Tuesday, November 3, 2009

'సెల్ఫ్‌ బ్రాండింగ్‌'. -మీ యూఎస్‌పీ ఏమిటో మీకే తెలుసు. తెలియకపోతే వెంటనే తెలుసుకోండి.

నేను... అందగాణ్ని. సృజనాత్మకవ్యక్తిని. బాగా కష్టపడతాను. నిజాయతీపరుణ్ని. మీగురించి మీరు ఏమైనా అనుకోవచ్చు. ఎంత గొప్పగా అయినా వూహించుకోవచ్చు. ఆ సోదంతా ఎవరిక్కావాలి? నలుగురూ ఏమనుకుంటున్నారు? అదీ ముఖ్యం. అదే మీ 'బ్రాండ్‌'. ఆ నలుగురూ ఏం మాట్లాడుకోవాలన్నదీ మీరే శాసించగలిగితే అది 'సెల్ఫ్‌ బ్రాండింగ్‌'.



సందేహం లేదు. మీరో బ్రాండ్‌. తిరుగులేని బ్రాండ్‌. మీకు సరిసమానమైన బ్రాండ్‌ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు మాత్రమే మీలా ఆలోచించగలరు. మీరు మాత్రమే మీలా మాట్లాడగలరు. మీరు మాత్రమే మీలా రాయగలరు. మీరు మాత్రమే మీలా ప్రోగ్రామ్‌ చేయగలరు.



బాటా చెప్పులకు మన్నిక లాగా, నోకియా సెల్‌ఫోన్లకు నాణ్యతలాగా, లెవిస్‌ జీన్స్‌కు నవ్యత లాగా... మీకూ ఓ యునిక్‌ సెల్లింగ్‌ ప్రపొజిషన్‌ (యూఎస్‌పీ) ఉంది. అదే మీ బ్రాండ్‌ విలువను నిర్ణయిస్తుంది. మీ యూఎస్‌పీ ఏమిటో మీకే తెలుసు. తెలియకపోతే వెంటనే తెలుసుకోండి.



అనర్గళంగా మాట్లాడగలరు, నొప్పించకుండా ఒప్పించగలరు, అడగ్గానే అమ్ములపొదిలోంచి ఐడియాలు తీసివ్వగలరు, సంక్షోభాల్లో సమర్థంగా వ్యవహరించగలరు, అద్భుతంగా నటించగలరు, అందంగా డాన్స్‌ చేయగలరు... ఏదైనా కావచ్చు.



మీలాంటి డాక్టర్లు, మీలాంటి లాయర్లు, మీలాంటి టీచర్లు, మీలాంటి నటులు, మీలాంటి రచయితలు... ఈ భూప్రపంచం మీద (కనీసం మీ రాష్ట్రంలో మీ నగరంలో మీ పట్టణంలో) బోలెడంత మంది ఉండవచ్చు. అంతమందిలో మీరెంత భిన్నమైన వ్యక్తో ప్రచారం చేసుకోవడమే బ్రాండింగ్‌.



'ఏదో ఒక టూత్‌పేస్టు...' అనకుండా, కాల్గెట్‌ అనో పెప్సొడెంట్‌ అనో కచ్చితంగా అడిగి కొనుక్కున్నట్టు... మిమ్మల్ని ఏరికోరి ఎందుకెంచుకోవాలో సవివరంగా విశ్లేషించడమే బ్రాండింగ్‌.



'కలవరపడొద్దు. కాపాడటానికి నేనున్నాను' అని ఏ దైవాంశ సంభూతుడో ధైర్యం చెప్పినట్టు, మీ వృత్తిఉద్యోగాల్లోని కస్టమర్లకు వాగ్దానం చేయడమే బ్రాండింగ్‌.



ఇదోరకమైన అభివ్యక్తి. మీ గురించీ మీ నైపుణ్యం గురించీ మీ విజయాల గురించీ మీ ఒక్కరికే లేదంటే ఏ కొద్దిమందికో తెలిసిన విషయాల్ని, తెలిసితీరాల్సిన వ్యక్తులందరికీ చేరవేయడం.

బ్రాండింగ్‌ ఎందుకు?



ఎందుకంటే, కాస్త రిలాక్స్‌ అవ్వాలనుకుంటే ఏ కోక్‌నో ఎందుకు తాగుతాం?



నోరు తీపి చేసుకోవాలనిపిస్తే ఏ పుల్లారెడ్డి దుకాణానికో ఎందుకెళ్తాం?



