ఈ నగరానికి దూరంగా .....మా ఊరికి దగ్గరగా
ఓ వర్షాకాలం సాయంత్రం
హోరు వాన.......చుట్టూ నీటితో నిండిన పొలాలు...
కనుచూపుమేరా పొలాలు.....చుట్టూ నీరే తప్ప ఇంకో ప్రాణి కన్పించని ప్రదేశం..
అక్కడక్కడా ఆ నీటిలోనుండి తొంగి చూస్తున్న అప్పుడే నాటిన చిన్ని చిన్ని వరి మొలకలు
ఆ పొలాల మధ్యనుండి ఓ తారు రోడ్డు
ఆ రోడ్డు మీద 80-90 కిలోమీటర్ల స్పీడులో వెళ్లే కారులో నేను
రోడ్డుకి ఇరువైపులా వర్షపు లయకు తాళం వేస్తూ తలలూపుతున్న చెట్లు
రోడ్డు మీద సుడులుగా ప్రవహించే నీరు.....కారు వేగానికి ఆ నీరంతా ఎగసి కారుని ముంచేస్తుంటే...
ఓహ్.. ఆ అనుభవం మాటల్లో వర్ణించలేనిది.
మొన్న రెండు రోజుల వర్షం రైతులకి ఎంతటి ఊరటను ఇచ్చిందో నాకు అంతకు రెట్టింపు అనుభూతిని మిగిల్చింది. మన ఇంటి బాల్కనీలోనో, కిటికీ పక్కనో కూర్చుని ఏ మిరపకాయ బజ్జీలో పకోడీలో తింటూ వర్షాన్ని చూస్తూ... వింటూ అనుభవించవచ్చు....వర్షంలో తడుస్తూ అనుభవించవచ్చు.....దేని అనుభూతి దానిదే....కానీ పంటపొలాల మీద ప్రకృతితో పాటు ఉంటూ వర్షాన్ని అనుభవించటం ఉందే అది మాటలలో వర్ణించలేనిది.
ఇంతకుముందు చాలాసార్లు అనుకునో అనుకోకుండానో వర్షంలో తడిచాను, వర్షాన్ని అనుభవించాను. చిన్నప్పుడు బడినుండి కావాలని తడుస్తూ ఇంటికొచ్చిన రోజులున్నాయి. ఊటీలో, కొడైకెనాల్‌లో వర్షంలో తడుస్తూ తిరుగాడిన అనుభూతులున్నాయి, కానీ ఆ అనుభూతులన్నిటినీ మించిన అనుభూతి మొన్నటి సాయంత్రం వర్షంలో కాకుమాను నుండి మా ఊరు చేసిన ప్రయాణం. ఈ జన్మకిది చాలు అనిపించేంతటి అనుభూతి. అసలు ఒక్క రోజులో ఎంత మార్పో. ముందు రోజు చూసిన పొలాలేనా ఇవి అనిపించేంతటి మార్పు.
ఆగష్టు 14, 2009 శుక్రవారం సాయంత్రం హైదరాబాదు నుండి గుంటూరు ప్రయాణం.
దారి పొడవునా ఈ పాటికి సగం నాట్లు అయిపోయి పచ్చపచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీట్లువారి ఎండిపోయిన గొంతులతో ఓ వాన చుక్క కోసం చకోరపక్షిలా ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముందురోజు నాలుగు చినుకులు పడ్డా అవి పొలాలు గొంతులు తడుపుకోవాటానికి కూడా సరిపోయినట్లు లేవు. మధ్యలో నల్లగొండ దగ్గర అడుగంటా ఎండిపోయిన కృష్ణమ్మని చూస్తే రైతన్నకి ఎన్నాళ్లీ వెతలు అన్న దిగులు. చేతిలో పుస్తకం ఉన్నా కళ్ళు అక్షరాల వెంట పరుగు తీయటం మానేసి బయట పొలాల వెంట పరుగుతీసాయి.
