Friday, June 26, 2009

కబళించేముందే కళ్లు తెరవాలి..

కబళించేముందే కళ్లు తెరవాలి..

వెలది.. పానంబు.. జూదంబు.. అంటూ తిక్కన సప్తవ్యసనాల జాబితాను ఓ పద్యంలో వెల్లడించాడు. స్త్రీ, పానం, జూదం, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, దుర్వ్యయం.... అంటూ వాటిని ఓ రచయిత వచనంలోకి దించారు. మద్యపానంకన్నా ధూమపానం మరీ ప్రమాదకరమైనదని శాస్త్రజ్ఞులు గట్టిగా తేల్చి చెబుతున్నారు. అందువల్ల మనం సప్తవ్యసనాల్లో పానాన్ని- ధూమపానానికి అన్వయించుకోవలసి ఉంది. ప్రాణాంతకమైన ధూమపాన వ్యసనం ప్రజల్లో బహుళవ్యాప్తికి నోచుకోవడం సామాజిక శాస్త్రవేత్తలను తీవ్రంగా కలవరపరుస్తోంది. యువతలో ఈ అలవాటు త్వరగా వ్యాపించడానికి సావాసదోషమే బలమైన కారణమంటున్నారు. సరదాగా మొదలై అలవాటుగా మారి, అది వ్యసనంగా స్థిరపడుతుంది. సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటివాణ్ని చేస్తానన్న గిరీశం అయ్యవారినుంచి తనకు అబ్బిందల్లా చుట్టకాల్చే అలవాటు ఒక్కటేనని- వెంకటేశం వాపోవడంలో వాస్తవముంది. సిగరెట్లు వెలిగించడమే తప్ప అగరొత్తులు వెలిగించడం రాని తండ్రినుంచి కొడుక్కి ఏం అలవాటు అవుతుందో మనం తేలిగ్గానే ఊహించవచ్చు. తెలుగు పద్యం ఒకటి చెప్పమని కరటకశాస్త్రి అడగ్గానే వెంకటేశం నోట అలవోకగా 'పొగచుట్టకు... సతిమోవికి' పద్యం వెలువడటం సావాసదోషఫలమనే అనుకోవాలి. ''చుట్టకాల్చబట్టే కదా దొరలు అంత గొప్పవాళ్ళయ్యారు! చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ని చూశావూ?'' అని ఊదరగొడుతుంటే వెంకటేశానికి చుట్టకాల్చడంతప్ప, మరి చదువెలా అబ్బుతుంది! చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగైరాలను ఇంగ్లీషువాడు కనిపెట్టగలిగాడన్నది గిరీశం సిద్ధాంతం. చుట్టకాల్చడానికి, దొరతనానికి ఏదో 'చుట్ట'రికం ఉండే ఉంటుందని మనకవులు కూడా భావించారు. సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరలు తాగు బల్‌ సిగరెట్టు.. అంటూ దాని మహిమను వర్ణించాడో సినీకవి. పొగతాగనివాడు తరవాత జన్మలో ఏమవుతాడో 'బృహన్నారదీయం' చెప్పింది- అని గిరీశం దబాయించాడు. ''...ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడు...'' అని సినీకవి బుకాయించాడు.