సూటు కొనాలంటే ఏ రేమండ్స్‌ షోరూమునో ఎందుకు సందర్శిస్తాం?



రెండో ఆలోచనే రాదెందుకు? ధర గురించి పట్టించుకోమెందుకు? నాణ్యత మీద అంత నమ్మకమెందుకు?



అదే బ్రాండ్‌ మహత్యం.



వస్తువుల వరకైతే ఫర్వాలేదు. నురగల సబ్బుబిళ్లకో కరెంటు రుబ్బురోలుకో ఉన్నట్టు మనుషులకూ బ్రాండ్‌ విలువ ఉంటుందా? ఉంటుందనే అంటున్నారు సెల్ఫ్‌ బ్రాండింగ్‌ పితామహుడు టామ్‌ పీటర్స్‌. 'బ్రాండ్‌ కాల్డ్‌ యు' అనే వ్యాసంలో ఆయన... 'వయసుతో సంబంధం లేదు. వృత్తితో సంబంధం లేదు. అర్హతతో సంబంధం లేదు. ప్రతి మనిషికీ బ్రాండింగ్‌ ఉండాలి. అప్పుడే, ఎదుటి మనిషి మన గురించి ఎలా ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించగలం' అని తేల్చారు.



నిజమే, చొరవతీసుకుని మీకంటూ ఓ బ్రాండ్‌ సృష్టించుకోకపోతే మీ కంపెనీ యాజమాన్యవో మీ సహోద్యోగులో మీ పొరుగువారో తమకు తోచినట్టు ఏదో ఓముద్ర వేసేస్తారు. సమర్థ నాయకుడిగానో సృజనాత్మకవ్యక్తిగానో గుర్తింపు పొందాల్సిన మీరు... 'భేషజం లేని మనిషి', 'కలుపుగోలు స్వభావం', 'సర్దుకుపోయే గుణం' లాంటి... చిన్నాచితకా బ్రాండ్‌లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.



అదే జరిగితే మీ నైపుణ్యం, మీ సామర్థ్యం, మీ చొరవ, మీ క్రమశిక్షణ... అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. వందమంది గుమస్తాల్లో మీరూ ఒకరు. యాభైమంది కళాకారుల్లో మీరూ ఒకరు. పదికోట్ల మంది ఆంధ్రుల్లో మీరూ ఒకరు. వందకోట్ల మంది భారతీయుల్లో మీరూ ఒకరు. సృష్టిలోని అనంతకోటి జీవరాశిలో మీరూ ఒకరు.



'మీరొక్కరే...' అనిపించుకోవాలంటే మాత్రం బ్రాండింగ్‌ అవసరం.



డాక్టరు, ఇంజినీరు, కవి, కార్పెంటరు, టైలరు, ఎలక్ట్రీషియన్‌... ఏ వృత్తి అయినా కానివ్వండి. మీరున్న పట్టణంలో నలుగురు నిపుణుల పేర్లు చెప్పాల్సివస్తే మీ పేరూ ఉండాలి. మీ జిల్లాలో పదిమంది జాబితా తయారుచేయాల్సివస్తే మీరుండాలి. రాష్ట్రవ్యాప్తంగా ఓ వందమందిని జల్లెడపట్టి తీస్తే... అక్కడా మీరుండాలి.



బ్రాండే కీలకం



మనిషి ఎదుగుదలకు నైపుణ్యమే పునాది. సందేహం లేదు. కానీ నైపుణ్యం మనిషిని ఓ స్థాయివరకు మాత్రమే తీసుకెళ్తుంది. ఇంకా పైఅంతస్తులు ఎక్కాలంటే బ్రాండింగ్‌ ఉండాల్సిందే. కొంతమంది గొప్పగొప్ప నాయకులు, సమర్థులైన మేనేజర్లు, అద్భుతమైన వ్యూహకర్తలు... చచ్చేదాకా అనామకులుగానే మిగిలిపోతుంటారు. కారణం, బ్రాండింగ్‌ లోపమే.



అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువుకూ... ఆ వరుసలో చివరి స్థానంలో ఉన్న వస్తువుకూ మధ్య నాణ్యత తేడా కంటే, బ్రాండింగ్‌ వ్యత్యాసమే ఎక్కువ.



