Wednesday, October 28, 2009

ఆడ మెదళ్ళు - మగ మెదళ్ళు



ఇంకా పెద్దవా? బలమైనవా? వేగవంతమైనవా? ఆడ మెదళ్ళకి, మగ మెదళ్ళకి మధ్య నిజంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలకే కాదు సామాన్యులకి కూడా ఆసక్తి ఉంటుంది. స్త్రీలకి, పురుషులకి మధ్య ప్రవృత్తిలో తేడా ఉంటుంది కనుక, ఆ తేడా మెదడు నిర్మాణంలోను, క్రియలలోను కూడా ప్రతిబింబిస్తుందా? మరి తేడాలేమిటి? మెదడులో ఏ భాగాల్లో ఆ తేడాలు కనిపిస్తాయి?


కొన్ని వందల ఏళ్ళుగా స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి అన్వేషిస్తూ వచ్చారు మనుషులు. తొలి దశలలో జరిగిన కొన్ని పరిశోధనలలో స్త్రీ మెదళ్ళు కొంచెం చిన్నవి అని తెలియడంతో, ఆ విషయాన్ని పురుషాధిక్యతకి సమర్థింపుగా వాడుకోవడం జరిగింది. అయితే ఆ "సమర్థన" అంత హేతుబద్ధమైనది కాదని ముందు ముందు మీరే చూస్తారు. స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి నేటికీ గొప్ప వివాదం చెలరేగుతోంది. మెదడు నిర్మాణ పరంగానే కాదు, మెదడు క్రియల పరంగా మెదళ్ళలో ఈ తేడాలకి అర్థం ఏమిటి?

ఎదిగే పిండంలో ఉండే హార్మోన్ల మీద ఆ పిండం యొక్క మెదడు ఆడ మెదడు అవుతుందా, మగ మెదడు అవుతుందా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. ఆడ, మగ మెదళ్ళ మధ్య తేడాలని గమనించే అధ్యయనాలు ఈ కింది లక్షణాల మీద, లేదా భాగాల మీద దృష్టి సారించాయి.

1. మెదడు పరిమాణం
2. కార్పస్ కల్లోసం
3. హైపోథాలమస్


మెదడు పరిమాణంలో తేడాలు?

పుట్టినప్పుడు ఆడపిల్ల మెదడు కన్నా, మగపిల్లవాడి మెదడు పెద్దగా ఉంటుందని అన్ని అధ్యయనాలు ఒప్పుకుంటున్నా యి. పుట్టుకతో సగటు మగ పిల్లల మెదడు, ఆడపిల్ల మెదడు కన్నా 12-20% పెద్దగా ఉంటుంది. మగ పిల్లల తలల చుట్టు కొలత కూడా కాస్త పెద్దగానే (2%) ఉంటుంది. కాని శరీరం బరువుకి, మెదడు బరువుకి మధ్య నిష్ప్తత్తి దృష్టితో చూస్తే మగపిల్లలకి, ఆడపిల్లలకి మధ్య పెద్దగా తేడాలేదు. అంటే ఒకే బరువు ఉన్న ఆడపిల్ల, మగపిల్లల మెదళ్ళ బరువు కూడా ఒకటే అవుతుంది అన్నమాట.

అదే విధంగా ఎదిగిన వారిలో కూడా, పురుషుల సగటు మెదడు బరువు స్త్రీల సగటు మెదడు బరువు కన్నా 12% ఎక్కువ ఉంటుంది. అయితే పురుషుల బరువు సగటున స్త్రీల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది అన్న విషయం మరచిపోకూడదు. పైగా మెదడు బరువుకి, తెలివితేటలకి మధ్య ఖచ్చితమైన సంబంధం కూడా ఏమీ లేదు. ప్రవర్తనలో కూడా స్త్రీలకి, పురుషులకి మధ్య కొన్ని తేడాలు గమనించబడ్డాయి. ఉదాహరణకి కొన్ని భాషా సంబంధిత శక్తులలో స్త్రీలదే పై చేయి అని తెలిసింది. అదే విధంగా దూరం, దిక్కులు మొదలైన స్థానానికి సంబంధించిన సామర్థ్యాలలో పురుషులు ఆధిక్యులు. ప్రవృత్తిలో ఈ తేడాలని వివరించడానికి కుడి ఎడమ అర్థగోళాల మధ్య తేడాలు ఎత్తి చూపడానికి ప్రయత్నించారు కొందరు. అయితే అలాంటి అధ్యయనాలలో స్త్రీ పురుషుల మధ్య బహు కొద్దిపాటి తేడాలు మాత్రమే కనిపించాయి. నిజానికి తేడాల కన్నా పోలికలే ఎక్కువగా కనిపించాయి.

-- డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070