ఘర్మజలం
- బులుసు-జీ-ప్రకాష్
శ్రీకృష్ణుని వద్దకు కుచేలుడు వెళ్లినపుడు ''ఇక్కడికి నువ్వు వస్తున్నప్పుడు నా మీద భక్తికొద్దీ ఏదో కానుక తెచ్చి ఉంటావు. అది కొంచెమైనాసరే, పదివేలుగా అంగీకరిస్తాను. భక్తి హీనుడై, నీచవర్తనుడైన దుష్టాత్ముడు మేరుపర్వత సమానమైన పదార్థం ఇచ్చినా అది నాకు సమ్మతం కాదు'' అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ విషయాన్నే భగవద్గీత నవమాధ్యాయంలో ధ్రువీకరిస్తాడు.
'పత్రం పుష్పం ఫలం తోయం
యోమే భక్త్యా ప్రయచ్ఛతి
త దహం భక్త్యుపహృతం
అశ్నామి ప్రయతాత్మనః'
''శుద్ధాంతరంగులైన వారు భక్తితో, ఆకుని, పువ్వుని, పండుని, నీటిని- వీటిలో ఏ ఒక్కటి సమర్పించినా, నేను తప్పకుండా స్వీకరిస్తాను''
సిక్కు మతాచార్యుడు నానక్ దేవ్ తన శిష్యుల కోరిక మేరకు ఒక గ్రామం వెళతారు. ఆ గ్రామంలో ధనవంతులెక్కువ, బీదవాళ్లు తక్కువ. నానక్ గురుదేవులు ఆ గ్రామంలో అడుగు పెట్టగానే అందరూ తమ ఇంటికి దయచేయండంటే తమ ఇంటికి దయచేయండని స్వాగతం చెబుతారు. ఊరంతా తిరిగితిరిగి నానక్ దేవులు ఒక నిరుపేద ఇంట్లో భోజనం చేస్తారు. ఆ ఊళ్లో అత్యధిక ధనవంతుడు ''ఇదేమి విడ్డూరం స్వామీ! మేమెవ్వరం పిలిచినా రాని తమరు ఒక నిరుపేద ఇంట్లో, అందునా ఒక పూరిగుడిసెలో భోజనం చేస్తారా?'' అని ప్రశ్నిస్తాడు.
''సరే, మీ ఇంటికి వస్తున్నా పద!'' అని ఆ ధనవంతుని ఇంటికి నానక్‌దేవ్ వెళతారు. ఆ ధనవంతుని ఇంట్లోని కొద్ది ఇసుకను తీసి పిండుతారు. అందులోనుంచి రక్తపు బొట్లు పడతాయి. ''చూశావా? నీ ఆర్జన అక్రమమైనది. అడ్డదార్లు తొక్కి పేదల రక్తాన్ని పిండి సంపాదించినది!'' అంటూ ఆయన బీదవాని ఇంటికి తీసుకెళతారు ఈ ధనికుణ్ని. ఆ బీదవాని ఇంట్లో ఇసుక పిండుతారు. అందులోనుంచి చెమటబొట్లు రాల్తాయి. అంటే ఆ బీదవాడు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం అది! అది చూసి ధనవంతుడు సిగ్గుతో తల దించుకుంటాడు.
'కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన'
అనే శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం చెమటోడ్చి కష్టించి పని చేసే శ్రమజీవులు తమ కష్టఫలాన్ని భగవంతునికి సమర్పిస్తే ఆ 'ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు' ఒకడున్నాడు.
ఆతడే శ్రీకృష్ణపరమాత్మ!
No comments:
Post a Comment