ఓ కంపెనీలోనో రాజకీయ పార్టీలోనో ఒకటో స్థానంలోనో రెండో స్థానంలోనో ఉన్న వ్యక్తికీ, ఏ పదవీలేని కార్యకర్తకీ తేడా సమర్థతకు సంబంధించింది కాదు, బ్రాండింగ్‌కు సంబంధించింది.



కొన్ని సభలకి జనం ఇసుకేస్తే రాలనంతగా వెళ్తారన్నా, కొన్ని సభలు బిరియానీ పెట్టిస్తామన్నా వెలవెలబోతాయన్నా కారణం... ఆ నేతలు సృష్టించుకున్న బ్రాండింగ్‌.



ఎందుకు రజనీకాంత్‌ డాన్స్‌ చేస్తేనే ఈలేసి గోలచేస్తాం, ఎందుకు సచిన్‌ శతకం చేస్తేనే పరవశించి పండగ చేసుకుంటాం, ఎందుకు రామ్‌దేవ్‌బాబా యోగా నేర్పిస్తారంటే వేలకువేలు పోస్తాం... అంతా బ్రాండ్‌ గొప్పదనం.



ఒక్కమాటలో చెప్పాలంటే, వ్యాపారాన్నీ రాజకీయాల్నీ సామాజిక సంబంధాల్నీ బ్రాండింగ్‌ శాసిస్తోంది.



మిమ్మల్ని మీరు సమాజానికి సరికొత్తగా పరిచయం చేసుకునేముందు ఓ సంకల్పం చెప్పుకోండి....



'నేను సుబ్బారావునో అప్పారావునో కాదు.



క్లర్క్‌నో అకౌంటెంట్‌నో కాదు.



ఇన్ఫోసిస్‌ ఉద్యోగినో బీహెచ్‌యీఎల్‌ ఉద్యోగినో కాదు.



నేనో బ్రాండ్‌ని.



'నేను.ఐఎస్‌సీ'కి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ని.



కోక్‌, మెక్‌డొనాల్డ్స్‌, టాటా, రిలయన్స్‌, నేను... అంతే!'



తిరుగులేని బ్రాండ్‌గా ఎదగడానికి ఏం చేయాలో బ్రాండింగ్‌ గురువులు కొన్ని సూత్రాలు చెప్పారు. ఆచరించండి. సరికొత్తగా అవతరించండి.



బ్రాండ్‌ బారసాల...



మీరు సమాజానికి ఎలా పరిచయం కావాలనుకుంటున్నారో, చరిత్రలో ఎలా నిలిచిపోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీ నిజావతారం (కోర్‌కాంపిటెన్సీ) ఏమిటో నిర్ధారించుకోండి. అదంత సులభం కాదు. నగ్నంగా అద్దంలో చూసుకున్నంత నిజాయతీగా మిమ్మల్ని మీరు బేరీజువేసుకోవాలి. బలాల్నీ బలహీనతల్నీ నైపుణ్యాల్నీ అసమర్థతల్నీ తూకమేసి చూసుకోవాలి. మీ గురించి మీరు అతిగా ఊహించుకున్నా నష్టమే. తక్కువగా అంచనా వేసుకున్నా కష్టమే.



మనం ఏమిటి, ఎక్కడున్నాం, ఎక్కడ ఉండాలనుకుంటున్నాం... అన్న అంతర్మథనం ఎంత నిజాయతీగా జరిగితే అంత మంచిది.



సెల్ఫ్‌ బ్రాండింగ్‌, వస్తువు మార్కెటింగ్‌ ఒక్కటి కాదు. అబద్ధాలు చెప్పు. మాటలతో మంత్రం వెయ్‌. తిమ్మినిబమ్మిని చెయ్‌. ఏం చేస్తావో నీ ఇష్టం. వీలైనంత ఎక్కువ ధరకు సరుకు అమ్మెయ్‌... అని చెబుతుంది మార్కెటింగ్‌.



బ్రాండింగ్‌లో అలాకాదు. నిజాయతీ ఉండాలి. పారదర్శకత ఉండాలి. స్పష్టత ఉండాలి. ఒక సరుకు అమ్ముకోవడంతోనో ఒక ప్రాజెక్టు చేజిక్కించుకోవడంతోనో ఆ అనుబంధం తీరిపోదు. నానాటికీ బలపడాలి.



నలుగురి నోట్లో...



