Tuesday, September 15, 2009

మోక్షగుండం విశ్వేశ్వరాయ (విశ్వేశ్వరయ్య కాదు)

పేరు :మోక్షగుండం విశ్వేశ్వరాయ (మోక్షగుండం విశ్వేశరయ్య కాదు)
తండ్రి పేరు :శ్రీ శ్రీనివాసశాస్త్రి
తల్లి పేరు :వెంకాయమ్మ
పుట్టిన తేది :1861 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం :ముద్దినేహళ్ళి
చదివిన ప్రదేశం :చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో సెంట్రల్ కాలేజీ
చదువు :ఇంజనీరింగు
గొప్పదనం :ఆయన మైసూరు రాష్ట్రప్రగతిలో మరపురాని పాత్ర వహించారు. కృష్ణరాజసాగర్ డాం నిర్మాణం, మైసూరు యూనివర్శిటీ స్థాపన, మైసూరు బ్యాంకు స్థాపన, ఆయన కృషివల్లనే జరిగాయి.

స్వర్గస్తుడైన తేది :14 - 4 -1962

మోక్షగుండం విశ్వేశ్వరాయ 1816 లో బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. మోక్షగుండం అనే గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. తండ్రి శ్రీ శ్రీనివాసశాస్త్రి సంస్కృత పండితుడు. ఎంతో క్రమశిక్షణ గలవ్యక్తి, తల్లి వెంకాయమ్మ మహాభక్తురాలు. తండ్రి ఎక్కువగా ఇతర గ్రామాలు తిరుగుతూండటం వలన కొడుకును తీర్చిదిద్దే బాధ్యత తల్లిమీద పడింది. ఆమె కొడుకును ఎంతో శ్రద్దగా, కంటికి రెప్పలా చూసుకుంటూ మంచి అలవాట్లను నేర్పి ఉత్తముడుగా తీర్చిదిద్దడంలో కృతకృత్యురాలైంది. విశ్వేశ్వరాయగారికి 90 సంవత్సరాల వయసున్నప్పుడు జరిగిన సన్మానంలో కొందరు విలేఖరులు, 'మీకు ఇంత మంచి పేరు రావటానికి కారణం ఏమిటి?' అని ప్రశ్నించినప్పుడు, ఆయన తడుముకోకుండా 'మా తల్లిగారు నేర్పిన మంచి అలవాట్లే. ఆమె నాకు తల్లిమాత్రమేకాదు, స్నేహితురాలు, మార్గదర్శకురాలు కూడా' అన్నారు.

విశ్వేశ్వరాయ 5 సంవత్సరాల ప్రాయంలోఉండగా వారి కుటుంబం చిక్ బల్లాపూర్‌కు మారింది. అక్కడే అతని హైస్కూలు చదువు జరిగింది. అతని మామ రామయ్య మేనల్లుడికి ఎంతో అభిమానంతో ప్రతీ విషయంలో సలహాలిచ్చి, బాగా చదువుకోవటానికి, నిజాయితీగా ప్రవర్తించడానికి ఎంతో దోహదపడ్డాడు. పాఠశాలలో నాదముని నాయుడు అనే ఉపాధ్యాయుడు, అతనికి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గ్రహించి, ప్రతిరోజూ తన ఇంటికి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా ప్రపంచ చరిత్ర, గణితశాస్త్రం గురించి బోధించేవాడు. పాఠశాల చదువు అనంతరం మేనమామ ఆర్థిక సహాయంతో బెంగుళూరులో సెంట్రల్ కాలేజీలో బి.ఏ. లో చేరారు. ఆ సమయంలో తండ్రి మరణం అతన్ని మానసికంగా ఎంతో క్రుంగదీసింది. అయినా సరే అతను పట్టుదలతో చదువుకుంటూ, తన ఫీజులు కట్టడానికి, సాయంత్రం సమయాల్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పి, దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ బి.ఏ. పూర్తి చేశారు. తరువాత మైసూరు మహారాజు వారి ఆర్థికసహాయంతో పూనాలో ఇంజనీరింగు చదివి, బొంబాయిలో ప్రభుత్వ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించారు. 1884 లో చేరిన ఆ ఉద్యోగంలో ఆయన బొంబాయి పట్టణ అభివృద్దికి అపారమైన సేవలందించారు.

1908 తో ఆ ఉద్యోగానికి రాజీనామా యిచ్చి నిజాం నవాబు ఆహ్వానంపై హైదరాబాదు వచ్చి రెండు రిజర్వాయరులు నిర్మించి, పట్టణ డ్రైనేజి పధకం తయారు చేసి, ఏడు నెలలలో కార్యక్రమం పూర్తిచేసి నవాబుగారి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విశ్వేశ్వరాయ మైసూరు మహారాజు వారి అభ్యర్థనపై ఆస్థానంలో చీఫ్ ఇంజనీరుగా చేరి, అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసి 1912లో దివాన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వేశ్వరాయలోని క్రమశిక్షణ, పనియందు గౌరవాభిమానాలు, నిజాయితీ గురించి ఆ రోజుల్లో ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ, మనసా, వాచా, త్రికరణశుద్దిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పాటుపడిన ఆ మహవ్యక్తికి, మైసూరు మహరాజు శ్రీ కృష్ణరాజ వడియార్ ఒకసారి రెండులక్షలరూపాయలు బహుమానంగా ప్రకటించినప్పుడు దానికి సమాధానంగా 'నాకు ఖర్చులు లేవు. నేను చేసిన పనికి సరిపడినంత జీతం మీరిస్తున్నారు. ఇంకా వేరే బహుమతి ఎందుకు ఆ సొమ్మును దేశ అభివృద్దికి ఖర్చుపెట్టండి' అని అన్నారు. మహరాజు ఒక గొప్ప బిరుదును ఇవ్వబోగా, అది కూడా వద్దు అని తిరస్కరించారు. ఒకసారి తన స్వంత పని మీద యూరపు వెళ్ళవలసి వచ్చినప్పుడు బ్యాంకులో అప్పు తీసుకోబోగా, బ్యాంకు మేనేజరు వడ్డీ తగ్గించబోయారు. దాంతో ఆయన మండిపడి 'ఏం నేను అందరి మనుషుల్లాంటివాడినికానా? నాకు ఎందుకు ఈ తగ్గింపు? ఇలా అయితే నాకు మీ అప్పే అవసరంలేదు. మరొకరి దగ్గరకు వెళతాను' అన్నారు.

ఆయన మైసూరు రాష్ట్రప్రగతిలో మరపురాని పాత్ర వహించారు. కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణం, మైసూరు యూనివర్శిటీ స్థాపన, మైసూరు బ్యాంకు స్థాపన, ఆయన కృషివల్లనే జరిగాయి. పనినే దైవంగా భావిస్తూ, సత్ప్రవర్తన, నిజాయితీ వ్యక్తిగత క్రమశిక్షణ గల శ్రీ విశ్వేశ్వరాయకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరమైన 'భారత రత్న' బిరుదునిచ్చి సత్కరించగా, దేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి వారిని గౌరవించాయి. 1962 ఏప్రిల్ 14న స్వర్గస్థులైన భారతరత్న డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

మూలం:- జాతిరత్నాలు, బి.వి. పట్టాభిరాం, శ్రీమహాలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070