హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.
వేదానికి నిగమము, శ్రుతి, ఆమ్నాయము అని కూడా పేర్లున్నాయి
- నిగమము - అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము
- శ్రుతి - గురువునుంచి శిష్యుడు వినే దివ్యవాణి
- ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి
ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.
ఋగ్వేదము
ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. స్తుత్యర్థకమైన మంత్రానికి ఋక్కు అని పేరు. మిగిలిన వేదాలలోని చాలా విషయాలు ఋగ్వేదానికి అనుసరణగానో, పునరుక్తిగానో ఉంటాయని చెప్పవచ్చును. ఋగ్వేదంలో 1028 దేవతా స్తుతులున్నాయి. వీటిలో అతి పెద్దది 52 శ్లోకాలు గలది. ఈ స్తోత్రాలన్నింటినీ 10 మండలాలుగా విభజించారు. తత్వ, అలౌకిక విషయాలను వివరించడంవలన పదవ మండలం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొన్నది.
- ఋగ్వేద బ్రాహ్మణాలు: ఐతరేయ, కౌశీతకీ, పైంగి, సాంఖ్యాయన
- ఋగ్వేద ఆరణ్యకాలు: ఐతరేయ, కౌశీతకీ
- ఋగ్వేద ఉపనిషత్తులు: ఐతరేయ, కౌశీతకీ
యజుర్వేదము
యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరు. యజుర్వేదంలో 109 అధ్యాయాలున్నాయి. కాని ప్రధానంగా రెండు ఉపభాగాలున్నాయి.
కృష్ణ యజుర్వేదము (తైత్తిరీయము)
ఇది చాలావరకు గద్యరూపంలో ఉంటుంది. దీనికి క్రియావిధులు ఉంటాయి.
- దీనిలో బ్రాహ్మణాలు: తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు
శుక్ల యజుర్వేదము (వాజసనేయము)
ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వేదం ముఖ్యంగా మాధ్యందిన, కాణ్వ సంప్రదాయాలలో ఉన్నది.
- దీనిలో బ్రాహ్మణాలు:శతపథ
- దీనిలో ఆరణ్యకము, ఉపనిషత్తు: బృహదారణ్యక
సామవేదము
ఇందులో వెయ్యి అధ్యాయాలున్నాయి. నియమ పూర్వకంగా గానం చేసే మంత్రాలకు సామములు అని పేరు. దీనిలో 75 మంత్రాలు తప్ప మిగిలినవన్నీ ఋగ్వేదంలోని 8,9వ మండలాలనుండి తీసికోబడ్డాయి.
సామవిధాన, మంత్ర, ఆర్షేయ, వంశ, దైవతాధ్యాయ, తలవకార, తాండ్య, సంహిత ఉపనిషత్తులు, ఛాందోగ్య, కేనోపనిషత్తులు సామవేదంలోనివే. సామవేదానికి ఆరణ్యకాలు లేవు.
అధర్వణవేదము
ఇందులో 50 అధ్యాయాలున్నాయి. ఈ వేదంలో ముఖ్యంగా ప్రాపంచిక అభ్యుదయానికి అవసరమైన మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. దీనికి ఏ ఆరణ్యకమూ లేదు. గోపథ బ్రాహ్మణము, ముండక, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు ఈ వేదానికి సంబంధించినవే.
వేదముల ఉపవిభాగాలు
ఒక్కొక్కవేదంలోను, మళ్ళీ నాలుగు ఉప విభాగాలున్నాయి. అవి
మంత్ర సంహిత
ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేదసంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. హిందూ తత్వవేత్తలకు పవిత్రము.ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించే వానిని హోత అంటారు. యజుర్వేదసంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. దీనిని అధ్వర్యులు, అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది. సామవేద సంహిత ఉద్గాత్రులచే, అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవస్తుతి. యజ్ఞంలో అధర్వవేద సంహితను చదివే పురోహితుని బ్రహ్మ అంటారు. మిగలిన ముగ్గురు పురోహితులు చదివే మంత్రసంహితలలో దొరలే దోషాలను, యజ్ఞకార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయడానికి అధర్వవేద సంహిత చదువుతారు.
బ్రాహ్మణము
సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే రెండు విభాగాలున్నాయి. అలాగే శుక్లయజుర్వేదంలో శతపథబ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము, మైత్రాయన బ్రాహ్మణము ఉన్నాయి. సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు - తండ్య (పంచవింశ), షడ్వింశ, ఛాందోగ్య, అదభుత, ఆర్షేయ, ఉపనిషత్ బ్రాహ్మణములు. అధర్వణవేదంలోని బ్రాహ్మణమును గోపథ బ్రాహ్మణము అంటారు.
ఆరణ్యకము
ఆరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థం లో ఉన్న వారికి ఆరణ్యకములు ఎక్కువ ఉపయోగకరములు.
ఉపనిషత్తులు
ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కాని వీటిలో 108 మాత్రమే చదవదగ్గవి అని చెబుతారు.
యజ్ఞాలలో వేదమంత్రాలు
ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఐహిక సంపత్తిని, మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు. యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని. ఆ యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులుంటారు.
- హోత: ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడు.
- అధ్వర్యుడు: యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యధావిధిగా నిర్వహించేవాడు.
- ఉద్గాత: సామగీతాలను గానం చేసేవాడు.
- బ్రహ్మ: అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని మొదటినుండి చివరివరకూ పర్యవేక్షించేవాడు.