మీ బ్రాండ్‌ గురించి నలుగురికీ ప్రచారం చేయండి. ఆ ప్రచారం 'నేడే చూడండి' అన్నట్టు సినిమాబండి పబ్లిసిటీ అంత ప్రత్యక్షంగా ఉండాల్సిన పన్లేదు. ఉండకూడదు కూడా. చాపకింద నీరులా సాగాలి. మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సంఘాల్లో సభ్యత్వం తీసుకోండి. నిపుణుల ఉపన్యాసాలకు హాజరవ్వండి. వీలైతే వేదికల మీద నాలుగు మాటలు మాట్లాడండి. అవసరమైన ప్రతి సందర్భంలోనూ మీకూ మీలాంటి ఇతరులకూ మధ్య తేడా ఏమిటో స్పష్టంగా చెప్పండి. చేసి చూపించండి. మీ విశ్వసనీయతను చాటండి. సంస్థకూ క్త్లెంట్లకూ విధేయుడిగా మెలగండి. మీ అనుబంధం వ్యాపారానుబంధం కంటే కాస్త ఎక్కువే అన్న విషయం పరోక్షంగా గుర్తుచేస్తూ ఉండండి. ఆ వ్యక్తీకరణకు కాస్త భావోద్వేగాన్ని జోడించండి.



కనిపిస్తూనే ఉండటం... బ్రాండింగ్‌లో చాలా ముఖ్యం. అది భౌతికంగానే కానక్కర్లేదు. మంచి కొటేషన్స్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయవచ్చు. మంచి ఫొటోలో వ్యాసాలో కనిపిస్తే మెయిల్‌లో ఫార్వర్డ్‌ చేయవచ్చు. ఇటీవల మీరు సాధించిన విజయాల్నీ సమర్థంగా పరిష్కరించిన సంక్షోభాల్నీ 'కేస్‌ స్టడీస్‌'లా అందరిముందూ ఉంచవచ్చు. నసగకుండా నాలుగు ముక్కలు మాట్లాడేవాళ్ల కోసం టెలివిజన్‌ ఛానళ్లు దివిటీ వేసి వెతుకుతున్నాయి. మీ రంగానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోవద్దు.



మీ మీరు...

మిమ్మల్ని మీరు గౌరవించుకోనప్పుడు, మీ మీద మీరు శ్రద్ధ చూపనప్పుడు ఇంకెవరో మీ గురించి పట్టించుకోవాలనుకోవడం భ్రమ. ఈ ప్రపంచంలో మీరు అతి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మీరే. ఎంత మందికి ఎన్ని నమస్కారాలు చేసినా మీమీద మీకున్న గౌరవమే వేరు. అదంతా మీ వస్త్రధారణలో కనిపించాలి. అలా అని ఖరీదైన దుస్తుల కోసవో విదేశీ అత్తర్ల కోసవో పాకులాడమని కాదు. మీమీద మీరు శ్రద్ధచూపిస్తున్నారనీ మీరంటే మీకు బోలెడంత గౌరవమనీ అర్థమయ్యేలా ఉంటే చాలు. అల్ట్రా వోడర్న్‌గా ఉండాల్సిన పనీ లేదు. వినియోగ వస్తువుల బ్రాండ్‌ విజయంలో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌కూ వాటా ఉంటుంది. మీ బ్రాండూ అందుకు మినహాయింపు కాదు. ఏదైనా అతికినట్టు సరిపోవాలి. హుందాగా కనిపించాలి. కృతకంగా ఉంటే, వెుదటికే వోసం.



అయినా... కాసిని నీళ్లు, అరచెంచా చక్కెర, చిటికెడు రంగు కలిపేసి 'కోకాకోలా' పేరుతో అరవై ఏడు బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువ సృష్టించగలిగినప్పుడు, మిమ్మల్ని మీరు అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచానికి పరిచయం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు.



వస్త్రధారణే కాదు... నలుగుర్లో మీ మాటతీరు, మీ నవ్వు, మీ పలకరింపు, మీరడిగే కుశలప్రశ్నలు, మీ విజిటింగ్‌ కార్డు, మీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌... ప్రతీదీ మీ బ్రాండ్‌ విలువను పెంచుతాయి.



లక్ష్యం దిశగా...

