Tuesday, July 14, 2009

ఏడువారాల నగలు ..

ఏడువారాల నగలు ..

పూర్వం రాజకుటుంబానికి చెందిన , మిక్కిలి ధనవంతులైన స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. అవి వారి ఆడంబర ప్రదర్శనకు, గ్రహాల అనుగ్రహమునకు సరిపోయే విధంగా చేయించుకునేవారు. అంటే రోజు కొక గ్రహాన్ననుసరించి ఒకో రకమైన రత్నాభరణాలు ధరించేవారు . వివిధ ఆభరణాలలో జాతి రత్నాలు పరీక్షించి మరీ పొదిగి అద్భుతమైన నగలు తయారు చేసేవారు .అనంతరం నియమ నిష్టలతో పూజలు జరిపి వాటిని శక్తిమంతం చేసి రోజుకో నగ ధరించేవారు. వారంలో ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా చెప్పబడుతుంది. ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నాలతో చేసిన ఆభరణములు ధరిస్తే శుభప్రదం అని అనాదిగా నమ్ముతున్నారు .




రవివారం
ఆదివారం నాడు అధిపతి సూర్యుడు. ఈ రోజు సూర్యుని రంగులో ఉండే కెంపులు పొదిగిన ఆభరణాలు ధరించి , లేత ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించి, తమ కుటుంబమును రక్షించమని సూర్యదేవుని ప్రార్ధిస్తారు



సోమవారం
సోమవారం నాడు అధిపతి చంద్రుడు. ఈ రోజు చంద్రుడి రంగులో ఉండే ముత్యాలు పొదిగిన ఆభరణములు ధరించి చంద్రవర్ణంలో (తెలుపు) ఉండే దుస్తులు ధరించి మానసిక ఆరోగ్యాన్ని, ప్రశాంత జీవనాన్ని కలిగించమని చంద్రుణ్ణి ప్రార్ధిస్తారు.



మంగళవారం
మంగళవారం నాడు అధిపతి అంగారకుడు . ఈ రోజు స్త్రీలు అంగారకుని రంగులో ఉండే పగడపు రంగు వస్త్రాలు ధరించి పగడాలతో చేసిన ఆభరణములతో అలంకరించుకుని శక్తిని ,సౌఖ్యాన్ని ప్రసాదించి , రుణబాధలు లేకుండా చేయమని కుజుడిని ప్రార్దిస్తారు.



బుధవారం
బుధవారం నాడు అధిపతి బుధుడు . ఈ రోజు స్త్రీలు ఆకుపచ్చగా, బుధుడి రంగులో ఉండే ఆకుపచ్చని దుస్తులు ధరించి మరకతం ( పచ్చలు)తో చేసిన ఆభరణములు ధరించి మేధోశక్తిని పెంపొందించి, బుద్ధిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇవ్వమని బుధుడిని వేడుకుంటారు .



గురువారం
గురువారం నాడు అధిపతి గురువు. అతని రంగులో ఉండే లేత పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి కనక పుష్యరాగాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్త్రీలు సంపద, సచ్చీలం పెంపొందాలని గురుడిని ప్రార్దిస్తారు.



శుక్రవారం
శుక్రవారం నాడు అధిపతి శుక్రుడు . ఇతని అనుగ్రహం కోసం తెల్లని రంగులో ఉండే దుస్తులు ధరించి తెల్లని వజ్రాలు పొదిగిన ఆభరణములు ధరించిన స్త్రీలు తమ కుటుంబ జీవనం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని , దాంపత్యం కలకాలం సుఖశాంతులతో వర్దిల్లాలని శుక్రుడిని ప్రార్దిస్తారు .



శనివారం
శనివారం నాడు అధిపతి శని . అతడి శరీరవర్ణమైన నీలం రంగు దుస్తులు ధరించి , నీలంతో చేసిన ఆభరణములు ధరించి తమకు పీడలు , బాధలు లేకుండా చేయమని శనీశ్వరుడిని ప్రార్దిస్తారు.

స్త్రీలు ఇలా గ్రహాలకు సంబంధించిన పూజలు చేసి, తదనుసార జాతి రత్నాభరణములు ధరించడంలో ఆంతర్యం కుటుంబ శ్రేయస్సు మాత్రమే. మనం ధరించే నవరత్నాలు సహజసిద్ధమైనవి ఐతేనే మనకు సరియైన ఫలితం చెకూరుతుంది . ఏడు వారాల నగల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతిష నిపుణులు , రత్న శాస్త్ర నిపుణులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నమ్మకమైన దుకాణములో కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం.

కనీసం ఆరు గ్రహాల స్థితైనా తమ జాతకంలో బావున్నవారు మాత్రమే ఇలా ఏడు రకాల రత్నాలతో ఆభరణాలు తయారుచేయించుకుని ధరించవచ్చు.అలా కాని పక్షంలో మనం కోరుకునే శాంతిసౌభాగ్యాల్ని అవి ప్రసాదించలేకపోవచ్చు. ఉదాహరణకు తమ జాతకంలో కుజస్థితి బాగాలేని స్త్రీలు పగడాలు పొదిగిన నగలు ధరించడం వల్ల వారి భర్తలకు అరిష్టం. లేదా భూమి తగాదాలూ, ఋతుబాధలూ తీవ్రతరమౌతాయి. అలాగే శుక్రుడు యోగించని స్త్రీలు వజ్రాభరణాలు ధరించడం వల్ల దాంపత్యసౌఖ్యలోపం, వ్యభిచార భావాలు, భర్తతో గొడవలు, విడాకులు, సాటి స్త్రీల మూలంగా అశాంతి, వాహనప్రమాదాలు, పొట్టలో ఇబ్బందులు సంప్రాప్తమౌతాయి.జాతకంలో సరిపడని గ్రహాల రత్నాలని ఉంగరంలో పొదిగించి ధరించే పురుషులకు సైతం ఇదే ఫలితం.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070