Friday, June 26, 2009

మంచి నోట్సు... మార్కుల గని


సత్య
స్వయంగా నోట్సు రాసుకునేవారు ఉత్తమ విద్యార్థుల కోవలోకి వస్తారు. అసలు నోట్సు జోలికే పోనివారు సగటు విద్యార్థులని ఇట్టే అంచనాకు వచ్చెయ్యవచ్చు. నోట్సు రాసుకునేవారిలో కూడా 95 శాతం విద్యార్థులు పాటించేది- సంప్రదాయ బద్ధమైన 'లీనియర్‌ నోట్సు'. దీని ప్రయోజనాలు పరిమితమే!

సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి ఉన్నతశ్రేణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇతరుల విజయ రహస్యాన్ని ఆరా తీస్తుంటారు. తాము ఎన్నిసార్లు రాసినా విజయం వరించదేమని పోటీపరీక్షలు రాసిన కొందరు సందేహం వెలిబుచ్చుతుంటారు. అలాంటివారిని 'మీ నోట్సు ఓసారి చూపించ'మని అడిగితే 'నేను నోట్సు రాసుకోను. పుస్తకాలు చదివి నేరుగా పరీక్షలు రాస్తాను' అంటారు.ఇలాంటివారికి తక్కువ మార్కులు రావడం వింతేమీ కాదు. వీరంతా సగటు విద్యార్థులు. నోట్సు ప్రయోజనం తెలుసుకోని సామాన్యులు. పోటీ పరీక్షల అభ్యర్థులెందరో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అసలు కీలకం ఎవరికి వారు నోట్సు తయారుచేసుకోవడమే.

ఎందుకు రాసుకోవాలి?
అనేక పాఠ్యాంశాల నుంచీ, ఇతర వనరుల నుంచీ సేకరించిన కీలక పదాలనూ, ముఖ్య భావాలనూ క్రోడీకరించి సంగ్రహంగా, సమగ్రంగా రాసుకునేదే నోట్సు. గుబురుగా పేరుకుపోయిన సమాచారానికి ఓ క్రమానుకృతిని కల్పించి చక్కగా అర్థమయ్యేలా చేస్తుందిది. విషయానికి మనదైన ప్రత్యేకశైలిలో వ్యాఖ్యానం చేస్తుంది నోట్సు. పునశ్చరణకు ఇదెంతో సౌలభ్యం.

* అనేక పుస్తకాలూ, వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఒకచోట చేర్చటం వల్ల మూల గ్రంథాలను పదేపదే చూడాల్సిన బాధ తప్పి, సమయం ఆదా అవుతుంది.
* క్లిష్టమైన భావాలను సులభంగా, సంక్షిప్తీకరించడం వల్ల విషయం అర్థమవుతుంది.
* విశ్లేషణాత్మకంగా విషయాన్ని వివరించడం వల్ల తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి సహకరిస్తుంది నోట్సు.

మన మనసులో ఎంతో విస్తృతమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అది ఉద్దీపనం పొంది వెలికి రావడానికి ప్రేరణ కావాలి. దాన్ని కల్పించే ఉపకరణమే నోట్సు. ఎవరో రాసిన నోట్సుకు అలాంటి ప్రేరణ ఉండదు. స్వయంగా రాసుకున్న నోట్సుకే ఆ శక్తి ఉంటుంది. స్వయంగా రాసుకున్న నోట్సులో మన ముద్ర ఉంటుంది. 'ఒరిజినాలిటీ' ఉంటుంది. ఒరిజినాలిటీ ఉన్న జవాబులకే ఎక్కువ మార్కులు వస్తాయి. అంతే కాక, విషయం పట్ల అవగాహన పెరగాలన్నా, తేలిగ్గా విషయం గుర్తుపెట్టుకోవాలన్నా ఎవరి నోట్సు వారే తయారుచేసుకోవాలి. మనం తయారు చేసుకునే నోట్సు SMART గాఉండాలి.

నిర్దిష్టమైన (Specific) :
విషయం నిర్దిష్టంగా ఉండాలి. అంటే భావాల్లో స్పష్టత ఉండాలి. డొంక తిరుగుడు పనికి రాదు. వ్యర్థమైన విషయాలు లేకుండా విషయ వివరణలో సూటిదనం ఉండాలి.

లెక్కించడానికి (Measurable) వీలుగా :
విషయాన్ని ఎన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నామో, ఎన్ని వర్గాలుగా విభజిస్తున్నామో అవగతం కావాలి.

లక్ష్యసాధన (Achievable) ముఖ్యం :
మార్కులు సాధించే లక్ష్యంతో నోట్సు ఉండాలి. ఉపయోగకరంగా ఉండే విషయాలనే రాసుకోవాలి. సందర్భశుద్ధి విషయానికి ప్రాణం కావాలి.