రిలయన్స్‌ అయినా, రేమండ్స్‌ అయినా... రాత్రికిరాత్రే గొప్ప బ్రాండ్లు కాలేదు. జనం నాలుకలకెక్కలేదు. దానివెనక చాలా శ్రముంది. వ్యూహాలున్నాయి. బడ్జెట్‌ ఉంది. కాలానికి తగ్గట్టు మార్పుచేర్పులున్నాయి. అన్నిటికీ మించి సుదీర్ఘ లక్ష్యం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఇన్ని దేశాలకు విస్తరించాలనో వచ్చే పదేళ్లలో ఇంతమంది కస్టమర్లని చేరుకోవాలనో ఇన్ని అమ్మకాలు సాధించాలనో... ఏవో లెక్కలుంటాయి. ఒక బ్రాండ్‌గా మీకంటూ ఓ లక్ష్యం ఉండాలి. అది 'ఎవరూ సాధించని విజయాలు సాధించాలి' అన్నంత అస్పష్టంగా ఉండకూడదు 'ప్రపంచాన్ని జయించాలి' అన్నంత అసాధ్యంగానూ ఉండకూడదు. నిర్ణీత వ్యవధిలో కచ్చితమైన ప్రయత్నంతో ఓ మామూలు మనిషి సాధించగలిగేదై ఉండాలి.

...ఇంతమంది కస్టమర్లను సంపాదించుకోవాలి.

...ఇన్ని పుస్తకాలు రాయాలి.

...ఇన్ని డిగ్రీలు సాధించాలి.

...ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి.

...ఇన్ని వేలమందికి నెట్‌వర్క్‌ విస్తరించుకోవాలి.

ఇలాంటివే ఏమైనా కావచ్చు.



లక్ష్యం విషయంలో ఎంత నిజాయతీగా ఉన్నారో, ఆ ప్రయాణం విషయంలోనూ అంతే నిజాయతీగా వ్యవహరించండి. విలువల్లేని వ్యక్తి బ్రాండ్‌గా అవతరించడం అసాధ్యం. అవతరించినా, అది తాత్కాలిక వైభోగమే.



ఇ-బ్రాండింగ్‌

ఇంటర్నెట్‌ను మించిన మాధ్యమం లేదు. దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటే అంత మంచిది. ఒక్క క్లిక్‌తో కొన్నివేలమందిని చేరుకోవచ్చు. పలకరించవచ్చు. ఆలోచనలు పంచుకోవచ్చు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. మిమ్మల్ని తిరుగులేని బ్రాండ్‌గా తీర్చిదిద్దగల శక్తి ఇంటర్నెట్‌కు ఉంది. బ్లాగు ప్రారంభించండి. ఫేస్‌బుక్‌ తెరవండి. ట్వీట్స్‌ ఇవ్వండి. ఫ్లికర్‌లో ఫొటోలు షేర్‌చేసుకోండి. స్నేహితుల్ని సంపాదించుకోండి. అనుచరుల్ని కూడగట్టుకోండి. చాలా కంపెనీలు చురుకైన ఉద్యోగుల కోసం సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లమీద ఆధారపడుతున్నాయి. ఎంతమంది అభిమానులుంటే అంత ప్రాధాన్యం. ఆమాత్రం నెట్‌వర్కింగ్‌ తెలిసినవాళ్లు, ఏ పని అప్పజెప్పినా సునాయాసంగా చేయగలరన్న నమ్మకం. మీ రంగానికి సంబంధించిన ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలిో సభ్యత్వం తీసుకోండి. దీనివల్ల వృత్తి పరిజ్ఞానం పెంచుకోవచ్చు. చుట్టూ ఏం జరుగుతోందో తెలుస్తుంది. ఇక్కడా కొన్ని జాగ్రత్తలు తప్పవు. మీరు రాసే రాత, మీరు వెల్లడించే అభిప్రాయం, మీరు వేసే జోకు... అన్నీ మీ బ్రాండింగ్‌తో ముడిపడి ఉంటాయి. ట్విటర్‌లో శశిథరూర్‌ వ్యాఖ్య ఎంత దుమారం లేపిందో గుర్తుంది కదూ!



నలుగురి కోసం

మీరో నాయకుడన్న సంగతి గుర్తుంచుకోండి. అనుచరులెప్పుడూ బలమైన బ్రాండ్లు కాలేరు. కుటుంబంలో కావచ్చు, అపార్ట్‌మెంట్‌లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తి సంఘాల్లో కావచ్చు... ఎక్కడ ఏ సమస్య తలెత్తినా నాయకుడిలా స్పందించండి. సమర్థుడైన లీడర్‌ అనుచరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతాడు. కష్టాల్లో ఆదుకుంటాడు. నలుగురి గురించి పట్టించుకోకుండా 'నన్నంటుకోవద్దు నామాల కాకీ' అన్నట్టు వ్యవహరించే వారు, ఎంత గొప్పవారైనా ఎంత నిపుణులైనా సమాజం గౌరవించదు. షారుక్‌ఖాన్‌కు అయినా సచిన్‌ టెండూల్కర్‌కు అయినా కావలసినంత బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. అయినా కూడా ఏ మంచిపని జరిగినా జనంలోకి వస్తారు. తలోచేయీ వేస్తారు. ఆ చొరవలో 'మేమూ ఈ సమాజంలో భాగమే...' అన్న బలమైన సందేశం ఉంది.



