Monday, December 28, 2009

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి




ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

పండగ ఆచరించు విధానం

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.

పండుగ ప్రాశస్త్యం
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070