Tuesday, July 14, 2009

జాతీయాలు-వివరణ

కలగూర గంప , చేట భారతం

కలగూర గంప

కలవేసిన అంటే రకరకాల కూరగాయల గంపను కలగూరగంప అంటారు. కొందరు ఒకే కూరాకునో, ఒకే రకం కాయలనో, పళ్ళనో అమ్ముతారు.మరికొందరు రకరకాల ఆకులూ, కూరలూ, కాయలూ, పళ్ళూ అమ్ముతారు. భిన్న జాతులకు చెందిన కాయగూరలున్న గంప కలగూరగంప. గంప లేకపోయినా కాయకూరల్లేకపోయినా, రకరకాల వస్తువులుంటే కలగూరగంప అనే అంటారు. పదబంధంలో మొదట ఉన్న కల అనేది కలిసేట్లు, కలగాపులగంగా ఉన్న అనే అర్ధం గల విశేషణ పదం ఇది. కలనేత చీరెలో ఒకటికి మించిన రంగుల దారాలు కలిసి ఉంటాయి. కలగాపులగంలో తెల్ల, పచ్చ ఖాద్య, ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అలాగే కలగూరగంపలో భిన్నభావాలు, వస్తువులు ఏవైనా కలిసి ఉండవచ్చు. కాయలూ గంపా మాత్రం ఖండితంగా ఉండనక్కరలేదు.

చేట భారతం

ఈ మాటకు చాటు భారతమనే రూపాంతరం ఉందంటారు కొందరు. కానీ ఆ రెంటికి అర్ధాలు వేరు . చేట తెలుగు మాట. చాటు సంస్కృత పదం. అప్పటికప్పుడు చెప్పిన, నోటిమాటగా చెప్పిన అనే అర్ధాలున్న మాట చాటు(వు). చెరగటానికి వాడే చేట తెలుగు వస్తువు. గ్రంధ ప్రమాణాల వంటివి చూపకుండా భారత కథను చెప్తే అది చాటు భారతం.నిజానికది జాతీయమే కాదు. చేట భారతం వేరు.నాలుగు మాటల్లో సరిపొయ్యే విషయాన్ని తెగ సాగదీసి విపులంగా చెపినా, రాసినా దాన్ని చేట భారతమనే అంటారు. అయితే ఈ మాట ఇటీవల పుట్టిందనటానికి నిదర్శనం ఉంది. దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట, అచ్చు యంత్రాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో ఇప్పటి దినపత్రికల కన్నా కొంచెం చిన్నవైన కాగితాల్లో భారతం ముద్రించారు. అంటే చేటంత పెద్ద కాగితాల మీద అచ్చు వేసారన్నమాట. ఆ గ్రంధాలు ఇప్పటికీ కొన్ని పాతకాలపు గ్రంధాలయాల్లో భద్రంగా ఉన్నాయి. సీస పద్యాన్ని అయిదు పంక్తుల్లో, వృత్తాలను రెండు పంక్తుల్లో, కందం, తేటగీతి, ఆటవెలది వంటి పదాలను ఒకే ఒక పంక్తిలో ముద్రించేవాళ్ళు. ఆ గ్రంధాలను కూర్చుని చదవాల్సిందే. అందువల్ల వాటిని చాలా పెద్దవి అనే అర్ధంలో చేట భారతమన్నారు. విస్తరించి చెప్తే చేట భారతం చెప్పినట్టు అవుతుంది

రచన : బూదరాజు రాధాకృష్ణ

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070