Thursday, June 25, 2009

మందార మకరందాలు

"మందార మకరందాలు " ... అనే పదప్రయోగం చెవుల పడగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేది పోతన రాసిన సుప్రసిద్ధ పద్యం " మందార మకరంద మాధుర్యమ్మున దేలు మధుపమ్ము".. అలాగే పోతన కవిత్వాన్ని సంక్షిప్తంగా వివరించమంటే మందార మకరంద మాధుర్యం అనక తప్పదు కదా. అంతటి మధురమైన కవిత్వం అని పోతన భాగవతం చదివిన వారెవరైనా ఒప్పుకోక తప్పదేమో. అందుకే నేను ఈ మధ్యే చదవడం మొదలుపెట్టిన పోతన భాగవతంలోని కొన్ని అందమైన పద్యాలను నాకు అనువైన రీతిలో వివరించడానికి చేసే చిన్న ప్రయత్నానికి మందార మకరందాలు అని నామకరణం చేస్తున్నాను.

భక్తికి మారుపేరుగా భాగవతాన్ని చెప్పుకుంటారు. దానికి కారణం అందులో ఉన్న భక్తి కథలే కాదు, బమ్మెర పోతన మనకందించిన కమ్మని కవిత్వం. కవిత్వం పోతనకి ఒక ముక్తి సాధనం. అది జ్ఞానం వల్ల గాని మనకు లభించదు. అందరికీ అందుబాటులో ఉండేది భక్తి. ఈ మధురాతి మధురమైన ఈ భక్తి మార్గంలో కైవల్యం సాధించుకోవడం చాలా సులువు అనే మహోన్నతమైన దారి మనకు చూపించాడు పోతన.

ముందుగా కొన్ని పరిచయ వాక్యాలు. ఆంధ్రమహాభాగవతం పన్నెండు స్కందాలలొ రాయబడిన మహాపురాణం. రాసింది నలుగురు కవులు, భాగవత రచనలో బమ్మెర పోతన ముఖ్యుడు. భక్తిరస ఘట్టాలన్నీ ఆయన గంటం నుండి జాలువారినవే. మరి కొన్ని భాగాలను మరో ముగ్గురు కవులు అనువదించారు. వారిలో వెలిగందల నారయ ముఖ్యుడు. ఏకాదశ ద్వాదశ స్కందాలు పూర్తిగా, ద్వితీయ దశమోత్తర స్కందాలలో కొంత భాగం ఆయన రచన. పంచమ స్కందం గంగన్న, షష్ట స్కందం సింగన్న తెనిగించారు.



శ్రీ కై వల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లో కర
క్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోకవిలస ద్దృగ్జాలసంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని మొదటి పద్యమిది. నాందీ శ్లోకం అనవచ్చు. ఈ పద్యంలో నమస్సు, కథా సూచనము రెండూ ఉన్నాయి. భాగవతాన్నితెనిగించమని పోతనకు ఆనతిచ్చినవాడు రామభద్రుడు, కాని కృతిని అందుకున్నవాడు నందనందనుడు. అందుకే పోతన ఆ నందకుమారుని అవతార రహస్యాలను ఈ పద్యంలో అందంగా పొందుపరిచారు. '”లోకరక్షైకారంభకు “ డు అనడంలో పరమాత్ముని స్థితికరత్వాన్ని, “ భక్త పాలన కళసంరంభకుడు “ అనడంలో ఆర్తులను ఆదుకునే గుణాన్ని, “ దానవోద్రేక స్తంభకు” డనడంలో హిరణ్యకశిపునివంటి రాక్షసులను అణచివేసే పనితనాన్ని, “కేళీలోల విల సద్దృగ్జాల సంభూతనానాకంజాత భవాండకుంభకు” డనడనంలో సృష్టిలీలను, కేళీ శబ్దం చేత కృష్ణలీలను కూడా ధ్వనింప చేసాడు.

పద్యంలో పదాలతోఆటలాడుతో మహార్ధాన్ని సూచించడం పోతనకు వెన్నతో పెట్టిన విద్య. "డింభకున్" , "ఆరంభకున్", "సమ్రంభకున్", సమ్రంభకున్", స్తంభకున్" "కుంభకున్" అంటూ సమాసాంతంలో అంత్యప్రాసలు కూర్చే వింత విద్య ఇది. దీనివలన లాభమేంటి అంటారా? చెవికి చవులూరించే నాద సుఖం. పదం - అర్ధం పొందిన మధుర పద సమ్మేళనం ఈ పద్యం.

ఈ పద్యంలో పోతన ఆశిస్తున్నది కేవలం కైవల్యం. మన శరీరం ఇంద్రియ విముక్తమైన అత్మ కేవలమైనది. అది పొందే స్థితి కైవల్యం. మహాకవి పోతన కాంక్షించేది కైవల్యమే తప్ప , కాసులు కాదు.

ఇది మొదటి ప్రయత్నం . తప్పులుంటే మన్నించి, సరిదిద్దండి.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070