వాస్తవమైన (Realistic) అంశాలు :
అందంగా ఉన్నాయి కదా అని మనకు అర్థం కాని విషయాలు అందులో చేర్చకూడదు. వాస్తవమైన విషయాలనే రాసుకోవాలి. కవితాత్మకంగా ఉండే పరుల భాషలో కన్నా స్పష్టంగా, హుందాగా ఉండే సొంత భాషలో రాసుకుంటేనే నోట్సు ఉపయోగకరం.

కాలపరిమితిలో (Timeframe) ఒదగాలి:
నోట్సు చాట భారతంలా ఉండకూడదు. ఒడ్డు పొడవుతో పాటు నోట్సుకు కాల కోణం (Time Dimension) ఉండాలి. ఒక టైమ్‌ ఫ్రేమ్‌లో విషయం ఇమిడిపోవాలి. అంటే పది నిమిషాలకో, అర్థగంటకో సరిపడేలా విషయాన్ని తయారుచేసుకోవాలి.

లీనియర్‌ నోట్సు (Linear Notes)
నోట్సు వల్ల ఎన్ని ఉపయోగాలున్నా వాటి నుంచి ఎన్ని సత్ఫలితాలు వస్తున్నా చాలామంది విద్యార్థులు సొంతంగా నోట్సు రాసుకోరు. రాసుకున్నవారిలో కూడా 95 శాతం విద్యార్థులకు నోట్సు ఎలా తయారుచేసుకోవాలో తెలియదంటే అతిశయోక్తి కాదు. వారంతా సంప్రదాయ బద్ధమైన లీనియర్‌ నోట్సునే తయారుచేసుకుంటారు. ఎడమ నుంచి కుడికి వరుసలలో (lines) , వాక్యాల రూపంగా ఉంటుంది కాబట్టి దీనికి linear notes అని పేరు.

సమయం ఆదా అవుతుందా?: లీనియర్‌ నోట్సు వాక్యాల రూపంలో ఉండటం వల్ల కీలక పదాలతో పాటు వాక్యపూరణకు అవసరమయ్యే 80 శాతం వ్యర్థపదాలు ఇందులో చోటు చేసుకుంటాయి. అందువల్ల విలువైన సమయం వ్యర్థమైపోతుంది.

చూసినంతనే అర్థమవుతుందా?: లీనియర్‌ నోట్సు పేరాలు/పాయింట్ల రూపంలో ఉండటం వల్ల మొత్తం చదివితేనే కానీ అసలు విషయం అర్థం కాదు. చూసినంతనే విషయం స్ఫురించదు. తటిల్లతలా మనసులో తళుక్కుమనదు.

గుర్తుపెట్టుకోడానికి వీలవుతుందా?: విడివిడిగా ఉండే పదాలనూ, వాక్యాలనూ మెదడు గుర్తుపెట్టుకోదు. గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞాపకశక్తికి అవసరమయ్యే సూత్రాలు నోట్సులో ఇమిడివుండాలి. లీనియర్‌ నోట్సులో ఈ జ్ఞాపకశక్తి సూత్రాలన్నీ ఇమిడివుండవు.

లీనియర్‌ నోట్సులో ఇలాంటి పరిమితులెన్నో ఉన్నాయి కాబట్టే దాన్ని అనుసరించేవారు తమకు మంచి జ్ఞాపకశక్తి లేదని వాపోతుంటారు. నిజానికి పరిమితి ఉండేది వారి జ్ఞాపకశక్తికి కాదు, వారు రాసుకునే నోట్సుకే!



లీనియర్‌ నోట్సుకుండే పరిమితులు అధిగమించి ఓ చక్కని నోట్సు విధానం ఉంది. 40 ఏళ్ళ క్రితమే 'వాల్టర్‌ పాక్‌' అనే విద్యావేత్త దీన్ని తయారుచేశాడు. విదేశాల్లో విశేష ఆదరణ పొందుతున్న ఆ నోట్సు విధానం ఏమిటో, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!


ఇదీ
... నోట్సు రాసే పద్ధతి!




విషయం తేలిగ్గా అర్థం కావాలి; సమయం ఆదా అవ్వాలి; చదివింది చక్కగా గుర్తుపెట్టుకోవాలి! ఈ 3 పనులనూ సాధ్యం చేసేదే కార్నల్‌ నోట్సు. నోట్సు ఎలా తయారుచేసుకోవాలో చెప్పడమే కాక, దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియజేస్తుందిది.