బ్రాండింగ్‌కు అది చాలా ముఖ్యం.



నిత్యనూతనం

ఒక విజయవో ఒక ఆవిష్కరణో ఒక అవార్డో ఒక ప్రశంసో... జీవితాంతం మీ బ్రాండ్‌ విలువను కాపాడలేవు. ఇదో నిరంతర సాధన. ఏరోజుకారోజు సవాలు. ఎప్పటికప్పుడు పరీక్ష. గెలుస్తూనే ఉండాలి. గెలుస్తూనే పోవాలి. కార్పొరేట్‌ కంపెనీలకు రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాలు ఉన్నట్టే... మీ ఆలోచనలిలో కొంత భాగాన్ని ఆవిష్కరణలకు కేటాయించుకోండి. మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. మీ విజయాల చిట్టా విస్తరించుకోండి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలతో మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. కనీసం నాలుగైదేళ్లకోసారైనా ప్రతి కంపెనీ పాత ఉత్పత్తులకే 'సరికొత్త' రూపం ఇవ్వడానికీ లోగోలూ నినాదాలూ ప్రచార వ్యూహాలూ మార్చడానికీ కారణం ఇదే. దీన్నే 'బ్రాండ్‌ పునరుత్థానం' అనొచ్చు.



వేదాంతం అనుకోకపోతే ఒక మాట. మీ బ్రాండ్‌, మీ పలుకుబడి, మీ నెట్‌వర్క్‌... మిమ్మల్ని ఢీకొట్టే మరో బ్రాండ్‌ రానంతకాలమే. వచ్చాక కూడా, పోటీదారులకు అందనంత దూరంలో మీరుండాలనుకుంటే వారు అందుకోలేనంత వేగంతో ఎదుగుతూ ఉండాలి. ఈవిషయంలో రష్యన్‌ పోల్‌వాల్ట్‌ క్రీడాకారుడు సెర్గీ బుబ్కాని ఆదర్శంగా తీసుకోండి. ఆ అలుపెరుగని ఆటగాడు ఎప్పుడో ప్రపంచ రికార్డు సాధించాడు. అయినా విశ్రమించలేదు. ఏటికేడాది... తన రికార్డును తానే బద్దలుకొట్టుకునేవాడు. రిటైర్మెంట్‌దాకా అతనికి ఎదురేలేదు. రిటైర్మెంట్‌ తరువాత కూడా ఆయన దరిదాపుల్లోకి వెళ్లడానికి మిగతా ఆటగాళ్లకి చాలా సమయం పట్టింది.



కనీసం రెండేళ్లకోసారైనా మీ ప్రొఫైల్‌లో మార్పు రావాలి. కొత్త విజయాలు, కొత్త భాషలు, కొత్త రచనలు, కొత్త నైపుణ్యాలు వచ్చి చేరాలి. బ్రాండ్‌ అనేది వాగ్దానం. అది నిలుపుకోడాన్ని బట్టి ఉంటుంది.ఎప్పుడూ ఆ నమ్మకాన్ని వమ్ముచేయకండి. అలా జరిగిననాడు, మీరు బ్రాండ్‌గానే కాదు, మనిషిగానూ విఫలమైనట్టే.



* * *

'బ్రాండింగ్‌, మహా అయితే పులిని సింహంలా చూపించగలదు.

చారల పిల్లిని పులిలా మార్చలేదు'.

- పర్సనల్‌ బ్రాండింగ్‌ పితామహుడు టామ్‌పీటర్స్‌

మహా 'బ్రాండ్లు'



మహాత్ముడు బతికున్నరోజుల్లో సెల్ఫ్‌బ్రాండింగ్‌ అన్న మాట ప్రచారంలో లేకపోవచ్చు. రామ్‌దేవ్‌కో రాఖీసావంత్‌కో అసలామాటకు అర్థం తెలియకపోవచ్చు. నారాయణమూర్తి ఆ ప్రయత్నమే చేసుండకపోవచ్చు. అయినాసరే, వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన బ్రాండింగ్‌ పాఠాలు చాలా ఉన్నాయి.

