Thursday, July 16, 2009

మూర్ఖోపాఖ్యానం



రామాయణంలో పిడకల వేటలాగా, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తిక్కన భారతం మధ్యలో యీ మూర్ఖోపాఖ్యానం! నేనేం చెయ్యను, హఠాత్తుగా నాకీ పద్యాలు ఇవ్వేళ (మళ్ళీ) గుర్తుకొచ్చాయి మరి. గుర్తుకు రావడం వెనక ఒక కారణం ఉంది కాని, అదిక్కడ చెప్పడం సభ్యత కాదు, అవసరమూ లేదు. అసలీ పద్యాలు (వచ్చిన వాళ్ళకి), ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో భర్తృహరి రాసినా, ఆ తర్వాత ఎప్పుడో లక్ష్మణకవి తెలుగు చేసినా, వీటికి కాలదోషం పట్టకుండా (అదే expire అవ్వకుండా) ఉండడానికి మనవేఁ కారణం. మూర్ఖులున్నంత వరకూ ఇవి నిలిచే ఉంటాయి!

బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయ దూషితా
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితం

బోద్ధలగువారు మత్సరపూర్ణ మతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజు లబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు

తెలిసినవాళ్ళేమో అసూయాపరులు, ప్రభువులేమో గర్వాంధులు. ఇతరులకి విని బోధపరచుకొనే తెలివిలేదు. చెప్పాలనుకున్న సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది.

మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా
యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటకు తియ్యవచ్చు, నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతోకూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు, పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. మూర్ఖుడి మనసుని మాత్రం ఒప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు! (సంస్కృతంలో మొండిపట్టుపట్టిన మూర్షుడు అని ఉంటుంది)

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప లేము

ప్రయత్నిస్తే ఇసుకలోంచి చమురుని తియ్యడం సాధ్యమవచ్చేమో. ఎండమావి వెంటబడి అందులో నీరు తాగవచ్చునేమో. కొమ్మున్న కుందేలుని వెతికి పట్టుకోవచ్చేమో. ఇవేమీ చేసే అవకాశం లేదు కాని కనీసం చెయ్యవచ్చేమో అని ఆలోచించవచ్చు. కాని మూర్ఖుని మనసుని ఒప్పించే, మార్చే ప్రయత్నాన్ని మాత్రం ఊహలో కూడా చెయ్యలేము!

కరిరాజున్ బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించు వా
డురు వజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింప, దీ
పు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుం జింద యత్నించు, ని
ద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్

మదపుటేనుగును తామరతూళ్ళతో కట్టడానికి ప్రయత్నించేవాడు, దిరిసెనపువ్వులతో వజ్రాన్ని కోయ్యాలనుకునేవాడు, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చాలని చూసేవాడు, మంచిమాటలతో మూర్ఖులకి చెప్పే ప్రయత్నం చేసేవాడు వీళ్ళందరూ ఒకలాంటి వాళ్ళేనట!


ఈ పద్యాలు చదివినప్పుడల్లా, భర్తృహరి ఎంతమంది ఎలాంటి మూర్ఖులని కలిసి వాళ్ళతో వాదించాల్సి వస్తే ఇంతలా యీ మూర్ఖపద్ధతిని వర్ణించేవాడూ అనిపిస్తుంది. ఆ బాధ ఏవిఁటో తెలుసుకాబట్టి, అతని మీద జాలికూడా కలుగుతుంది.

మూర్ఖులు చాలా రకాలుగా ఉంటారు. తాము మూర్ఖులమని తెలియని వాళ్ళు కొందరైతే, తెలిసిన వాళ్ళు మరికొందరు. వీళ్ళు తెలుసున్న మూర్ఖులన్న మాట! మళ్ళీ ఇందులో, కొంతమంది తమ మూర్ఖత్వానికి సిగ్గుపడి మౌనంగా ఉండలనుకొనేవారు కొందరైతే, తమ మూర్ఖత్వానికి తాము గర్వపడుతూ, దానికి రకరకాల పేర్లుపెట్టి విజృంభించేవారు మరికొందరు.
వీళ్ళందరూ కాక మూర్ఖులలో మరో రకం కూడా ఉన్నారు. అదెవరో తెలుసా, ఇదుగో పైన చెప్పినట్టు, మూర్ఖుల మనసు మార్చలేమని తెలిసి తెలిసీ వాళ్ళతో వాదనకి దిగేవాళ్ళున్నారు చూడండీ, వాళ్ళది తెచ్చిపెట్టుకున్న మూర్ఖత్వం!

నా స్నేహితుడొకడు మొన్నొకసారి హఠాత్తుగా ఓ పొడుపుకథ పొడిచాడు. "ఒరేయ్! జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది కదా. అలాగే మూర్ఖుడూ మూర్ఖుడూ రాసుకుంటే ఏం రాలుతుంది(తాయి) చెప్పుకో?" అని అడిగాడు. నేను చాలాసేపు ఆలోచించి... రకరకాలుగా ప్రయత్నించి... చించి... ఆఖరికి ఓటమిని ఒప్పేసుకొని వాడినే జవాబు చెప్పమన్నాను. అప్పుడు వాడు, "ఈ మాత్రం తెలీదా, బ్లాగులలో కామెంట్లు!" అని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి చక్కా జారుకున్నాడు!
"హు... వాడంతే...వాడొక నిజమైన బ్లాగరి (బ్లాగ్ + అరి = బ్లాగులకి శత్రువు)!" అనుకొని వాడన్నమాటని తీవ్రంగా కొట్టిపారేసాననుకోండి. వాడి మాటలకి మీరెవ్వరూకూడా ఏవీఁ "ఫీలు" కాకండేం.

పిడకలవేట సమాప్తం. తర్వాత పోస్టులో తిరిగి మనం తిక్కన దగ్గరికి వెళ్ళిపోదాం.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070