Wednesday, October 28, 2009

తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం

తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం




మనసు భావాలని పంచుకోవటానికి బ్లాగు ఓ చక్కని వేదిక, ఇది మహిళల విషయంలో మరింత నిజం కూడా. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో మహిళల బ్లాగులు ఓ విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కథలు, కవితలు, సమీక్షలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, గేయాలు, రాజకీయాలు, అంతరంగాలు, స్వగతాలు, చలోక్తులు, విశ్లేషణలు, విమర్శలు, ముగ్గులు, వంటలు, కొండకచో ముఖాముఖీలు----ఒక్కటేమిటి..... పొడుపు కథలనుండి......అన్నమయ్య పదాల వరకు బ్లాగుల్లో మహిళలు స్పృశించని అంశం లేదు, అందరి గురించి అన్నిటి గురించి వ్రాసేస్తున్నారు.

తెలుగులో మహిళా బ్లాగులు 2005 లో మొదలయ్యాయి. మొదటగా వచ్చింది ఇందు భార్గవి ది అని చెప్పవచ్చు. ఈమెను ఆది బ్లాగరిత అనవచ్చేమో. ఇందు భార్గవి ఇంగ్లీషులో 2004లోనే మొదలుపెట్టినా తెలుగులో 2005 ఏప్రియల్‌లో వ్రాయటం మొదలుపెట్టారు. తను తెలుగులో వ్రాసింది చాలా తక్కువే, ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీషులోనే వ్రాస్తున్నట్లున్నారు. తరువాత అభిసారిక . అభిసారిక కూడా మధ్యలో చాలా రోజులు కనపడలేదు, మరల తాజాగా 2008 నవంబరు నుండి వ్రాయటం మొదలుపెట్టారు. ఈమె పాత టపాలయితే ఏవీ ఇప్పుడు లేవు. తరువాత శైలజ అంగర, స్వాతికుమారి, సౌమ్య, రాధిక, లలిత, అమూల్య లాంటి వాళ్లు మొదలుపెట్టారు. వీరిని తొలితరం తెలుగు మహిళా బ్లాగర్లగా చెప్పుకోవచ్చు. వీరిలో ప్రస్తుతం సౌమ్య, రాధిక మాత్రమే తరుచుగా వ్రాస్తున్నారు. శైలజ అంగర మొదలుపెట్టటం ఐదు బ్లాగులు మొదలుపెట్టినా ఎక్కువగా వ్రాయటం లేదు. లలిత గారయితే తన బ్లాగుని పూర్తిగా మూసివేసారు. తను ప్రస్తుతం తెలుగు పిల్లల కోసం ఓ వెబ్ సైటుని నడుపుతున్నారు. అమూల్య కూడా ప్రస్తుతం వ్రాయటం లేదు. స్వాతికుమారి గారు తన బ్లాగుకి కొద్ది రోజులు విరామమిచ్చినట్లున్నారు.

2007 వరకు కాస్త నత్త నడక నడిచిన మహిళా బ్లాగులు 2007....2008 వచ్చేటప్పటికి పరుగు అందుకున్నాయి. విభిన్న రంగాల నుండి వచ్చిన వారు--గృహిణులు, రచయిత్రులు, కవయిత్రులు, ఉద్యోగినులు, స్త్రీవాదులు, ఎందరెందరో బ్లాగులు మొదలుపెట్టారు.

నిడదవోలు మాలతి, స్వాతి శ్రీపాద, శ్రీవల్లీ రాధిక, రమ్య లాంటి రచయిత్రులు, సత్యవతి, కల్పన రెంటాల, కొండేపూడి నిర్మల లాంటి స్త్రీవాదులు బ్లాగులు మొదలుపెట్టిన వారిలో ఉన్నారు.

అందరిలోకి చెప్పుకోవలసింది ఒంటిచేత్తో అవలీలగా ఏడు బ్లాగులు వ్రాస్తున్న జ్యోతి గారినే. ఒక సామాన్య గృహిణి అసామాన్య బ్లాగరుగా మారి సాధించిన విజయం ఇది. తనని స్ఫూర్తిగా తీసుకుని బ్లాగులు మొదలుపెట్టిన వారు ఎందరో. తన ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే బ్లాగులు వ్రాయమని ప్రోత్సహించటమే కాదు, దానికి కావలసిన సాంకేతిక సహాయం కూడా అందిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరు నుండి తమ భావాలని పంచుకుంటున్న మహిళా బ్లాగర్లు కూడా వున్నారు

కొన్ని మహిళా బ్లాగుల గురించిన పరిచయం కింది టపాలలో చూడవచ్చు.
http://vareesh.blogspot.com/2008/09/blog-post_10.html
http://vareesh.blogspot.com/2008/09/blog-post_21.html

తెలుగులో తొలి మహిళా బ్లాగుల గురించి వివరాలు అందించిన తాడేపల్లి గారికి, సి.బి.రావు గారికి ధన్యవాదాలు.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070