గాంధీజీ

భారతదేశంలో మహాత్మాగాంధీని మించిన బ్రాండ్‌ లేదు. మరణించిన అరవై ఏళ్ల తర్వాత కూడా ఆ బ్రాండ్‌ విలువ చెక్కుచెదరలేదు. రాజకీయ పార్టీలు ఆ బోసినవ్వుల లోగో కోసం ఇంకా పాకులాడుతున్నాయి. 'పర్సనల్‌ బ్రాండింగ్‌' అన్న మాట గాంధీజీ కాలంలో వాడుకలో లేకపోవచ్చు. కానీ దాని ప్రాధాన్యం ఆయనకి తెలుసు. దండి యాత్ర, అహింస, చరఖా, మౌనవ్రతం, ఉపవాసం ...మహాత్ముడి బ్రాండింగ్‌ మార్గాలు.

ఎన్‌.టి.రామారావు

తెలుగువారికీ తెలుగుదనానికీ ఓ బ్రాండ్‌ విలువ సంపాదించిపెట్టిన ఘనత ఎన్టీఆర్‌దే. ఆయనే ఓ నిలువెత్తు ప్రజాబ్రాండ్‌! కథానాయకుడిగా ఎంచుకున్న పాత్రలు, నాయకుడిగా అమలుచేసిన పథకాలు, ఆ తెగింపు, ఆ పలకరింపు... అన్నీ కలిసి ఆయన్ని తిరుగులేని బ్రాండ్‌గా మలిచాయి. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి.



అమితాబ్‌ బచ్చన్‌

గొప్ప వ్యక్తులంతా గొప్ప బ్రాండ్లు కాలేరు. కానీ గొప్ప బ్రాండ్లే చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మిగిలిపోతారు. స్టార్‌డమ్‌, బ్రాండ్‌ వేరువేరనడానికి అమితాబ్‌బచ్చన్‌ని మించిన ఉదాహరణ లేదు. ఆయన సినిమా ఇమేజ్‌కంటే బ్రాండ్‌ విలువే ఎక్కువ. కాబట్టే ఆయన 'ఐశ్వర్యారాయ్‌ మావయ్య'గా చరిత్రలో మిగిలిపోలేదు.

షారుక్‌ఖాన్‌

'నేను ఎస్‌ఆర్‌కే బ్రాండ్‌ కోసం పనిచేస్తాను. మా బాస్‌ ఎప్పుడు ఏం చేయమంటే అప్పుడు ఆ పని చేయడమే నా ఉద్యోగం' అని నిజాయతీగా ఒప్పుకున్న బ్రాండ్‌ బాద్షా షారుక్‌ఖాన్‌. 'అమితాబ్‌బచ్చన్‌ అంతటివాడు' అనిపించుకోవాలన్న తహతహ షారుక్‌లో కనిపిస్తుంది. అందుకేనేవో బ్రాండ్‌ విలువ పెంచుకోడానికి దాదాపు బిగ్‌-బి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. యాంకరింగ్‌ చేశారు. వోడలింగ్‌ చేస్తున్నారు. సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.



సచిన్‌ టెండూల్కర్‌

పర్సనల్‌ బ్రాండింగ్‌కి సంబంధించి ఓ అధ్యయనంలో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌ బ్రాండ్‌ విలువ మీద సర్వే చేశారు. క్రికెట్‌ అనగానే మీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? సచిన్‌ అనగానే కళ్లముందు ఏం మెదులుతుంది? ఎవరు సెంచరీ కొట్టినప్పుడు మీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు?... ఇలాంటి ప్రశ్నలే ఓ డజను దాకా ఉన్నాయి. ఎనభై అయిదు శాతానికిపైగా ప్రజలు క్రికెట్‌ అనగానే 'సచిన్‌' పేరే గుర్తుకొస్తుందని చెప్పారు. అదీ సచిన్‌ బ్రాండ్‌ విలువ! ఆటొక్కటే కాదు, వ్యక్తిగత జీవితం, విలువలు, అభిమానులతో ప్రవర్తించే తీరు... ఇవి కూడా సచిన్‌ బ్రాండింగ్‌లో తోడ్పడ్డాయి. ఎంత డబ్బు ఇస్తామన్నా ఆయన మద్యం, పొగాకు ప్రకటనల్లో నటించనని చెప్పేశారు.

