Saturday, November 14, 2009

అంత్యనిష్ఠూరమా ? ఆది నిష్ఠూరమా ?

నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం - ఏ సరికొత్త మానవసంబంధాన్నీ చిఱునవ్వుతో ప్రారంభించకూడదని ! మనం స్వతహాగా మంచివాళ్ళం కాకపోతేనే అది మనకొక అలంకారమౌతుంది. లేకపోతే అది మన బలహీనత అవుతుంది. కనీసం అలా చూడబడుతుంది. అవతలివాళ్ళ మంచీ చెడూ ఏమీ తెలియకుండానే, వాళ్ళు అడక్కుండానే వాళ్ళకి మనం పంచే ఈ మంచితనం, ఈ చిఱునవ్వులూ అడవి గాచిన వెన్నెల్లా దుర్వినియోగం కావచ్చు. అపరిచితులు మననుంచి ఏదైనా దోచుకోవడానికి గల అవకాశాన్ని, మన బలహీనతల్నిమన మంచితనంలో అన్వేషిస్తారు. నిజానికి మన దగ్గఱ అలాంటివేవీ లేకపోయినా అవి ఉన్నాయనే నమ్మకమూ, వాటికోసం ఒక ప్రయత్నం చేసి చూడొచ్చుననే భరోసా వాళ్ళకి కలుగుతాయి.

మానవ నాగరికతలో మనుషులు మేధాశక్తికిచ్చిన ప్రాధాన్యం చాలా గొప్పది. అసలు మేధాశక్తే అన్ని ఇతర మానవీయ లక్షణాలన్నింటినీ త్రోసిరాజని, అదొక్కటే మనిషి లక్షణంగా చెలామణి అవుతున్నది. ఇది ఎంత "అతి"గా పరిణమించిందంటే మేధాశక్తి మఱీయెక్కువ లేనివాళ్ళని, దాన్ని అతివినియోగం/ దుర్వినియోగం చెయ్యడానికి ఇష్టపడనివాళ్ళని సమాజంలో మనుషులుగా చూడ్డమే మానేశారు. వాళ్ళని అలా అమానవీకరించేశారు. అలా అది చివఱికొక అమానుష దృక్కోణంగా రూపుదాల్చింది. మళ్ళీ ఆ మేధాశక్తిలో కూడా ఒక రకం మేధాశక్తికే ఇనుమిక్కిలి ప్రాధాన్యం. ఎలాగంటే - చాలామంది దృష్టిలో మేధాశక్తి అంటే కృత్రిమత్వాల్ని అన్వేషించే లక్షణం మాత్రమే. అందుచేత కృత్రిమత్వాలు లేని ఒక మంచిమనిషి ఈ సమాజంలో ఫక్తు బుద్ధిహీనుడుగానే జమ. మన దృష్టిలో బుద్ధిహీనులకి భూమండలం మీద బతికే హక్కు లేదు. వాళ్ళు మన దయకీ, గౌరవానికీ పాత్రులు కారు. వాళ్ళని మనం యథేచ్ఛగా దోచుకోవచ్చు. వాళ్ళు మనచేత దోచుకోబడ్డానికే పుట్టారు. లేకపోతే మనుషులు జంతువుల మాంసం ఎందుకు తింటారు ? మనుషుల మాంసం ఎందుకు తినరు ? మంచివాడికి ఈ సమాజంలో ఉన్న విలువ అంతకంటే మఱీ యెక్కువేమీ కాదు. ఇక్కడ ఇచ్చినకొద్దీ పుచ్చుకునేవాళ్ళూ, చేసినకొద్దీ ఇంకా చేయించుకునేవాళ్ళూ లెక్కకు మిక్కిలి.

మఱి మంచితనాన్ని సమాజం బొత్తిగా హర్షించదా ? అనడిగితే, హర్షిస్తుంది. కానీ ఎవణ్ణి పడితే వాణ్ణి కాదు. తనకు సుదీర్ఘ కాలంలో ఉపయోగపడే మంచివాడు సమాజానికి యమా నచ్చుతాడు. అలాగే జీవితంలో తొంభైశాతం చెడు, పదిశాతం మాత్రమే మంచి ఉన్నవాడి మంచితనం సమాజదృష్టిని ఆకర్షిస్తుంది. పెద్దవాళ్ళని అలవోకగా హత్యచేసే అలవాటున్న గజదొంగ ఒక కుటుంబాన్ని యావత్తూ నిర్మూలించి వాళ్ళలో ఒక చిన్నపాపని మాత్రం చంపకుండా వదిలిపెట్టి వెళితే అతనిలో చావకుండా బతికి ఉన్న అరుదైన మానవత్వానికి గొప్ప పబ్లిసిటీ లభిస్తుంది. అదే, ప్రొఫెషనల్ రోజువారీ మంచివాళ్ళంతా చేతకాని చచ్చుదద్దమ్మల కిందే జమ. సమాజం సమర్థుల మంచితనాన్ని, సంపన్నుల మంచితనాన్ని, శక్తిమంతుల మంచితనాన్ని, టోకుగా విజేతల మంచితనాన్ని మాత్రమే హర్షిస్తుంది. తన జోలికీ, శొంఠికీ రాని, తన లోపాల్ని విమర్శించని, తన బలహీనతల్ని సంస్కరించడానికి ప్రయత్నించని వ్యక్తుల మంచితనాన్ని మాత్రమే అది మెచ్చుకుంటుంది. అదే సమయంలో మంచివాళ్ళు తెలివిగలవాళ్ళు కూడా కావడాన్ని అది ఎట్టి పరిస్థితుల్లోను భరించజాలదు.