వేదముల ప్రాముఖ్యత
హిందూమతము నకు, సంస్కృతికి, సంస్కృత భాష కు వేదములు అత్యంతమౌలికమైన ప్రామాణిక సాహిత్యము. దాదాపు అన్ని తత్వములవారు వేదముల ఆధారముగా తమ వాదనను సమర్ధించుకోవడం పరిపాటి. శాక్తేయము, వైష్ణవము,శైవము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - ఇలా ఎన్నో తత్వమార్గాలవారు -తమదే వేదాలకనుగుణంగా ఉన్న మార్గము-- అని వాదించి, తమ తమ తర్కాలను సమర్ధించుకొన్నారు. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదము, ఖగోళము, దైనందిన ఆచారాలు - ఇలా ఎన్నో నిత్యజీవనకార్యాలు వేదాలతో ముడివడి ఉన్నాయి. అయితే బౌద్ధం వంటి సిద్ధాంతాలు మాత్రం వేదాలను పూర్తిగా త్రోసి పుచ్చాయి.
[మార్చు] వేదాంగములు
వేదాంగములు మొత్తం ఆరు
1) శిక్ష
2) వ్యాకరణము
3) ఛందస్సు
4) నిరుక్తము
5) జ్యోతిష్యము
6) కల్పము
[మార్చు] వేద కాలము
చరిత్రకారులు, భాషాశాస్త్రజ్ఞులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన విశేష పరిశోధనల ఆధారముగా ఋగ్వేద భాష, సంస్కృతము, ఋగ్వేద కాలము, ఋగ్వేద స్థానము, ఆర్యులు, ఇండో-ఆర్యులు, ఇండో-యూరోపియనులు మొదలగు విషయములపై నిర్ధారించిన ముఖ్యమగు అంశములు ఇచట క్రోడీకరింపబడినాయి. భవిష్యత్ పరిశోధనల వల్ల ఇందలి అంశములు కొన్ని మార్పులు చెందవచ్చు.
- ఋగ్వేదము తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది.
- ఋగ్వేద ఆర్యులకు, అవెస్త ఆర్యులకు భాష, సంస్కృతి, పురాణ గాథలు, అచారములు, కర్మకాండలు మొదలగు వానిలో చాల సామీప్యము గలదు.
- సంస్కృతానికి, పెక్కు ఇండో-యూరోపియన్ భాషలకు చాల దగ్గరి సంబంధమున్నది. ఈ సారూప్యత ఆచారవ్యవహారములు, గాథలకు కూడ విస్తరిస్తుంది.
- ఆర్యులు, ముఖ్యముగా తొలి ఇండో-యూరోపియనులు అశ్వమును మచ్చిక చేసుకున్నారు.
- ఋగ్వేద ఆర్యులు, అవెస్త ఆర్యులు తమ జీవన శైలిలో ఒక ముఖ్య భాగముగా సోమ (Ephedra) మొక్క ను పరిగణించారు. సోమరసము ఎన్నో విధములుగా ఉపయోగకరము.
- తొలి ఇండో-యూరోపియనుల ఉనికి అశ్వముతో, ఇండో-ఇరానియనుల అవాస స్థానము ఎఫిడ్రా (సోమ) మొక్క దొరకు చోటుతో ముడిపడి ఉన్నాయి. అనగా ఇండో-యూరోపియనులు మధ్య ఆసియా లోని నల్ల సముద్రము, కాస్పియన్ సముద్రము ప్రాంతము నుండి వలస వచ్చారు. మచ్చికైన గుర్రాలు, చక్రములతో వేగముగా చలించు రథాలు వీరికి తోడ్పడ్డాయి. వారిలో ఒక ముఖ్య శాఖ ఇండో-ఇరానియనులు తొలిసారిగా భారత ఉపఖండములోని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టారు.
- క్రీ.పూ. 2000నాటికి వీరు మధ్య ఆసియా నుండి సింధూ నదివరకు చేరారు.
- క్రీ. పూ. 1700ప్రాంతములో ఇండో-ఇరానియనుల ఒక ప్రముఖ శాఖ ఆఫ్ఘనిస్తాన్ (హెల్మాండ్, అర్ఘందాబ్ నదుల మధ్య ప్రాంతము)లో ఋగ్వేద మంత్రములు కూర్చారు.
- వేదకాలములో హెల్మాండ్ నది పేరు సరస్వతి మరియు హరిరుద్ పేరు సరయు. ఈ పేర్లు అన్నియూ ఋగ్వేదము, అవెస్తలలో ఒకటే.
- క్రీ.పూ. 1400 నాటికి వేద గణములు తూర్పు దిశగా మధ్య సింధూ మైదానము చేరారు.
- క్రీ.పూ. 850 నాటికి పంజాబ్ చేరుకున్నారు.
- పిమ్మట ఇనుము వాడకము పెరిగిన నాటికి గంగా మైదానములో జనావాసములు, జనసంఖ్య బహుళమయ్యాయి.
- వందల సంవత్సరాల తరబడి జరిగిన ఈ వలసక్రమములో ఇండో-ఆర్యులు వారి సాహిత్యము, ధార్మికత, అచారములు, సంప్రదాయములతో బాటు ప్రదేశముల పేర్లు, నదుల పేర్లు కొత్త ఆవాసములకు, కొత్త నదులకు ఆపాదించారు.
- పురాతత్వ పరిశొధనల ప్రకారము కూడ భారత దేశ చరిత్ర పశ్చిమము నుండి క్రమముగా తూర్పు దిశగా పయనించి గంగా మైదానములో వ్యాపించి స్థిరపడినది.
1 comment:
I am much impressed and felt this blog is more valuble. It creates much enthusiaism to know more about these subjects. I wiil be much happy if any body sugests some good books
Post a Comment