Friday, June 26, 2009

అందుకనే నాకనిపిస్తుంది

జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు....ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే.

కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ జీవితం ఏమాత్రం వడ్డించిన విస్తరిలా ఉండదు. తమ తప్పిదాలవల్లో, ఇతరులు చేసిన ద్రోహాలవల్లో కష్టాల పాలౌతుంటారు. ఐతే అవేవీ వారిని చీకాకు పెట్టవు. వాళ్ళల్లోని ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. జీవితాన్ని ఓ ఊరేగింపులా సాగించేస్తుంటారు. ఇది ఎలా సాధ్యం ? కష్టాలనన్నింటినీ అంత సులువుగా మర్చిపోవచ్చునా ?

అలాంటివాళ్ళను దగ్గరనుండి చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంతే. కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవడం సాధ్యమేనని. సులువు కూడా అని. ఆ ధైర్యం వేరే ఎక్కడినుండో కాదు మనలో నుండే రావాలని.

బాగా పరిశీలించి చూస్తే ముప్పాతిక భాగం సమస్యలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమూ బాధ్యులమై ఉంటాము. కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా పరిస్థితులపైనా, పరిసరాలపైనా, తోటి వ్యక్తులపైనా నెట్టేస్తుంటాము. విజయాన్ని అనుభవిస్తే కలిగేంత ఆనందం వైఫల్యంలో ఉండదు. అందుచేతనే మన తప్పిదాలను ఒప్పుకొనే మానసిక ధైర్యాన్ని చాలామంది కోల్పోతుంటారు. తమ బలహీనతను కప్పి పుచ్చుకొనే తొందరలో మాట తూలడం, సమ్యమనం కోల్పోవడం, ఇతరుల మనసుల్ని గాయపరచడం జరిగిపోతాయి.


అందుకనే నాకనిపిస్తుంది.....మనల్ని మనం తెలుసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనదని. రోజులో ఓ పదినిముషాల పాటు మన చర్యల్ని, మాటల్ని, ఆలోచనల్ని నిష్పక్షపాతంగా బేరీజు వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోగలిగితే చాలా వరకు చిన్న చిన్న చీకాకుల్ని దూరం చేసుకోవచ్చు.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070