ఒక యింట్లో అనేక సంవత్సరాల పాటు నివసించాక అక్కడ అవసరమైన వస్తువులతో పాటు అనవసరమైన వస్తువులు కూడా అనేకం పోగుపడతాయి. అలాగే వేలాది సంవత్సరాల మానవ నాగరికతలో కొన్ని అనవసర పదాలు పేఱుకుపోతాయి. Open mind, positive attitude, సౌభ్రాత్రం గట్రా అర్థహీన గగన కుసుమాల చెత్త ! వీటి గుఱించి పుస్తకాల్లో చదివి బుఱ్ఱ పాడుచేసుకుని వీటిని అలవఱచుకోవడానికి ఎవడైనా ప్రయత్నించాడో వాడి పని అయిపోయిందన్నమాటే. వాణ్ణి దోచుకోవడానికీ, వెధవాయిని చేసి ఆనందించడానికీ కుట్రలు మొదలవుతాయి. మంచివాళ్ళకీ, చెడ్డవాళ్ళకీ ఒక ప్రధానమైన తేడా ఉంది. చెడ్డవాళ్ళంతా సర్వసాధారణంగా నిస్సంకోచులూ, నిర్లజ్జులూ, నిస్సిగ్గు మనుషులు. ఈ పూట ఒకలా, ఱేపు ఇంకొకలా, ఎల్లుండి మఱొకలా కనిపించడానికీ, ప్రవర్తించడానికీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను వెనుదీయరు. అలా ఉంటే ఇతరులు ఏమనుకుంటారో ? అనే బిడియానికి ఇసుమంతైనా మనసులో స్థానమివ్వరు. ఒక రకంగా అలోచిస్తే, వాళ్ళు ప్రపంచాన్ని మంచివాళ్ల కంటే నాలుగాకులెక్కువే చదివినవారు. ప్రపంచం పశువుల్లాగా ఫక్తు వర్తమానవాది అనీ, దానికి ఏదీ అంతబాగా గుర్తుండదనీ, ఈ రోజు దానికి కోపమొచ్చినా, ఱేపు దాన్ని మంచి చేసుకోవచ్చుననీ, మన వర్తమాన స్థితిని బట్టి అది మనల్ని ఇట్టే క్షమించేస్తుందనీ కనిపెట్టినవాళ్ళు. సమాజం తెలివితక్కువతనాన్ని ద్వేషించినంతగా దుష్టత్వాన్ని ద్వేషించదు కనుక దుష్టుల మాట విన్నంత బాగా అది మంచివాళ్ళకి లొంగదు. ఒకడు మంచివాడని గ్రహించిన మఱుక్షణం అది అతన్ని లెక్కచేయడం మానేస్తుంది.

మారలేకపోవడమే మంచివాళ్ళ బలహీనత. ద్రోహులని తెలియక ద్రోహుల పట్ల మొదట్లో చూపించిన ఆదరాన్ని వాళ్ళు ద్రోహులని తెలిశాక కూడా ఉన్నపళాన వెంటనే ఉపసంహరించలేరు. ముందునుంచే నవ్వకుండా అంటీ ముట్టనట్లుగా ఉంటే, ఆ తరువాత తీఱిగ్గా ఆలోచించుకోవచ్చు అవతలివాళ్ళని ఏ దృష్టితో మన్నించాలనేది. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం - ఏ అపరిచితుడూ ఇంకో అపరిచితుణ్ణుంచి తొలి పరిచయంలోనే సౌహార్దాన్నీ, దరహాసాల్నీ ఆశించడు. అటువంటప్పుడు ఆ శ్రమ తీసుకోవడం అవసరమా ? అని !

తాము మంచితనం అనుకుంటున్నది ఎందుకూ కొఱగానిదని మంచివాళ్ళు కూడా గ్రహిస్తారు - ఒక అప్పు పుట్టాల్సినప్పుడు, ఒక పదోన్నతి (promotion) కావాల్సినప్పుడు, ఒక సరిహద్దు తగాదా అయినప్పుడు, మన వల్ల ఉపకారం పొందినవాడు మనల్ని ఎదిఱించినప్పుడు ! నా దృష్టిలో - అసలు సమస్య ఉన్నది మనిషి మంచివాడు కావడంలో కాదు, దాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పడు, ఎవఱికి పడితే వారికి ప్రదర్శించడంలో !

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070