Thursday, August 13, 2009

ఆఁకొన్న కూడె యమృతము

ఆఁకొన్న కూడె యమృతము

తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్

సోఁకోర్చువాఁడె మనుజుఁడు

తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

తాత్పర్యం: లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.


ఆకలితో ఉన్నప్పుడు అన్నం అమృతంలాగా ఉంటుందంటున్నారు. ఈ సంగతి మనందరికీ కనీసం ఒక్కసారయినా అనుభవం అయ్యే ఉంటుదని కదా...! అసలు అలాంటివి అప్పుడప్పుడు జరిగితేనే మనకు కూడా ఆ విలువ తెలిసి వస్తుంది.
ఈ సంగతి చెప్తుంటే నాకొకటి జ్ఞాపకం వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చదవడానికి హాస్టల్ లో మొదటిసారిగా చేరాను. మెస్ కి వెళ్ళిన ప్రతీ పూట నా కంచంలో కనీసం సగభాగం పడెయ్యడానికి ఉండేది. నిజానికి ఆ హాస్టల్ లో భోజనం చాలా బావుంటుంది. ఆ సంగతి నాకు తరవాత వేరే వేరే hostels కి వెళ్ళినప్పుడు అర్ధం అయింది :) అప్పట్లో నాకు రోజూ సరిగ్గా తినబుద్ది కాక పడేస్తూనే ఉండేదాన్ని. అలా ఎంత అన్నం వేస్ట్ అయ్యిందో అప్పుడు ఆలోచించలేదు కానీ, ఇప్పుడు గుర్తు వస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అయితే ఒక సారి నేను Masters చదువుతున్నప్పుడు ఒక ఆదివారం ఉదయం నుంచి ఏమీ తినక చాలా ఆకలిగా ఉంది. మా మెస్ లో ఆదివారం ప్రత్యేకంగా మంచి వంటలు చేసేవాళ్ళు. రోజే మధ్యాహ్నం క్లాస్ ఎక్కువసేపు ఉండటంవల్ల మెస్ కి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికి అన్ని అయిపోయి పాత్రలు ఖాళీగా ఉన్నాయి. అసలారోజు ఎంత ఆకలేసిందో.. క్యాంటీన్ కూడా ఉండదు ఆ సమయానికి...చాలా బాధగా అనిపించింది. ఇలాంటప్పుడు అసలే ఇల్లు కూడా గుర్తొస్తుందిగా ... అన్ని కలిసిపోయి చాలా బాధపడిపోయాను. మొత్తానికి ఆ సంఘటన ఎందుకో నన్ను బాగా కదిలించింది. నాకే తెలీకుండా నాలో చాలా మార్పు వచ్చేసింది. అప్పటినుంచి ఏ తిండి పథార్దాలు వృధాగా పడేయ్యలేదు. ముందే చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం పెట్టుకోడం అలవాటు చేసుకున్నాను. ఒకవేళ ఏదయినా నచ్చకపోయినా చాలా కష్టపడి తినడానికే ప్రయత్నిస్తున్నాను. మొత్తానికి ఒక చిన్న సంఘటన అనుకోకుండా నాలో చాలా మంచి అలవాటునీ, మార్పునీ తీసుకొచ్చింది. చిన్నప్పుడు అన్నం తిననని అలిగితే మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది. మనం అన్నం ముందు కూర్చోగానే అన్నం భయపడుతూ ఉంటుందట మనమేమి అంటామో అని. మనం పేచీలు పెట్టకుండా ఆనందంగా తినేస్తే సంతోషంగా ఉంటుంది. మన దగ్గరికెప్పుడూ వస్తుందంట, లేకపోతే మనకి దొరకదంట. అందుకే మనం మాత్రం ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆ మాత్రం తినడానికి లేక ఎన్నో కోట్ల మంది ప్రపంచంలో అల్లాడుతున్నారు కదా...అందుకే మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం..!


బాధపడకుండా ఇచ్చేవాడే దాత అంటున్నారు కదా..! అసలు నాకనిపిస్తుంది ఒక మనిషిగా అవసరంలో ఉన్నవాళ్ళకి సహాయం చేయడం కనీస మానవ ధర్మం కదా..! మన దగ్గర మన అవసరానికంటే ఎక్కువగా ఉన్నది ఏదయినా లేని వాళ్ళకి ఇవ్వడం లో ఎంత సంతోషం, తృప్తి ఉంటాయో...ఒక్కసారయినా చేస్తేనే తెలుస్తుంది. అంత సంతృప్తి ఒక పది వేలు ఖర్చుపెట్టి మనకోసం బట్టలు, బంగారంలాంటివి కొనుక్కున్నా రాదు. అసలు అయినా ఒకవేళ అలా మనం చేయగలిగిన సహాయం ఏదయినా చేసినా మనమేదో దానం చేసినట్టు కాదని నాకనిపిస్తుంది. దానం అనేది మరీ పెద్ద పదమేమో కదా..!

ఏది ఏమైనా.. ఈ పద్యంలో నీతి ఎంత గొప్పదో కదా.

మీరేమంటారూ మరి

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070