అలెగ్జాండర్ మూడు కోరికలు
అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.
అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”అని చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారం ఉంది. అందుకనే ఈ సంఘటన అంటే నాకు ఎంతో ఇష్టం.
No comments:
Post a Comment