Friday, September 11, 2009

మనల్ని మనం ప్రేమించుకుందాం..

తల్లిదండ్రులన్నా, బిడ్డలన్నా, తోబుట్టువులన్నా, మనకు ఎనలేని ప్రేమ, అభిమానం! రక్తసంబంధాలే కాదు స్నేహితుల్లో, బంధువుల్లో ఏ ఒక్క కోణం నచ్చినా కల్లాకపటం లేకుండా మానసికంగా దగ్గరైపోతాం. మనిషి జన్మతఃనైజం ప్రేమించడం! ప్రేమతో ఆత్మీయుల మనసుల్లోకి ఒదిగిపోయి నప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం. కేవలం మనుషుల్నే కాదు మనలోని సున్నితత్వాన్ని తట్టిలేపే మొక్కల్నీ, ప్రేమతో పంచనచేరే జంతువుల్నీ అన్నింటినీ ప్రేమిస్తాం. అవును నిజ్జంగా మనకు విశ్వజనీయమైన ప్రేమను అందించే, ప్రేమని ఆస్వాదించే గొప్ప మనసు ఉంది. అంత గొప్ప మనసు ఉండీ ఆ మనసు ఎప్పుడూ ఒంటరిదే! అందర్నీ అక్కున చేర్చుకుంటాం కానీ మనకి మనం ఎప్పుడూ మిగలం. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారూ అంటే తమనితాము ప్రేమించుకునేవారే! నిరంతరం ఇతరుల సంతోషంలో మనం ఆనందాన్ని వెదుక్కుంటాం. వారి మొహంలో ఆశించిన భావం ప్రతిఫలించకపోయినా, వారి మాటల్లో మనం కోరుకున్న భావోద్వేగం ఉట్టిపడకపోయినా మన మనసు నీరుకారిపోతుంది. తల్లి, బిడ్డ, భార్యా, భర్తా, సహోదరులు.. ఇలా మనం ఎవరైతే మన వాళ్లు అనుకుంటామో వారి ప్రతీ కదలికలోనూ అంతరార్థాన్ని ఒడిసిపట్టి విశ్లేషించి మనం అనుకున్న ఫలితం వస్తే సంతృప్తితో కడుపు నింపుకుంటాం. ఇలా ఆత్మీయుల కళ్లల్లో మెరుపుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి చివరకు మనం సాధించేది ఏమిటీ అంటే నిస్పృహ. ఇంతగా ప్రపంచాన్ని ప్రేమించే మనం, ఇంతగా ఎదుటి వ్యక్తి శ్రేయస్కుని కోరుకునే మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన కోసం మన ఆనందం కోసం ఒంటరిగా గడుపుతామా? చుట్టూ మనుషులు లేకపోతే జీవితాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది.



ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది. మనవాళ్లనుకుని ప్రేమని పంచిన వారి నుండి మన ప్రేమకు కనీస గుర్తింపు అయినా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం. మధ్యలో ఏర్పడే ఈ అనుబంధాల చిక్కుముళ్లపై అపేక్ష పెంచుకుని మనసుని మనల్ని మనం గాయపరుచుకుంటూ మనకంటూ మనం మిగల్లేక జీవశ్చవాల్లా ఒంటరి తనం అనుభవించడం ఎంత వరకూ సబబు? మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వారందరూ మనల్నీ అంతే అభిమానిస్తున్నారు అని భ్రమపడతాం. డబ్బు, హోదా, ధైర్యం, ఆరోగ్యం వంటివి ఉన్నంత వరకే మనకి దక్కే గౌరవాలు, ప్రేమలు అన్నీ! ఏ క్షణమైతే ఏ కారణం చేతైనా మనం భౌతిక బలాలను కోల్పోతాయో ఆ క్షణం మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు ఎవరూ ఉండరు. అందుకే మనల్ని మనం ప్రేమించడం అలవర్చుకోవాలి. మనకు మనమే ఉన్నాం. ఎవరూ లేకపోయినా ఈ ప్రపంచంలోకి మనం ఏం చెయ్యడానికి వచ్చామో మన ధర్మాన్ని మనం నిర్వర్తించి వెళ్లగలిగేలా ఒంటరి పోరాటాన్ని సాగించే ధీర్వతం చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుందాం.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070