Saturday, November 14, 2009

ఆధారపడ్డం తప్పు





ఎంత వయసొచ్చినా, ఏ స్థితిలో ఉన్నా మనిషి మీద మనిషి ఆధారపడ్డం తప్పు కాదని నా అనుకోలు. ఎందాకా ఆధారపడొచ్చు ? అంటే ఏమీ చెప్పలేం. దీనికి వారివారి ప్రత్యేక మానసిక, భౌతిక పరిస్థితులే తప్ప కఠిన, జటిల నియమాలంటూ ఏమీ కనిపించడంలేదు. ఒక చిన్నబిడ్డ తన తల్లి మీద నూటికి ఇన్నూఱు పాళ్ళు ఆధారపడతాడు. అతని ఏడుపు ఆమెకి శాసనం. అతని నవ్వు ఆమెకి పద్మశ్రీ. తాను ఆమె మీద విపరీతంగా ఆధారపడుతున్నాననే స్పృహ అతనికి లేదు. ఆమెకా స్పృహ ఉన్నా అది ఆమెకి తప్పు కాదు. అంటే ఇక్కడ ఆధారపడ్డాన్ని నిర్దోషం చేసేవి ఈ పరస్పర సానుకూల వైఖరులే. ఆధారపడుతున్నామనే ఆ స్పృహే ఉండకూడదు. లేదా అది తప్పు కాదనే స్పృహైనా ఉండాలి.

ఎదిగిన మనుషులు భౌతికంగానో, పాదార్థికం (material) గానో, ఆర్థికంగానో ఆధారపడేదాని కంటే కూడా మానసికంగానే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడుతూంటారు. నిఱుటి మాట. లక్ష్మీనారాయణుల వంటి ఆ భార్యాభర్తలు పల్లెటూళ్ళో ఉంటున్నారు. భార్యకి తొంభైరెండేళ్ళు. భర్తకి తొంభయ్యాఱేళ్ళు. ఆవిడ ఆరోజు పొద్దున పూజ ముగించుకొని భర్త దగ్గఱికి వచ్చింది. అప్పుడాయన హాల్లో కూర్చుని ’ఈనాడు’ చదువుతున్నాడు. "ఎందుకో నీరసంగా ఉందండీ" అంటూ ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడింది. "ఏమీ తినకుండా, తాగకుండా పొద్దునే పూజలో కూర్చుంటే నీరసం రాదూ ? పంచదారనీళ్ళు తెస్తానాగు": అని ఆయన వంటగదిలోకి వెళ్ళాడు. ఆయన అది తెచ్చేలోపలే ముసలావిడ చనిపోయింది. బంధువుల్లో బతికున్నవాళ్ళంతా వచ్చారు. అపరకర్మలన్నీ ముసలాయన చేతి మీదుగానే జఱిగాయి. పధ్నాలుగో రోజున పొద్దునే లేచి ఈనాడు పేపర్ పట్టుకొని "మీ అమ్మ పూజ ఇంకా అవ్వలేదుటే ? వచ్చి కాఫీ కలపమని చెప్పు" అన్నాడు. "అమ్మ చనిపోయింది కదా నాన్నా ?" అన్నది ఆయన డెబ్భైరెండేళ్ళ కూతురు నవ్వాలో ఏడవాలో అర్థం కాక ! ముసలాయన మతిపోయినట్లయ్యాడు. భార్య చనిపోయిందనే విషయం నమ్మలేకపోతున్నాడు. వాళ్ళకి ఆనాటి హిందూ ఆచారం ప్రకారం ఎనిమిదో యేటనే పెళ్ళయింది. ఇద్దఱూ కలిసి బడికెళ్ళేవారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆవిడ బడి మానేసింది. ఆయన మాత్రం డిగ్రీ దాకా చదివాడు కానీ ఉద్యోగాలేమీ చెయ్యలేదు. పిత్రార్జిత ఆస్తులు చూసుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఆ పల్లెటూళ్ళోనే ఎనభై ఎనిమిదేళ్ళ పాటు కాపురం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా "ఆవిడ లేదు" అంటే ఆ మనిషికి కాలో చెయ్యో విఱిగిపోయినట్లుండడం బహుశా సహజమే. వీళ్ళలో ఎవరు ఎవరి మీద ఎక్కువ ఆధారపడ్డారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. పెద్దగా చదువుకోని, ఉద్యోగాలు చెయ్యని, జీవితంలో ఒక్క పైసా సంపాదించని ముసలావిడ తన భర్త మీద ఆధారపడిందా ? లేక ఆ భర్త ఆమె మరణానికి మతిపోయేంతగా ఆమె మీద ఆధారపడ్డాడా ? ఏమో !

నాకు ఆర్థిక స్వాతంత్ర్యం లేని రోజుల్లో కూడా మానసిక స్వాతంత్ర్యం బాగానే ఉండేది. ఎవరికైనా, ఎప్పటికైనా కావాల్సింది అదే. నడమంత్రపు సిరివల్ల మన మనస్తత్త్వంలో విప్లవాత్మక, నాటకీయ పరిణామాలు చోటు చేసుకోకుండా అది కాపాడుతుంది, కండిషన్ లో ఉంచుతుంది. ఒకరి మీద ఆధారపడి ఉన్నామనే ఆత్మన్యూనతాభావం మనలో ప్రవేశిస్తే - ఆ తరువాత మనం స్వతంత్రులమైన రోజున ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే సంభావ్యత లేకపోలేదు. నూటికి నూఱు శాతం ఇతరుల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆ భావం మనసులో లేని పసిబిడ్డ యొక్క నిర్మలత్వమూ, మానసిక స్వేచ్ఛా మనకాదర్శం కావాలి. అలాగే ఆధారభూతులు కూడా తమ ఆధారితులు తమ మూలంగా ఆత్మన్యూనతా భావానికి లోనుకాని విధంగా వివేకమూ, ఔదార్యమూ కలిగి జాగ్రత్తగా మసులుకుంటే బావుంటుంది

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070