మొన్ననే క్యూబా అధ్యక్ష పదవిని త్యజించిన ఫిడెల్‌ క్యాస్ట్రోకి, అమెరికానే వణికించిన సద్దాం హుస్సేన్‌కీ -క్యూబా చుట్టలే ఒకానొక గంభీరమైన ఇమేజిని తెచ్చాయంటారు. ''స్వర్గంలో కనుక సిగార్‌పై నిషేధం విధించే పక్షంలో నేనసలు స్వర్గం వైపే పోను'' అన్నాడు మార్క్‌ట్వెయిన్‌. ''ఇంత చవగ్గా దొరికే ఆనందం ప్రపంచంలో మరొకటి ఏముంది?'' అని ప్రశ్నించాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. ''అందమైన స్త్రీ ఇచ్చే ఆనందంతో పోలిస్తే సిగార్‌ తక్కువేంకాదు'' అన్నాడు ప్రముఖ రచయిత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌. మడొన్నా, డెమీమూర్‌, ఎవావన్నెస్సా, రెబెక్కా... వంటి ప్రపంచ ప్రసిద్ధ సుందరీమణులు సైతం సిగార్స్‌ను బాగా ఇష్టపడేవారే. ప్రసిద్ధ కథారచయిత చాసో నుంచి బ్రిటన్‌ మాజీ ప్రధాని చర్చిల్‌దాకా ప్రముఖులెందరో చుట్టలను ప్రేమించేవారు. నోట్లో చుట్టతో ఫొటోలు దిగేవారు. పొగతాగడం అలవాటైనవారు దాన్ని రకరకాలుగా సమర్థించడం కూడా సహజం. వేడివేడిగా కాఫీతాగాకా, సిగరెట్టు ముట్టించకపోతే కాలకృత్యాలు మొదలుకావని చాలామంది అనుభవం. సిగరెట్టు చేతిలో లేకపోతే, రెండో చేతిలో కలం కదలదని భావించే రచయితలూ ఉన్నారు. అలాంటి కవి ఒకరు తన అలవాటును త్రిమూర్తులకు సైతం అంటగట్టారు. త్రిమూర్తులు పొగతాగడం చూసి నారదమహర్షి ఆశ్చర్యపోయి ''మీరును పొగతాగుదురా! వారిజభవ.. ఆదిదేవ.. వైకుంఠపతీ..'' అని అడిగాడట. దానికి వారు బదులిస్తూ ''ఓరీ నారద.. వినరా.. ఈరేడు జగంబులందున ఇది ముఖ్యమురా!'' అన్నారని ఆయన అచ్చుగుద్ది మరీ చెప్పాడు. ఒకే సిగరెట్టును నలుగురైదుగురు మిత్రులు నిస్సంకోచంగా పీల్చేయడంలో తప్పులేదు, అది ఎంగిలి కాదన్నాడొక కవి. ''పొగక్రోవికి.. సతిమోవికి.. అగణితముగ సూరకవికి.. అమృతమ్మునకున్‌ తగ ఉచ్ఛిష్టము లేదు..'' పొమ్మన్నాడాయన. ఏ మాటకామాటే చెప్పుకోవాలి- నోట్లో ఎర్రగా వెలుగుతుంటే దర్జాకి కారణమయ్యే చుట్ట, ఆరిపోయి చెవి వెనుక చేరితే మాత్రం వెర్రిబాగులతనానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుంది.

ఎంతమంది ఎంతగట్టిగా వాదించినా, పొగతాగడాన్ని డాక్టర్లు ఎంతమాత్రమూ సమర్థించడం లేదు. చుట్ట, బీడీ, సిగరెట్టు... ఏదైనా యమపాశమేనని అధ్యయనాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. పొగతాగేవాళ్లలో స్త్రీలైతే దాదాపుగా ఎనిమిదేళ్లు, మగవారు పదేళ్లు ఆయుర్దాయాన్ని కోల్పోతున్నారని తేలింది. 2010 సంవత్సరం వచ్చేసరికి ప్రతిఏటా పదిలక్షల మందిని ధూమపానం ఖాయంగా బలిగొంటుందని స్పష్టమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సహకారంతో టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రపంచ ఆరోగ్య అధ్యయన కేంద్రం ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించింది. విషాదకరమైన ఆ ఫలితాలను ప్రకటించిన ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా మనదేశంలో అవి మరింత దిగ్భ్రాంతిని కలిగించేవిగా వర్ణించారు. రెండేళ్ల తర్వాత భారతదేశంలో సంభవించే అకాలమరణాల్లో సగం సంఖ్యకు కేవలం ధూమపానం కారణమవుతుందని ఝా భావిస్తున్నారు. క్షయ, శ్వాసకోశవ్యాధులు, కేన్సర్‌తోపాటు పలురకాల గుండెజబ్బులకు సైతం పొగతాగడమే కారణమవుతుందని, ఆ కారణంగా మిగిలిన దేశాలకన్నా, మన దేశంలో మరణాల సంఖ్య అత్యధికమనీ ఆయన విశ్లేషించారు. సకాలంలో దాన్ని నివారించకపోతే తీవ్ర దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. 'కబళించేముందే కళ్లు తెరవండి' అనే నినాదంతో ఉద్యమస్ఫూర్తితో ప్రజలు స్వయంగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొంటే తప్ప- ముంచుకొస్తున్న మృత్యుపాశాన్ని తిప్పికొట్టడం సాధ్యంకాదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించడంకన్నా ఎవరికివారే ఈ పెనుముప్పును అర్థం చేసుకుని, వ్యసనాన్ని అలవాటు స్థాయిలోనే అరికట్టే ప్రయత్నం చెయ్యడం మంచిదని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
(Enadu, 24:02:2008)

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070