Monday, June 29, 2009

భగవాన్ ! ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి

రమణ మహర్షి ధ్యాన సంపత్తిని సముద్రాలు దాటించి మహర్షిని విశ్వర్షిగా మలిచిన తొలి పాశ్చాత్య భక్త వరేణ్యుడు పాల్ బ్రంటన్. పాల్ బ్రంటన్ ఇంగ్లండులో ప్రముఖ జర్నలిస్టు. మంచి రచయిత, సాహితీపరుడు. ఆంత్రోపాలజీ, మతం వంటి విషయాలపట్ల ఆసక్తి కలవాడు. చేస్తున్న ఉద్యోగం వదిలి 1930 లో భారతదేశం వచ్చాడు. భారతదేశంలోని యోగులు,మహర్షులపైన పరిశోధన చేయాలన్నది అతని సంకల్పం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, తపోభూమి. ఇక్కడ అడుగడుగునా యోగులుంటారని, ఇది అంతా కీకారణ్యమని పాశ్చాత్యుల భావన.పాల్ బ్రంటన్ తన తత్వజిజ్ఞాసలో భాగంగా చాలా దేశాలు పర్యటించాడు. ఈజిఫ్టులో రహస్య స్థావరాలలో ఉండే మాంత్రికుల్ని, తాంత్రికుల్ని కలిశాడు. ముంబాయిలో మహమూద్ బే అనే సూఫీ యోగి ని కలిశాడు. నాసిక్ లో మెహర్ బాబాను, ఆయన గురువును దర్శించాడు. పూనేలో బాబాజాన్ ని పరిచయం చేసుకున్నాడు. సుఖానంద రాజగోపాలస్వామిని, కాంచీపురంలో శంకరాచార్యను కలుసుకున్నాడు.

కంచి శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామిని సేవించి తనకు జ్ఞానమార్గం చూపమని అర్థించాడు. ఆయనే పాల్ బ్రంటన్ ను రమణ మహర్షివద్దకు వెళ్లమని సలహా చెప్పాడు. తన శిష్యుడు వెంకటరమణిని బ్రంటన్ కు తోడుగా పంపారు. తాను దేశ పర్యటనలో వున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పమని మరీ చెప్పి పంపారు. కంచి శంకరాచార్య రమణ మహర్షిని తన హృదయస్థ గురువుగా భావించేవారు.

పాల్ బ్రంటన్ మద్రాసు నిండి తిరువణ్ణామలై చేరుకున్నాడు. ఆశ్రమం చేరి మహర్షికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు. మహర్సి సన్నిధిలో చాలా మంది భక్తులున్నారు. అందరూ నిశ్శబ్దంగా, ధ్యానంలో ఉన్నారు. మహర్షి ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నారు. భక్తుల తృప్తికోసం అలా కూర్చున్నారేమో అనిపించింది. అంత నిబ్బరంగా, ప్రపంచ, పరిసరాలు ఏవీ పట్టనట్లు ఉండడం ఎలా సాధ్యం !

అలా అనుకున్న మరుక్షణంలో అతని మనస్సు శూన్యమైంది. నిరామయమైంది. లోపల ఒక్క భావం కదలడం లేదు. తనలో చకచక వస్తున్న మార్పులకు ఉక్కిరిబిక్కిరైనాడు. తన చూట్టూ కాంతి ప్రవాహాలు, తనలో శాంతి తరంగాలు. ఆలోచనలతో కలవరపడే మనస్సు క్షణంలో నిర్మలమైంది. ఇది ఎలా సాధ్యం? ఆ క్షణంలో అనిపించింది 'మనిషి వివేకమే సమస్యల్ని సృష్టిస్తుందని '. ఆ వివేకమే తను సృష్టించుకున్న సమస్యలకు పరిష్కారం వెదుకుతుంది. రెండింటికీ మనసే మూలం, ఆధారం. తనలో అంతటి శాంతికి, ప్రశంతతకి కారణం మహర్షి దర్శనం, మహర్షి వీక్షణం. ఆ విషయం తెలుసుకోడానికి క్షణకాలం పట్టలేదు బ్రంటన్ కు.

ఆ తర్వాత పాల్ బ్రంటన్ భగవాన్ తో చాలాసార్లు సంభాషణలు జరిపాడు. వాటిల్లో కొన్ని

'ప్రపంచ భవిస్యత్తు ఎలా ఉంటుంది? ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి!'
'భవిష్యత్తు గురించి ఇప్పుడెందుకు ఆలోచన. ప్రపంచం గురించి మీరెందుకు విచారిస్తారు? మీకు వర్తమానం తెలియదు. వర్తమానం గురించి తెలియనివారు భవిష్యత్తును ఏం బాగు చేస్తారు? మీరు ప్రస్తుతాన్ని చక్కదిద్దుకోండి. భవిష్యత్తు తన పని తను చూసుకుంటుంది.'

'భగవాన్ ! ప్రపంచ దేశాల మధ్య ఇకనైనా మైత్రి నెలకొంటుందా? లేక ఇలాగే వినాశం వైపు పరుగులు తీస్తుందా?'
'పాల్! లోకాన్ని పాలించే వాడొకడున్నాడు. తను చూసుకుంటాడు ప్రపంచం సంగతి. ఈ ప్రపంచం బాధ్యత ఆయనది, ఆ పని నీది కాదు.'

'ఏమిటో భగవాన్ ! చుట్టూ చూస్తుంటే అంతా అయోమయం. ఎక్కడ సహాయానుభూతి కనిపించదు. '
'నీవు ఎంతో ప్రపంచమూ అంతే. నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటావు! అయినా అది సత్యాన్వేషుల పని కాదు. అలాంటి ప్రశ్నలతో కాలాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దు. ముందుగా నీ వరకు సత్యాన్ని అన్వేషించు. సత్యాన్ని తెలుసుకో. తర్వాత నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రాపంచిక సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నది నీవొక్కడివే కాదు. ప్రపంచం నీ వొక్కడితో లేదు. అసలు ప్రపంచానికి నీవు భిన్నం అని ఎందుకనుకుంటున్నావు?

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070