ్యా తక్కువే. అయినా 93 ఘటన కన్నా 08 నాటి సంఘటనే బలీయంగా గుర్తుండటానికి కారణం తాజాదన సూత్రమే. విద్యార్థులు కూడా పరీక్షరోజు ఉదయాన్నే ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఓసారి చూసుకుంటే బాగా గుర్తుపెట్టుకొని రాయవచ్చు.
సబ్లిమినల్ ప్రక్రియ
పైన చూసిన అంశాలన్నీ ప్రయత్నపూర్వకంగా మన మనసు మీద సమాచారాన్ని ఎలా ముద్రించుకోవాలో తెలియజేస్తున్నాయి. అయితే స్వప్రయత్నం లేకుండా కూడా జ్ఞాపకశక్తిలోకి సమాచారాన్ని పంపవచ్చు. అదే సబ్లిమినల్ ప్రక్రియ. ప్రకటన సంస్థలు ఈ కళను వినియోగించుకొని లాభాలు ఆర్జిస్తుంటాయి. అలసటగా ఉండి ఓ షాపులోకి వెళ్ళిన వ్యక్తి కొద్దిపేపట్లోనే సేదతీరి అనేక వస్తువులు కొనటానికి కారణం ఆ షాపులో మంద్రస్థాయిలో వినపడే ఆహ్లాదకరమైన సంగీతమే. అది అలసటను తీర్చటమే కాకుండా అతడు కొనటానికి సుముఖుడు కావటానికి కొన్ని సంకేతభావాలు పంపిస్తుంది. విద్యార్థులు ఆల్ఫా సంగీతాన్ని జోడిస్తూ క్లిష్టమైన విషయాలు చదివితే అవి స్పష్టంగా మనసులో నమోదవుతాయి.
_________________________________
మనం చదివినదాంట్లో తుదీ మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వచ్చి చదివినదానిలో అతి తక్కువే మనసులో నమోదవుతుంది. అయితే ఆ రెండు గంటల కాలంలో నాలుగు వ్యవధానాలు ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు, 4 తుది ఘటనలు ఏర్పడతాయి. చదివినదానిలో ఎక్కువ నమోదై, గుర్తుండిపోతుంది.
__________________________________________
(ఈనాడు, ౬ & ౧౩ :౦౪:౨౦౦౮)
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న, చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులో పోడుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
No comments:
Post a Comment