నారాయణమూర్తి

నారాయణమూర్తి ఓ మల్టీబ్రాండ్‌! మామూలుగా ఒక వ్యక్తికి ఒకే బ్రాండ్‌ విలువ ఉంటుంది. నారాయణమూర్తి అలాకాదు. మధ్యతరగతి విజయానికి బ్రాండ్‌, నిజాయతీకి బ్రాండ్‌, మేనేజ్‌మెంట్‌ విలువలకు బ్రాండ్‌, మేధస్సుకు బ్రాండ్‌. కాబట్టే, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 'షాడో ఎ సి.ఇ.ఒ.' పేరుతో నిర్వహించిన వేలంపాటలో... అత్యధికశాతం విద్యార్థులు ఇన్ఫోసిస్‌ పెద్దమనిషికే ఓటేశారు.

బాబా రామ్‌దేవ్‌

ఈతరానికి యోగా అంటే రామ్‌దేవ్‌ బాబా పేరే తెలుసు. యోగసూత్రాల్ని పతంజలి మహర్షి రాశాడని చెప్పినా ఎవరూ నమ్మేట్టులేరు. అంతగా బలపడిపోయింది రామ్‌దేవ్‌ బ్రాండ్‌ విలువ. దాన్ని పెంచిపెద్దచేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు తక్కువేం కాదు. ఆ యోగాగురువులో గొప్ప బ్రాండింగ్‌ గురూ ఉన్నాడు. తెల్లవారుజాము టీవీ షోలతో ఆయన బ్రాండింగ్‌ అమాంతంగా పెరిగిపోయింది. తన ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి బహుళజాతి సంస్థల ఉత్పత్తుల మీద యుద్ధం ప్రకటించారు. దేశవ్యాప్త పర్యటనలూ సంచలన ప్రకటనలూ బ్రాండింగ్‌లో భాగమే.

'బ్రాండింగ్‌' సాహిత్యం

'సెల్ఫ్‌ బ్రాండింగ్‌' అన్నమాటను ఇప్పుడిప్పుడే విరివిగా వాడుతున్నారు కానీ, వ్యక్తిత్వ వికాస సాహిత్య పితామహుడు డేల్‌ కార్నెగీ కాలం నుంచీ ఉన్న భావనే ఇది. కాకపోతే, ఆ పెద్దమనిషి ఎక్కడా 'బ్రాండింగ్‌' అన్న మాట వాడలేదు. పదేళ్ల క్రితం... టామ్‌ పీటర్స్‌ రాసిన 'బ్రాండ్‌ కాల్డ్‌ యూ' వ్యాసం ఈ విషయంలో కొత్త చర్చకు అవకాశం కల్పించింది. అప్పట్నుంచీ సెల్ఫ్‌ బ్రాండింగ్‌ మీద బోలెడంత సాహిత్యం వచ్చింది. బ్రాండ్‌ కాల్డ్‌ యు (పీటర్‌ మాంటోయో), మేనేజింగ్‌ బ్రాండ్‌ యు (జెర్రీ ఎస్‌ విల్సన్‌), బీ యువర్‌ ఓన్‌ బ్రాండ్‌ (డేవిడ్‌మెక్‌), మి 2.0: బిల్డ్‌ ఎ పవర్‌ఫుల్‌ బ్రాండ్‌ టు ఎఛీవ్‌ యువర్‌ సక్సెస్‌ (డాన్‌ స్కాబెల్‌)... తదితర పుస్తకాలు పాఠకాదరణ పొందాయి. సదస్సులూ సెమినార్లూ బ్లాగు చర్చలూ చురుగ్గా సాగుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలూ ఉన్నాయి. నీ బాధ్యతలన్నీ పక్కనపెట్టి బాకా ఊదుకోవడమే అసలైన పని అంటూ తప్పుదోవపట్టిస్తోందీ సాహిత్యమని దుమ్మెత్తిపోస్తున్నవారూ ఉన్నారు.

(ఈనాడు, ౨౫:౧౦:౨౦౦౯)

if unable to read please click on http://ammasrinivas4u.blogspot.com/2009/11/blog-post.html



Love all - Serve all



S.Srinivasa Prasad Rao

9177999263



<http://ammasocialwelfareassociation.blogspot.com/>

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070