నలబై ఏళ్ళ క్రితం వాల్టర్‌ పాక్‌ (Walter Pauk) అనే విద్యావేత్త ఓ నోట్సు విధానాన్ని తయారుచేశాడు. దీనికి కార్నల్‌ నోట్సు విధానం/కార్నల్‌ పద్ధతి అని పేరు. అమెరికాలోని కార్నల్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు నోట్సు రాసుకునే విధానాన్ని మెరుగుపరచడం కోసం ఇది రూపొందింది. క్రమేపీ ఈ నోట్సు పద్ధతి అమెరికా అంతటా విస్తరించింది; ఎన్నో దేశాల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందుతోంది.

ఈ పద్ధతిలో నోట్సు రాసుకునే ప్రతి కాగితాన్నీ ముందుగా మూడు భాగాలుగా విభజించాలి.

* పేపర్‌ కింద నుంచి రెండు అంగుళాల పైభాగంలో అడ్డంగా గీత గీయాలి.

* కాగితం ఎడమ భాగంలో రెండున్నర అంగుళాల స్థలాన్ని కేటాయించి, కింద గీసిన సమాంతర గీతకు ఆనుకునేలా నిలువుగా గీత గీయాలి.

* దీనివల్ల మొత్తం పేపర్లో మూడు విభాగాలు ఏర్పడతాయి. 2.5X9అంగుళాల స్థలం ఎడమభాగంలో, 6X9అంగుళాల స్థలం కుడిభాగంలో, 2 అంగుళాల స్థలం కింది భాగంలో వస్తుంది.

* ఈ మూడు భాగాలకూ కార్నల్‌ పద్ధతిలో ప్రత్యేక ప్రయోజనాలున్నాయి.


నోట్సు తయారీలో 6 'ఆర్స్‌'
కార్నల్‌ పద్ధతిలో రాసుకునే నోట్సులో ఆరు మెట్లు ఉంటాయి. ఇవన్నీ ఆంగ్లంలో Rఅక్షరంతో ఆరంభమయ్యే ఆరు పదాలకు చెందిన అంశాలు. అందుకే దీన్ని ఆరు Rsవిధానం అంటారు.

కాగితాన్ని మూడు భాగాలుగా విభజించాక 6X9అంగుళాల కుడిభాగంలో నోట్సు రాసుకోవాలి. ఈ 6 ఆర్స్‌ విధానం అక్కడినుంచే ప్రారంభం అవుతుంది.

1. రికార్డ్‌ (Record):ఉపన్యాసం ప్రారంభమైనప్పుడు లేదా ఓ పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు కావలసిన విషయాన్ని కుడిభాగంలోని జాగాలో రాయడం (రికార్డు చేయడం) ప్రారంభించాలి. ముఖ్యమైన విషయాలనే రాసుకోవాలి. వ్యాకరణం, విరామ చిహ్నాలు వగైరాలు ముఖ్యం కాదు. విషయం అర్థమయ్యేలా ఉంటే చాలు. కాలం ఆదా చేయడానికి మీకు అర్థమయ్యే 'షార్ట్‌ హ్యాండ్‌' ఉపయోగించండి. ఏమైనా, ఓసారి రాత పూర్తయ్యాక చదివితే అర్థమయ్యేలా నోట్సు రాసుకోవాలి.

2. రెడ్యూస్‌ (Reduce):నోట్సు రాయడం పూర్తి అయ్యాక దానిలోని కీలక పదాలను (Key words) /కీలక భావాలను వేరు చేసి వాటిని రెండున్నర అంగుళాలు ఉండే ఎడమవైపు మార్జిన్లో రాసుకోవాలి. ప్రశ్న రూపంలో రాసుకుంటే మరీ మంచిది. మొత్తం సమాచారాన్ని క్షణంలో స్ఫురింపజేసే జ్ఞాపకచిహ్నాలుగా ఇవి పనిచేస్తాయి.
.
3. రీకేప్‌చ్యులేట్‌ (Recaptulate):ఇది 'సారాంశం' అనేదానికి పెద్దపేరు. పేజీలోని మొత్తం విషయ సారాంశాన్ని కాగితం దిగువభాగంలోని రెండు అంగుళాల స్థలంలో రాసుకోవాలి. ప్రతి పేజీలోనూ ఆ విషయానికి సంబంధించిన సారాంశాన్ని రాసుకోవాలి. ప్రతి పేజీలో రాసుకున్న కీలక అంశాల ఆధారంగా మొత్తం నోట్సు సారాంశాన్ని చివరిపేజీలో రాసుకోవాలి. దీనివల్ల ఒకే పేజీలో మొత్తం విషయాన్ని అవగతం చేసుకోవడానికి వీలవుతుంది.

