విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం |ఎప్పుడూ|
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు చిన్నదేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు తక్కువేనురా
ఈ పాట లో ఓటమిని ఒప్పుకోవద్దు అని తెలియజేయటానికి ఒక చిన్న చేప పిల్ల ముందున్న పెద్ద సముద్రము, గువ్వపిల్ల ముందున్న పెద్ద నింగిని ఉదాహరణగా తీసుకున్నారు (సిరివిన్నెల), గువ్వపిల్ల కానీ చేపపిల్ల కానీ ఓటమిని ఒప్పుకుంటే అవి బ్రతకలేవు, అవి ఓటమిని ఒప్పుకోలేదు కనుకనే వాటికి పెద్ద సముద్రము, నింగి చిన్నవిగా కనిపిస్తున్నాయి.
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటక పడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురాగుటక పడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
రగులుతున్న గుండె కూడ సూర్య గొళమంటిదేనురా|ఎప్పుడూ|
సంధ్యని అసుర సంధ్య అని కూడా అంటారు ఎందుకంటే అది పశ్చిమాన వుండి వెలుతురుని (సూర్యుడిని) మింగేస్తుంది కనుక, అటువంటి అసుర సంధ్య కూడా రవి (సూర్యుడు) నిరంతర ప్రయత్నం వలన ఒక్కసారి కూడా నెగ్గలేకపోయింది. అసుర సంధ్య గొంతులోనున్న అగ్గివుండ (సూర్యుడు) సాగరాలని కిందనుంచి ఈదుకుంటూ తిరిగి తూర్పున తేలుతుంది (ఉదయిస్తుంది). నిశ అంటే చీకటి ఇక్కడ నిశ అంటే కష్టము. చీకటి, కష్టము జీవితములో ఎంతోకాలం వుండవు, ఉషోదయము అంటే కవి దృష్టిలో సుభప్రదము (మంచి రోజులు)… ఉషోదయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ రగులుతున్న గుండెని సూర్యునితొ పోల్చి చెప్పి దానికి కూడా ఓటమి వుండదు అని చెప్పటం… నాకు చాల బాగా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చిన మరొక విషయం ఎమిటంటే కవి సంధ్యా సమయాన్ని పరమ పవిత్రంగా వేరొక పాటలో పోల్చారు.
నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాశ నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా
ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక శవముపైనె గెలుపు చాటురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా |ఎప్పుడూ|
జననం నుంచి మరణం వరకూ జీవితంలో అడుగూడుగునా నొప్పిలేని నిముషాలు అంటూ లేవు, బ్రతుకు అంటేనే నిత్యం ఘర్షణలతో నిండి వుంది. అలా అని నీరశించి కూర్చుంటే జీవితాన్ని ఆస్వాదించేదెప్పుడు? ఈ బాధలనుంచి బయటకి రావటానికి వేరే ఎవరి సహాయము కోరనవసరము కూడా లేదు. దేహం, ప్రాణం, నెత్తురు మరియు సత్తువ వీటికి మించిన సైన్యం ఎక్కడా వుండదు. ఆయువు వున్నవరకూ చావు కూడా నెగ్గలేక ఊపిరి లేని (ప్రయత్నం చెయ్యని) శవం పైన తన ఆధిక్యాని చూపించగల్గుతుంది. నిరంతర ప్రయత్నము వలన నిరాశకి కూడా నిరాశ కలుగుతుంది.అందుకే ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దు.