సాయంత్రం ఆరు అయ్యేటప్పటికి ఒక్కసారిగా చల్లపడ్డ వాతావరణం...సత్తెనపల్లి చేరుతూ ఉండగా టప్..టప్ మని చేతిమీద ఓ రెండు చినుకులు....చినుకులా రాలి....నదులుగా సాగి....వరదలై పోయి....అని పాడుకుంటుండగా గుంటూరు వచ్చేసింది..అప్పటికి సన్నటి జల్లుగా మారిన వాన రాత్రి పదయ్యేటప్పటికి జోరందుకుంది. ఆ రాత్రి పంటచేలు కరువుతీరా కడుపు నిండా నీళ్లు తాగాయి.
ఆగష్టు 15, 2009 శనివారం ఉదయం గుంటూరు నుండి కాకుమాను ప్రయాణం.
ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఓ భారీ వర్షం పడి వెలిసాక ఆకాశాన్ని చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమే. . దీన్లోనుండేనా ఇప్పటిదాకా ఇన్ని నీళ్లు వర్షించింది అనిపిస్తుంది. ఏమీ తెలియని నంగనాచిలా ఎంత మౌనంగా ఉంటుందో!
రాత్రిపడ్డ వానతో దాహం తీర్చుకున్న పొలాల్ని చూస్తే నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా అనిపించింది! నీటితో కళకళలాడుతున్న పొలాలు. ఆ పొలాల్లో బురద నేను సిద్దం ఇక మీ ఇష్టం నాట్లు వేసుకోండంటూ తళతళలాడుతూ మెరిసిపోతూ మురిపిస్తుంది .
శనివారం మధ్యాహ్నం నుండి మళ్లీ భారీ వర్షం. ఆ వర్షం లోనే కాకుమాను నుండి మా ఊరు ప్రయాణం. మధ్యలో రేటూరు నుండి గోపాపురం వరకు చేలమధ్య నుండి రోడ్డు వెళ్తుంది. ఆ జోరు వానలో నిండా మునిగిన పొలాల మధ్య రయ్యిన కారులో వెళ్తుంటే ఎంత అద్భుతం అనిపించిందో! మాటలకందని అనుభూతి అది!
పాలు తాగే పసివాడు బొజ్జ నిండాక పాలు నోట్లోనుండి ఊసేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటాడు, అచ్చంగా అలానే అనిపించింది ఆ నిమిషంలో నీట మునిగిన పొలాలని చూస్తుంటే!
ఏదేమైనా బీటలు వారిన పొలాల్ని, ఎండిపోతున్న నారుమడుల్ని చూసుకుని గుండెల్లో బాధని కళ్లల్లో నిలుపుకుని వర్షం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న రైతులకి కాస్తంత ఊరట ఈ వర్షాలు. ముమ్మరంగా నాట్లు మొదలయ్యాయి. ఆ వర్షంలో తడుస్తూనే ఒక పక్క నారు పీకేవాళ్లు, ఇంకొక పక్క నాటు వేసేవాళ్లు, పల్లెల హడావుడీ అంతా పొలాల పైనే ఉంది. నాట్లు వేసేటప్పుడు పొలాల్లో నారు కట్టలు ఎలా విసిరి వేస్తారో ఎప్పుడైనా చూసారా? నిజంగా అది ఒక కళ!
గృహప్రవేశాలు, పెళ్లిళ్లు.... ఈ శుభకార్యాల హడావిడీ ఒకవైపు, నాట్ల హడావిడీ ఇంకొక వైపు. వర్షాల మూలాన ఈ శుభకార్యాలకి ఆటంకం అని ఎవరూ విసుక్కోలేదు. అమ్మయ్య ఇన్నాళ్టికి ఓ మంచి వర్షం పడింది ఇక నాట్లు మొదలుపెట్టవచ్చు అని అందరూ ఆనందించేవాళ్లే.
ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా
No comments:
Post a Comment