4. రిసైట్‌ (Recite):విషయాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఉపయోగపడే బలమైన ప్రక్రియ- వల్లెవేయడం. అంటే కేవలం తిరిగి చదవడం కాదు; విషయాన్ని మన సొంత మాటల్లో మనకు మనం వివరించుకోవడం. విషయాన్ని పైకి వల్లెవేయడం వల్ల నేర్చుకునే ప్రక్రియ వేగవంతమవుతుంది. సొంత మాటల్లో విషయాన్ని మననం చేయడం వల్ల దానిలోని లోతైన భావం అర్థమవుతుంది. కుడిభాగంలో ఉండే నోట్సునూ, ఎడమభాగంలోని కీలక పదాలనూ ఒకేసారి చూడడం వల్ల మెదడుకు జ్ఞాపకశక్తికవసరమయ్యే అభ్యాసం లభ్యమవుతుంది.

5. రిఫ్లెక్ట్‌ (Reflect):విషయాన్ని వల్లెవేయడమే కాక, దాన్ని లోతుగా అవలోకనం చేసుకోవాలి. నేర్చుకున్న సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా అనువర్తింపజేసుకోవాలో, అదివరకే మనకు తెలిసిన విషయంతో దీన్నెలా అనుసంధానించుకోవాలో ఆలోచించాలి. కొత్తగా నేర్చుకున్న సమాచార ప్రాధాన్యాన్నీ, దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే అదనపు లాభాన్నీ బేరీజు వేసుకోవాలి.

6. రివ్యూ (Review):రాసుకున్న విషయాన్ని తరచూ పునః సమీక్షించుకోవాలి. అంటే తిరిగి చదువుకోవడం కాదు; విషయాన్ని స్పష్టంగా మనవైన మాటల్లో వివరించుకోగలగడం. దానివల్ల విషయం మస్తిష్కంలో నిత్యనూతనంగా ఉంటుంది. అందువల్ల పరీక్షల ముందు బట్టీపట్టే బెడద తప్పిపోతుంది.

నోట్సు ఎలా తయారుచేసుకోవాలో చెప్పడమే కాక, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియజేస్తుంది కాబట్టే కార్నల్‌ నోట్సు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోడానికీ, కాలాన్ని ఆదా చేసుకోవడానికీ, చదివినదాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవడానికీ కార్నల్‌ నోట్సు అద్భుతంగా పనిచేస్తుంది.



కార్నల్‌ నోట్సు విలువైన ఉపకరణం

కార్నల్‌ నోట్సుకు ఓ ఉదాహరణ చూద్దామా? ప్రసిద్ధ పరిశోధక సంస్థ 'గేలప్‌ ఆర్గనైజేషన్‌' విజయ రహస్యం అనేఅంశంపై ఓ సర్వే నిర్వహించింది. దాన్ని కార్నల్‌ నోట్సులో ఎలా రాసుకోవచ్చో పరిశీలిద్దాం.


మిగతా నాలుగు లక్షణాలకు కూడా ఇదే పద్ధతిలో నోట్సు రాసుకొని, చివరిపేజీలో మొత్తం విషయంపై సారాంశాన్ని (summary) తయారు చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న కార్నల్‌ నోట్సు 'లీనియర్‌ నోట్సు' పోలిస్తే వందరెట్లు మేలుతరంగా ఉంటుంది. విద్యార్థులకే కాదు; పెద్దలకు కూడా ఈ నోట్సు విధానం చక్కని ఉపకరణం. ఇలా కార్నల్‌ నోట్సుకు ఎన్నో ఉపయోగాలున్నా, దీనికి కూడా కొన్ని పరిమితులు లేకపోలేదు. కీలక పదాలతో పాటు వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు ఇక్కడా చోటుచేసుకుంటాయి. ఇది చిత్రాల రూపంలో ఉండదు; రంగులతో విషయ వివరణ జరగదు. కాబట్టి జ్ఞాపకశక్తిని పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం తక్కువే.
కార్నల్‌ నోట్సు 'లీనియర్‌ నోట్సు'తో పోలిస్తే వందరెట్లు మేలుతరంగా ఉంటుంది. విద్యార్థులకే కాదు; పెద్దలకు కూడా ఈ నోట్సు విధానం చక్కని ఉపకరణం


విషయాన్ని వల్లెవేయడమే కాక, దాన్ని లోతుగా అవలోకనం చేసుకోవాలి. నేర్చుకున్న సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా అనువర్తింపజేసుకోవాలో, అదివరకే మనకు తెలిసిన విషయంతో దీన్నెలా అనుసంధానించుకోవాలో ఆలోచించాలి. కొత్తగా నేర్చుకున్న సమాచార ప్రాధాన్యాన్నీ, దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే అదనపు లాభాన్నీ బేరీజు వేసుకోవాలి.


సొంత మాటల్లో విషయాన్ని మ

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070