Sunday, December 13, 2009

శ్రీశ్రీ – ‘అనంతం’



ఈ శతాబ్దం నాది” అని శ్రీశ్రీ చేసిన ప్రకvj13_sri-sriటన ఎంత ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే. ఈ ప్రకటన కనిపించేది ఆయన ఆత్మకథ ‘అనంతం’ లో. ‘ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల’ అని శ్రీశ్రీ ప్రకటించిన ‘అనంతం’ ఓ క్రమ పద్ధతిలో రాసిన పుస్తకం కాదు. తన జీవితాన్ని గురించి వివిధ పత్రికలలో రాసిన అనేక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కవిగా, కమ్యూనిస్టుగా, సినిమా రచయితగా ప్రపంచానికి తెలిసిన శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి, కమ్యూనిజాన్ని గురించీ, సినిమాల గురించీ తన అభిప్రాయాలను చాలా సూటిగా వ్యక్త పరిచారు.
విశాఖపట్నం లో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన శ్రీరంగం శ్రీనివాసరావు బాల్యం చాలా వైభవంగా గడిచింది. సవతి తల్లి సుభద్రమ్మ కన్నతల్లిని మించి పెంచింది. తండ్రి వెంకట రమణయ్య కొడుకుని స్నేహితుడిగా చూశాడు. “నా పద్దెనిమిదో ఏట మొదటి సారి సిగరెట్ తాగాను. సిగార్స్.. నాన్నే కొనిచ్చారు..” ఈ వాక్యాన్ని బట్టి ఆ తండ్రి కొడుకుల అనుబంధాని అర్ధం చేసుకోవచ్చు. శ్రీశ్రీ పెళ్ళయిన కొత్తలో భార్యని విడిచి కృష్ణశాస్త్రి వెంట వారం రోజులు విజయనగరంలో గడిపినప్పుడు మాత్రం సున్నితంగా మందలించారు రమణయ్య.
పుట్టిన ఊరిపట్ల తన మమకారాన్ని ఏమాత్రం దాచుకోలేదు శ్రీశ్రీ. ఎగసిపడే సముద్ర కెరటాలు తనలో కవితావేశాన్ని ఎలా రగిల్చాయో, పెరుగుతున్న పారిశ్రామికీకరణ తనలో కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపిందో వివరించారు. శ్రీశ్రీ కి తొలిసారి ‘బయోస్కోప్’ పరిచయమైంది విశాఖ లోనే. సినిమాల పరంగా ఇరవయ్యో శతాబ్దం చార్లీ చాప్లిన్ ది అన్నారు. అంతర్జాతీయ సినిమాల గురించి విస్తారమైన నోట్సు లభిస్తుంది ఈ పుస్తకంలో. తెలుగు సినిమా ఎదగడం లేదన్న అభిప్రాయం చాలాచోట్ల ప్రకటించారు.

బాల్యంలో యెంతో వైభవం అనుభవించిన శ్రీశ్రీ యవ్వనంలో దరిద్రాన్ని అనుభవించారు. జీవిక కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. కవిత్వాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. సినిమాలకు రాయడం కేవలం బ్రతుకు తెరువు కోసమే అన్నారు. “అనంతం లో మోతాదును మించి సెక్సును ప్రవేశ పెట్టానని నేననుకోను” అన్నారు కానీ, ఇందుకు సంబంధించిన విషయాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అయినా ‘ఆత్మకథ’ లో ‘మోతాదు’ ను నిర్ణయించగలిగేది ఎవరు?
రమణమ్మ తో బాల్య వివాహం, సరోజ తో ద్వితీయ వివాహం లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు, అరసం పుట్టుక, ఎదుగుదల, విరసం పుట్టుకకి దారితీసిన పరిస్థితులనూ సవివరంగా రాశారు. కృష్ణశాస్త్రి పట్ల అభిమానాన్నీ, విశ్వనాథ రచనా శైలి పట్ల తన అభిప్రాయాలనూ సూటిగా ప్రకటించారు. మిత్రుడు కొంపెల్ల జనార్ధన రావు గురించి సుదీర్ఘంగా వివరించారు. తన తండ్రి తర్వాత గురు స్థానం ఇచ్చిన రెండో వ్యక్తి అబ్బూరి రామకృష్ణా రావు కోసం ఓ అధ్యాయం కేటాయించారు.

కవిత్వాన్ని గురించి రాసినంత వివరంగానూ, తన విదేశీ పర్యటనల గురించీ రాశారు శ్రీశ్రీ. రష్యా ఆయనని ఎంతగానో ఆకట్టుకుంది. భారత దేశాన్ని ఎప్పటికైనా రష్యా లా చూడాలన్నది ఆయన ఆకాంక్ష. చైనా వెళ్ళే అవకాశం ‘రాజకీయ కారణాల’ వాళ్ళ మిస్ కావడం మొదలు, స్టాక్ హోం, మాస్కో పర్యటనలు, ఆయా దేశాల్లో తనకి నచ్చిన సంగతులను కళ్ళకు కట్టినట్టు రాశారు. విరసం లో సమస్యలు, తనపై వచ్చిన ఆరోపణలు, వాటికి శ్రీశ్రీ ఇచ్చిన వివరణలతో ముగుస్తుంది ఈ పుస్తకం.

‘అనంతం’ అన్న పేరు ఈ పుస్తకానికి సరిగ్గా సరిపోతుంది. ప్రారంభం, ముగింపు లేని రచన ఇది. కొన్ని కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ వచ్చి కొంచం విసుగు కలిగిస్తాయి. ఓ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కమ్యూనిజం వైపు ఆకర్షితుడు కావడానికి దారి తీసిన పరిస్థితులేమిటో శ్రీశ్రీ నోటి నుంచి వినలేము. పుస్తకం పూర్తీ చేశాక మొత్తం సంఘటనలని ఓ క్రమంలో పేర్చుకున్నా, చాలా చోట్ల ఖాళీలు కనిపిస్తాయి. ఈ ఆత్మకథలో ఎదుటివారి — ముఖ్యంగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నవారి — వ్యక్తిగత విషయాలను రాయడం నాకు కొరుకుడు పడలేదు. తనకు సంబంధించిన విషయాలను చెప్పేటప్పుడు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించిన శ్రీశ్రీ, ఎదుటి వారని కొన్ని చోట్ల చిన్నబుచ్చారనిపిస్తుంది.

కేవలం శ్రీశ్రీ ని గురించే కాక, గడిచిన శతాబ్దం లో రాష్ట్రంలోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన పరిణామాలను గురించి తెలుసుకోవాలనే వారికి ఉపయోగపడే ‘అనంతం’ ని విశాలాంధ్ర ప్రచురించింది. అభ్యుదయ సాహిత్యం

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070